పై-లీన్ వచ్చింది, సర్వనాశనం చేసింది. హెలెన్ వచ్చింది. తీవ్ర నష్టాలు మిగిల్చి వెళ్లింది. ఈ రెండూ సరిపోవన్నట్లు ఇప్పుడు కొత్తగా మరో తుఫాను వస్తోంది. అవును.. రాష్ట్రానికి మరో తుఫాను ముప్పు పొంచి ఉంది. అండమాన్ సమీపంలో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. తీవ్ర వాయుగుండంగా మారింది. ఈ కొత్త తుఫానుకు 'లెహర్' అని పేరు పెట్టారు. ఇది మంగళవారంలోగా వాయవ్య దిశగా మన రాష్ట్రంవైపు పయనించే అవకాశం ఉంది. గురువారం నాడు ఇది తీరాన్ని దాటొచ్చని భావిస్తున్నారు. శుక్రవారం నాడు తీరాన్ని దాటిన హెలెన్ తుఫాను కన్నా ఈ లెహర్ తుఫాను మరింత ప్రమాదకరమైందని అధికారులు తెలిపారు.
ప్రస్తుతం పోర్ట్బ్లెయిర్కు దక్షిణ ఆగ్నేయంగా 470 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన ఈ తీవ్ర వాయుగుండం, ఈ రాత్రికే తుఫానుగా మారే ప్రమాదం కనిపిస్తోంది. దీంతో రాష్ట్రంలోని అన్ని ప్రధాన ఓడరేవుల్లో ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. దీని ప్రభావంతో అండమాన్ నికోబార్ దీవుల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.
రాష్ట్రానికి పొంచి ఉన్న లెహర్ తుఫాను గండం!!
Published Sun, Nov 24 2013 9:02 AM | Last Updated on Sat, Sep 2 2017 12:57 AM
Advertisement