సాక్షి, అమరావతి/తిరుమల: కలియుగ ఆరాధ్య దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి నైవేద్యం విషయంలో ఏపీ ప్రభుత్వం మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. ప్రతి సోమవారం మధ్యాహ్న వేళ సమర్పించే నైవేద్యాన్ని ఉదయం ఏడు గంటలకు మార్చింది. దీంతో అప్పటి నుంచి రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో జరిగే నైవేద్యం వరకూ స్వామివారిని 13 గంటలపాటు పస్తు ఉంచుతున్నారు. తిరుమల ఆలయంలో ఉదయం వీవీఐపీ బ్రేక్ దర్శనాలకు వచ్చే వారి సంఖ్య ఇటీవల కాలంలో ముఖ్యంగా సోమవారం బాగా పెరిగిపోతోంది. దీంతో ఎల్–2, ఎల్–3 దర్శనాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు శ్రీవారి నైవేద్యం వేళలో కీలక మార్పులు చేస్తూ ఆదివారం ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆదేశాలు సోమవారం నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది. అలాగే ప్రతి సోమవారం స్వామి వారికి మధ్యాహ్న నేవైద్యాన్ని ఉదయం ఏడు గంటలకే పూర్తిచేయాలని అర్చకులను ఆదేశిస్తూ ఆ ఉత్తర్వులో తెలిపింది.
ఈ నిర్ణయంపై హిందూ మత ప్రచారకులు మండిపడుతున్నారు. ఇది స్వామి వారికి మహా అపచారం చేయడమే అవుతుందని హెచ్చరిస్తున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో తెల్లవారుజామున సుప్రభాత సేవ మొదలు రాత్రి పవళింపు సేవ వరకు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి వేళల్లో స్వామివారికి నైవేద్యం సమర్పణ ఉంటుంది. దీనిని త్రికాల నివేదనగా పిలుస్తుంటారు. ప్రస్తుతం శ్రీవారి ఆలయంలో తెల్లవారుజామున సుప్రభాత సేవ, అర్చన కార్యక్రమాల అనంతరం ఉదయం ఐదున్నర గంటలకు స్వామి వారికి తొలివిడత నైవేద్యం సమర్పిస్తారు. దీనిని ప్రాతఃకాల ఆరాధనగా పిలుస్తారు. తొలి విడత నైవేద్యం అనంతరం వీవీఐపీ బ్రేక్ దర్శనాలు కొనసాగుతాయి. రెండో విడతగా మధ్యాహ్నం మళ్లీ నైవేద్యం సమర్పిస్తారు. మూడో విడతగా రాత్రి 8 గంటలకు జరుగుతుంది. వీవీఐపీ కోటా కింద భారీ సంఖ్యలో ఎల్–2, ఎల్–3 దర్శనాలను మధ్యాహ్నం ఎంతసేపైనా కొనసాగించడానికే ప్రభుత్వం మధ్యాహ్నం నైవేద్యం వేళలలో మార్పులు చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
సోమవారమే ఎందుకంటే..
తిరుమలలో ప్రతి సోమవారం కల్యాణోత్సవ మండపంలో ‘విశేష పూజ’సేవ నిర్వహించాల్సి ఉండటం, అదే రోజు వీవీఐపీ బ్రేక్ దర్శనానికి బాగా డిమాండ్ ఉండటం వంటి కారణాలతో ప్రత్యేకించి సోమవారం స్వామి వారికి మధ్యాహ్న వేళ సమర్పించే నైవేద్య వేళలో మార్పులు తీసుకొచ్చారని చెబుతున్నారు. అలాగే, ఈ ఒక్కరోజు మాత్రం తెల్లవారుజామున తొలి విడత నైవేద్యం అనంతరం ఎల్–1 బ్రేక్ దర్శనాలు కొనసాగించి 7 గంటలకు మధ్యాహ్న నైవేద్యం పూర్తిచేసి ఆ తర్వాత ఎల్–2, ఎల్–3 దర్శనాలను ఎంతసేపైనా కొనసాగిస్తారు. మిగిలిన రోజుల్లో మధ్యాహ్న నైవేద్య కార్యక్రమాలు యథావిధిగానే కొనసాగుతాయి. ప్రభుత్వ తాజా ఆదేశాల కారణంగా ప్రతీ సోమవారం తిరుమలలో స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు ఎక్కువసేపు క్యూలలో వేచి ఉండాల్సి వస్తుందని చెబుతున్నారు.
అభ్యంతరాలతో ఆగమ సలహా మండలికి సిఫారసు
మధ్యాహ్న నైవేద్యం వేళలో మార్పుపై అభ్యంతరాలు వ్యక్తమవడంతో ఈ విషయాన్ని పూర్తిస్థాయి పరిశీలనార్ధం ఆగమ సలహా మండలికి సిఫార్సు చేసినట్లు డెప్యూటీ ఈవో హరీంద్రనాథ్ సోమవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. వీరి సలహా వచ్చే వరకు ప్రతి సోమవారం పాత పద్ధతిలోనే మధ్యాహ్న నైవేద్యం నిర్వహిస్తామన్నారు. మరోవైపు.. శ్రీవారి ఆలయంలో ప్రతీ సోమవారం విశేషపూజ నిర్వహణకు తగినంత సమయం కోసం ఆలయ ప్రధాన అర్చకులు, ముగ్గురు ఆగమ పండితులు ఇతర అర్చకుల సలహా మేరకే మధ్యాహ్న నైవేద్యాన్ని సోమవారం ఉ.7 గంటలకు నిర్వహించినట్లు ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment