అవినీతి లక్ష్మి
అన్ని చోట్లా చేతివాటం చూపించిన విజయలక్ష్మి
హైదరాబాద్‌లో పనిచేసినప్పుడే భారీగా అక్రమార్జన
పర్యాటక శాఖలోనూ అవినీతి ఆరోపణలు
అడుగడుగునా ఆమ్యామ్యాలు... పర్సంటేజీలు
అంగన్‌వాడీ పోస్టుల నియామకాల్లోనూ చేతివాటం
స్త్రీ, శిశు సంక్షేమం చూడాల్సిన ఆమె తన కుటుంబ సంక్షేమాన్ని చూసుకుంది. పైకి భయస్తురాలిగా కనిపిస్తూనే అందినకాడికి దోచుకుని కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టుకుంది. ఫైళ్లపై సంతకాల నుంచి అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాల నియామకాలు... ఆఖరికి కేంద్రాలకు సరకుల పంపిణీకి సంబంధించిన బిల్లుల చెల్లింపు... ఇలా ప్రతీదానికో రేటు పెట్టి అక్రమార్జనను తారస్థాయికి తీసుకెళ్లింది. ఒక్క విశాఖలోనే రూ.10 కోట్లకు పైగా విలువ చేసే ఆస్తులు కూడబెట్టిందంటే అవినీతి లక్ష్మి లీలలు అర్థం చేసుకోవచ్చు. ఐసీడీఎస్ పీడీ ఎం.విజయలక్ష్మి ఇంటిపై ఏసీబీ అధికారులు శుక్రవారం చేసిన దాడిలో వెలుగుచూసిన ఆస్తులు చూసి అందరూ అవాక్కయ్యారు. ఇక ఐసీడీఎస్‌లో కలకలం రేపిందనే చెప్పుకోవచ్చు. - సాక్షి, విశాఖపట్నం
విశాఖపట్నం : స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో 1994లో అడుగుపెట్టిన విజయలక్ష్మి తన సర్వీసులో ఎక్కువ కాలం విశాఖ జిల్లాలోనే పనిచేశారు. విశాఖ అర్బన్ సీడీపీవోగా ప్రస్థానం ప్రారంభించిన ఆమె ఆ తర్వాత అనంతగిరి, అనకాపల్లి సీడీపీవోగా పనిచేశారు. అక్కడి నుంచి ఏడీగా పదోన్నతిపై హైదరాబాద్ కేంద్ర కార్యాలయానికి వెళ్లింది. ఆ తర్వాత కొద్దికాలం డెప్యుటేషన్ కింద పర్యాటక శాఖలో కూడా పనిచేశారు. 2014లో ఐసీడీఎస్ జిల్లా ప్రాజెక్టు డెరైక్టర్ పోస్టు ఖాళీ కావడంతో అదనపు పీడీగా చిన్మయిదేవి బాధ్యతలు చేపట్టారు. కానీ రాజకీయ పలుకుబడితో చిన్మయిదేవి స్థానంలో పీడీగా విజయలక్ష్మి 2015 ఆగస్టులో ఇక్కడకు మళ్లీ వచ్చారు. చేరిన వెంటనే మూడు నెలల పాటు సెలవుపై వెళ్లిన ఆమె ఆ తర్వాత విధుల్లో చేరారు. ఇక్కడ చేరింది మొదలు కార్యాలయ సిబ్బందితోపాటు కింది స్థాయి అధికారులతో చీటికీమాటికీ గిల్లికజ్జాలు పెట్టుకునే వారు. చివరకు ఈమెకు, సిబ్బందికి మధ్య విబేధాలు కలెక్టర్ వరకు చేరడంతో ఆయన కూడా పలుమార్లు విజయలక్ష్మికి చీవాట్లు పెట్టినట్లు సమాచారం.
అంగన్‌వాడీల్లోనే భారీ అక్రమార్జన?
విజయలక్ష్మి విధుల్లో చేరిన కొద్ది రోజులకే అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయా పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం అప్పట్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలకు కాసులపంట పండించింది. అంగట్లో సరుకుల్లా ఈ పోస్టుల అమ్మకాలు సాగాయి. కార్యకర్త పోస్టును రూ.3లక్షల నుంచి రూ.5లక్షల వరకు అమ్ముకోగా, ఆయా పోస్టును రూ.50వేల నుంచి రూ.లక్షా 50వేల వరకు అమ్ముకున్నట్టుగా పత్రికల్లో ప్రముఖంగా వరుస కథనాలు కూడా వచ్చాయి. ఈ విధంగా అప్పట్లో రూ.10కోట్లకుపైగా చేతులు మారినట్టు విజిలెన్స్‌అధికారులు సైతం ప్రభుత్వానికి నివేదించిన విషయం తెలిసిందే. ఈ అమ్మకాలన్నీ ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే జరిగినప్పటికీ ఐసీడీఎస్ అధికారులు కూడా చేతివాటం ప్రదర్శించినట్టు ఆరోపణలు వచ్చాయి. ఒక్కో పోస్టుకు రూ.లక్ష వరకు మధ్యవర్తుల ద్వారా ఈమె వసూలు చేసిన ట్టుగా ఆరోపణలు వినిపించాయి. ముఖ్యంగా సూపర్‌వైజర్ పోస్టుల భర్తీలో పీడీ విజయలక్ష్మిపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ కూడా జరిగినట్టు సమాచారం. గతంలో సీడీపీవోగా జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పనిచేసినప్పుడు భారీగానే చేతివాటం ప్రదర్శించినట్టు ఆరోపణలు ఉన్నాయి.
హైదరాబాద్‌లోనూ భారీ సంపాదన
విజయలక్ష్మి అక్రమార్జనలో ఎక్కువ భాగం హైదరాబాద్‌లోనే జరిగినట్టు తెలుస్తోంది. కేంద్ర కార్యాలయంలో పీడీ హోదాలో పనిచేసిన ప్పుడు ప్రతీ ఫైలుకు రేటుపెట్టి మరీ వసూలు చేసేవారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ తర్వాత పర్యాటక శాఖలో పనిచేసినప్పుడు కూడా ఇదే రీతిలో అవినీతి కార్యకలాపాలు కొనసాగించినట్టు సమాచారం. ఆ తర్వాత పీడీ హోదాలో ఇక్కడకు వచ్చిన ఆమె అంగన్‌వాడీ పోస్టుల భర్తీతోపాటు సరకుల కేటాయింపుల బిల్లుల్లో కూడా చేతివాటం ప్రదర్శించినట్టు తెలుస్తోంది. శుక్రవారం నాటి ఏసీబీ దాడులతో ఈమె ఏ స్థాయిలో అక్రమార్జన సాగించారో తేట తెల్లమైంది. తాను సంపాదించిన అక్రమాస్తులన్నీ బినామీల పేరున పెడితే ప్రమాదమని భావించి అధిక శాతం రిటైర్డ్ పోస్టల్ ఉద్యోగైన తండ్రి పేరిట కొనుగోలు చేసింది. ఆ తర్వాత తన కుటుంబ సభ్యుల పేరు మీద ఈమె మార్చుకున్నట్టు ఏసీబీ అధికారులు తమ తనిఖీల్లో గుర్తించినట్టు సమాచారం. విశాఖతో పాటు ఈమె ఆస్తులన్నీ బెంగళూరు, ప్రకాశం, నెల్లూరుల్లో ఉన్నట్టుగా ఏసీబీ అధికారులు గుర్తించారు.
విశాఖలోనే రూ.10కోట్లకుపైగా ఆస్తులు
విశాఖలోని విజయలక్ష్మి ఇంట్లో జరిపిన దాడుల్లో గుర్తించిన ఆస్తుల విలువే రూ.10 కోట్లకుపైగా ఉం టుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మిగిలిన ప్రాంతాల్లో ఈమె ఆస్తుల విలువ లెక్కిస్తే అక్రమార్జన ఇంకా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. విశాఖలో రెండు అంతస్తుల భవనం, పావు కిలో బంగారు ఆభరణాలు, నాలుగు లక్షల రూపాయల నగదు, రూ.12 లక్షల డిపాజిట్ బాండ్లు, 2 ఖరీదైన కార్లు, బైకు, క్రికెట్ స్టేడియం బి గ్రౌండ్ సమీపంలో ఎమ్‌ఐజీ 59 క్వార్టరుతోపాటు 900 గజాల స్థలం ఉందని అధికారులు గుర్తించారు. మధురవాడ బక్కన్నపాలెంలో 530 గజాల స్థలం, సాగర్‌నగర్‌లో ఎల్‌ఐజీ బి.343 నంబరు ప్లాటు, నగరంలోని విశాఖ కంటి ఆస్పత్రి సమీపంలో సౌఖ్య అపార్టుమెంట్‌లో ప్లాటు ఉన్నట్టు గుర్తించారు. యలమంచలి ఆర్.కోడూరులో 2.73 ఎకరాల వ్యవసాయ భూమి, భోగాపురం మండలం పోలిపల్లిలో 784 గజాల స్థలం, సవరవిల్లిలో 119 గజాల స్థలం, ప్రకాశం జిల్లా కనుమలలో 2.25 ఎకరాల వ్యవసాయ భూములు ఉన్నట్టు గుర్తించారు. ఆస్తులకు సంబంధించి ఇంట్లో లభించిన రికార్డులను, పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇంకా దాడులు పూర్తి కాలేదన్నారు. దాడుల్లో ఏసీబీ డీఎస్పీ కె.రామకృష్ణ ప్రసాద్‌తోపాటు విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం ఇన్‌స్పెక్టర్లు రమణమూర్తి, గణేష్, లక్మోజీ, రమేష్, శ్రీనివాసరావు తదితర సిబ్బంది పాల్గొన్నారు.