చెత్త ఫైటింగ్
కార్మికుల మధ్య తోపులాట
నేడు ప్రజాప్రతినిధుల ఇళ్ల ముట్టడి
పారిశుధ్య విధుల్లో డ్వాక్వా మహిళలు
విజయవాడ సెంట్రల్ : నగరపాలక సంస్థలో కార్మికుల మధ్య ‘చెత్త’ ఫైటింగ్ ఆరంభమైంది. కాంట్రాక్ట్ పద్ధతిపై విధుల్లో పాల్గొనేందుకు వచ్చిన డ్వాక్రా మహిళలతో ఔట్‌సోర్సింగ్ సిబ్బంది వాదనకు దిగారు. మా పొట్టలు కొట్టొద్దంటూ విన్నపాలు చేశారు. కాంట్రాక్ట్ కార్మికులు ససేమిరా అనడంతో అడ్డుకున్నారు. ఈ క్రమంలో కార్మికుల మధ్య తోపులాటలు జరిగాయి. కృష్ణలంక, లంబాడీపేట, కుమ్మరిపాలె ం, పాయకాపురం, పటమట ప్రాంతాల్లో బుధవారం ఇలాంటి ఘర్షణలు చోటుచేసుకున్నాయి. మల్లికార్జునపేటలో కార్మికుల మధ్య వివాదం ముదరడంతో ప్రజారోగ్య శాఖాధికారులు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. డ్వాక్వా మహిళల విధులకు ఆటంకం కలిగిస్తే సహించేది లేదని కమిషనర్ జి.వీరపాండియన్ హెచ్చరించారు.
ఫలిస్తున్న ప్రయత్నాలు
ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో భాగంగా కమిషనర్ చేపట్టిన ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. డ్వాక్వా మహిళలు పారిశుధ్య విధుల్లో పాల్గొనేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. సర్కిల్-1లో 102, 2-లో 130, 3-లో 60 మంది చొప్పున కాంట్రాక్ట్ కార్మికులు విధులకు హాజరయ్యారు. కొన్ని ప్రాంతాల్లో అధికార పార్టీ కార్పొరేటర్లు, ఎన్‌సీసీ విద్యార్థులు వీధులను శుభ్రపరిచారు.
కార్మిక సంఘాల అత్యవసర భేటీ
అధికార పార్టీ ప్రజాప్రతినిధులు సమ్మెను నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నాలు సాగించడంపై ట్రేడ్ యూనియన్ నాయకులు, కార్మికులు మండిపడుతున్నారు. ప్రెస్‌క్లబ్‌లో అత్యవసర భేటీ నిర్వహించారు. సమ్మె సెగను మరింత రగిలించాలని నిర్ణయించారు. గురువారం నుంచి నగరంలోని ప్రజాప్రతినిధుల ఇళ్లను ముట్టడించాలని నిర్ణయించారు. 17న సీఎం క్యాంప్ కార్యాలయ ముట్టడి కార్యక్రమాన్ని భారీఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు ఆసుల రంగనాయకులు మాట్లాడుతూ కాకినాడ టీడీపీ ఎమ్మెల్యే ఔట్‌సోర్సింగ్ కార్మికుల సమ్మెకు సంఘీభావం తెలపడం అభినందనీయమన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు కార్మికుల హక్కుల్ని కాలరాసే విధంగా ప్రయత్నాలు సాగించడం సిగ్గుచేటన్నారు. పోలీసు కేసులకు వెరచేది లేదని స్పష్టం చేశారు.