
గంగిరెద్దులా తలూపడం వల్లే సమస్య
గవర్నర్‌పై మంత్రి అచ్చెన్నాయుడి మండిపాటు
⇒ సెక్షన్ 8 అమలు చేయమంటే కుంటిసాకులు చెబుతారా
⇒ హైదరాబాద్‌లో ఏపీ పోలీస్‌స్టేషన్లు ఏర్పాటుచేస్తాం
⇒ కేసీఆర్‌పై నమోదైన కేసుల దర్యాప్తునకు సిట్
సాక్షి, హైదరాబాద్: ‘పునర్విభజన చట్టంలో సెక్షన్ 8ను అమలు చేయాలని కోరితే.. కేంద్రం మార్గదర్శకాలు జారీ చేయలేదంటూ కుంటిసాకులు చెబుతారా? విభజన చట్టంలోన్ని 34 సెక్షన్లలో ఏ సెక్షన్ అమలుకైనా కేంద్రం మార్గదర్శకాలు జారీ చేసిందా? తెలంగాణ ప్రభుత్వం చెప్పినట్టల్లా గంగిరెద్దులా గవర్నర్ తలూపడం వల్లే సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.
రాజ్యాంగ పరిరక్షణకు ఉద్దేశించిన గవర్నర్ పదవికి అప్రతిష్ట తెచ్చేలా వ్యవహరించొద్దు’ అంటూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌పై కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ స్పందించకపోవడం వల్లే రెండు రాష్ట్రాల మధ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయంటూ మంత్రులు ప్రతిపాటి పుల్లారావు, రావెల కిశోర్‌బాబు చేసిన వ్యాఖ్యలను ఆయన సమర్థించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన బుధవారం జరిగిన మంత్రివర్గం సమావేశం అనంతరం విలేకరులతో మాట్లాడారు. ‘ఫోన్ ట్యాపింగ్ చేశామని తెలంగాణ హోం మంత్రి నాయిని చెప్పారు.
ఆ రాష్ట్ర ఏసీబీ డీజీ ఏకే ఖాన్ మాత్రం ట్యాపింగ్ చేయలేదన్నారు. ఫోన్ ట్యాపింగ్ చేయలేదని రాత పూర్వకంగా హామీ ఇవ్వగలరా అని సవాల్ విసిరితే స్పందించలేదు. అంటే.. చంద్రబాబుసహా 120 మంది ఏపీ మంత్రులు, అధికారుల ఫోన్‌లను తెలంగాణ సర్కారు ట్యాప్ చేసినట్లే కదా?’ అని ప్రశ్నించారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ అధికార యంత్రాంగం ఎన్నికల సంఘం అధీనంలోకి వెళుతుందని, అలాంటప్పుడు ఓటుకు నోటు వ్యవహారంలో కేసు నమోదు చేసే అధికారం ఏసీబీకి లేదన్నారు.
మా పోలీసులతో మాపైనే కేసులా
ఉమ్మడి రాజధానిలో తమ ప్రభుత్వం జీతాలు చెల్లిస్తున్న 45 బెటాలియన్ల పోలీసు బలగాలు విధులు నిర్వహిస్తున్నాయన్నారు. ‘మా ప్రభుత్వంవద్ద జీతాలు తీసుకుంటున్న పోలీసులతోనే మాపై కేసులు పెట్టిస్తారా? అని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో ఏపీ పోలీసుస్టేషన్లను ఏర్పాటుచేసి తీరతామన్నారు.
తెలంగాణ సర్కారుకు నోటీసులు
తెలంగాణ సీఎం కేసీఆర్‌పై ముత్తయ్య ఇచ్చిన ఫిర్యాదుతో సహా 87 కేసులు ఏపీలో నమోదయ్యాయన్నారు. ఆ కేసులపై విచారణకోసం సిట్ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. సీఎం చంద్రబాబుతోసహా 120 మంది మంత్రులు, అధికారుల ఫోన్‌లను తెలంగాణ ప్రభుత్వం ట్యాపింగ్ చేసిందనడానికి ఆధారాలు తమ వద్ద ఉన్నాయన్నారు. కేసీఆర్‌పై నమోదైన కేసులతోపాటూ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలోనూ బుధవారం నుంచి చట్టం తన పని తాను చేస్తుందని, తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తుందన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్ సర్కారు కూడా కుప్పకూలడం ఖాయమన్నారు.
దాటవేత ధోరణి
ఓటుకు నోటు కేసును ఐదు కోట్ల ఆంధ్రుల సమస్యగా చిత్రీకరించి రెండు రాష్ట్రాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టి కేసును పక్కదోవ పట్టించాలని చూస్తున్నారా అని విలేకరులు ప్రశ్నించగా మంత్రులు అచ్చెన్నాయుడు, ప్రత్తిపాటి పుల్లారావులు సమాధానం దాటవేశారు. తెలంగాణ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేసిందనడానికి ఆధారాలు ఉంటే ఎందుకు బహిర్గతం చేయడం లేదన్న ప్రశ్నకు మంత్రి పుల్లారావు స్పందిస్తూ.. సమయమొచ్చినప్పుడు బయటపెడతామన్నారు.