వైఎస్సార్‌సీపీ నాయకులను చుట్టుముట్టిన టీడీపీ సభ్యులు
కుప్పం : స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం జరిగిన మండల సర్వసభ్య సమావేశం వైఎస్సార్‌సీపీ, టీడీపీ సభ్యుల మధ్య వాదోపవాదాలతో రసాభాసగా మారింది. కోరం లేకుండానే సమావేశాన్ని నిర్వహించడం చట్టవిరుద్ధమని వైఎస్సార్‌సీపీ సభ్యులు ఎంపీపీ సాంబశివాన్ని ప్రశ్నించడంతో టీడీపీ ప్రజాప్రతినిధులు వాదనకు దిగారు. ఓ స్థాయిలో మల్లానూరు సర్పంచ్ రామచంద్ర వైఎస్సార్‌సీపీ సర్పంచ్ మురళిపై తీవ్ర స్థాయిలో దుర్భాషలాడారు. వైఎస్సార్‌సీపీ సభ్యులను టీడీపీ సభ్యులు చుట్టుముట్టడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విషయం తెలుసుకున్న పోలీసులు లోపలికి వచ్చి ఇరు వర్గాలను శాంతింపజేశారు.
కోరం ఉన్నది లేనిది తేల్చిన తరువాతే సమావేశం నడపాలని మురళి వాదనకు దిగడంతో ఎంపీపీ సమావేశానికి వచ్చిన సభ్యుల వివరాలను చదివి వినిపించారు. ఓ దశలో ఎంపీపీ ప్రతిపక్ష సభ్యులపై మండిపడ్డారు. మీకు సమాధానం చెప్పనవసరం లేదు.. నిశ్శబ్దంగా కూర్చొని ఉండండి.. లేకుంటే వెళ్లిపోవాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీపీ వ్యాఖ్యలపై ప్రతిపక్ష సభ్యులు వాదనకు దిగటంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. సీఐ రాఘవన్ సైతం మురళిని సర్పంచ్ హోదాలో ప్రశ్నించే హక్కు ఉంటే జీఓ కాపీని చూపించి మాట్లాడాలని అనడంతో సభ్యులు మండిపడ్డారు. హౌసింగ్ శాఖలో జరుగుతున్న అన్యాయాలను వైఎస్సార్‌సీపీ సభ్యులు వివరించారు. నాలుగేళ్లుగా అర్జీలిస్తున్నా ఇప్పటి వరకు ఒక్క ఇల్లు కూడా పూర్తి స్థాయిలో నిర్మించిన పాపాన పోలేదని ప్రశ్నించారు. దీనిపై ఎంపీపీ సమాధానం ఇవ్వకపోవడంతో వైఎస్సార్‌సీపీ సభ్యులు బాయ్‌కాట్ చేశారు. అనంతరం నామమాత్రంగా మండల సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment