సామాన్య, మధ్య తరగతి ప్రజలకు ఊరటనిస్తుందనుకున్న కేంద్ర బడ్జెట్ నిరుత్సాహాన్ని నింపింది. బడా బాబులకు అండదండగా ఉంటానని నిరూపించింది. ఆదాయపు పన్ను మినహాయింపు భారీగా ఉంటుందని భావించిన ఉద్యోగ వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లి పార్లమెంటులో గురువారం ప్రవేశపెట్టిన 2014-15 బడ్జెట్ జిల్లాలో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. అన్ని వర్గాలకు సముచిత న్యాయం కల్పించలేకపోయారన్న వాదన వినిపిస్తోంది. ముఖ్యంగా సంపన్నులకు ఉపయోగపడే విధంగా బడ్జెట్ ఉందని పలువురు పేర్కొంటున్నారు. సామాన్యులకు అరకొరగా తాయిలాలు ప్రకటించి కంటికి కనిపించని రీతిలో భారాలు మోపే ప్రయత్నం కేంద్ర ఆర్థిక మంత్రి చేపట్టారని విశ్లేషకులు భావిస్తున్నారు. - సాక్షి నెట్ వర్క్
సబ్సిడీలు వద్దు.. ఎఫ్‌డీఐలు ముద్దు అన్నట్లుగా ఉంది..
ఎన్డీఎ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ సబ్సిడీలు వద్దు.. ఎఫ్‌డీఐలు ముద్దు అన్న చందంగా ఉంది. సబ్సిడీలకు కోత వేసి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ఆహ్వానం పలకడం సిగ్గుచేటు. దేశ భద్రతకు ముప్పు వాటిల్లేలా బడ్జెట్‌లో కేటాయింపులు ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగులకు బడ్జెట్‌లో అరకొరగా కేటాయించారు. పెండింగ్ ప్రాజెక్టులను ఏమాత్రం పట్టించుకోలేదు. పారిశ్రామిక రంగాన్ని నిర్వీర్యం చేసే బడ్జెట్ ఇది. పెట్టుబడిదారుల కొమ్ముకాస్తున్నారు. మొత్తానికి బడ్జెట్ చూస్తే బీమా రంగంలోని, రక్షణ రంగంలోనికి ఎఫ్‌డీఐలు ప్రవేశించేలా చేశారు. ప్రైవేట్ రంగాలకు పెద్దపీట వేశారు.
- ఈశ్వరయ్య, సీపీఐ జిల్లా కార్యదర్శి.
బడ్జెట్‌లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం
కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేశారు. గంగా, కావేరి అనుసంధానానికి సంబంధించి కెఎల్‌రావు నివేదిక ఇచ్చిన తర్వాత కూడా కేవలం రూ.100 కోట్లు కేటాయించడం అత్యంత దారుణం. కొత్త యూనివర్సిటీలు ఏవీ రాలేదు సరికదా.. కడప స్టీల్ ఫ్యాక్టరీ ప్రస్తావన గానీ, రుణమాఫీ అంశం గానీ పొందుపరచలేదు. చేనేతకు ప్రత్యేక ప్యాకేజి లేదు. ముఖ్యంగా రాయలసీమకు తీవ్ర అన్యాయం జరిగింది. గత రైల్వే బడ్జెట్‌లో కూడా రాయలసీమకు కొత్త రైళ్లు ఇవ్వలేదు.
- ఆదినారాయణరెడ్డి,
జమ్మలమడుగు ఎమ్మెల్యే.
సామాన్యులను విస్మరించారు..
బడ్జెట్‌లో సామాన్యులను విస్మరించారు. రక్షణ రంగంలో 49 శాతం విదేశీ పెట్టుబడులు ఆహ్వానించి దేశ భద్రతకు ముప్పు కలిగించే విధంగా వ్యవహరించారు. పేదలకు సబ్సిడీలు కుదించి పెట్టుబడిదారులకు రాయితీలు కల్పించారు. ప్రజల కొనుగోలు శక్తి లేకపోవడం వలన ఆర్థిక వృద్దిరేటు సన్నగిల్లుతుంది. విదేశాలలో ఉన్న నల్లధనాన్ని వెలికితీసి భారతదేశానికి తెప్పించాలి. పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు నిధులు కేటాయించలేదు. రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు తగినన్నీ నిధులు కేటాయించలేదు.
- రవిశంకర్‌రెడ్డి,
సీపీఎం నగర కార్యదర్శి
ప్రజల బడ్జెట్...
ఇది ప్రజల బడ్జెట్. బిజెపి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను దృష్టిలో ఉంచుకొని బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్‌తో ముఖ్యంగా పేదలు, మధ్య తరగతి ప్రజలు అన్ని వర్గాలకు మేలు చేకూరుతుంది. అలాగే ఏపీకి కేంద్రానికి సంబంధించిన వ్యవసాయ తదితర విద్యాలయాలను కేటాయించడం సంతోషంగా ఉందన్నారు.
- అల్లపురెడ్డి హరినాథరెడ్డి,
బిజెపి రాష్ట్ర నాయకులు
ధనికులకు మేలు చేసేవిధంగా ఉంది
ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ వల్ల పేద, మధ్యతరగతి ప్రజలకు ఒరిగేదేమీలేదు. నిత్యావసరధరలను అదుపు చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. డీజిల్, కిరోసిన్, గ్యాస్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. వాటితోపాటే నిత్యావసర ధరలు కూడా పైపైకి పోతున్నాయి. పోలవరం, ప్రత్యేక ప్రతిపత్తి వంటి వాటిపై స్పష్టమైన హామీలు ఇవ్వలేదు.
- కె. సురేష్‌బాబు, వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు
మంచి బడ్జెట్
బిజెపి ప్రభుత్వం మంచి బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రాధాన్యతను కల్పించింది. పారిశ్రామిక, విద్య, వైద్య, వ్యవసాయ రంగాలకు సంబంధించి సముచిత స్థానాన్ని కల్పించింది. ఉద్యోగులకు మేలును చేకూర్చారు. ఈ బడ్జెట్ కారణంగా ఆంధ్రప్రదేశ్‌కు ఎంతో లబ్ధి చేకూరుతుంది.
- లింగారెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు.
‘సీమ’కు నిరాశే మిగిలింది
ఎన్డీయే ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మొట్టమొదటి బడ్జెట్ రాయలసీమ వాసులకు తీవ్ర నిరాశనే మిగిల్చింది. యువత నైపుణ్యాలను పెంచే ‘స్కిల్ ఇండియా’ పథకాన్ని బడ్జెట్‌లో ప్రకటించినా, దాని అమలుకు నిధుల విషయాన్ని ప్రస్తావించకపోవడం గమనార్హం. అలాగే ఉపయోగపడే పథకాలకు అరకొర నిధులు మాత్రమే కేటాయించారు. కార్పొరేట్ ప్రయోజనాల కోసం రూపొందించిన ఈ బడ్జెట్‌లో ప్రజలకు ఉపయోగపడే పథకాలకు మోడీ ప్రభుత్వం అరకొర కేటాయింపులు చేసింది.
- ఎమ్మెల్సీ గేయానంద్
సామాన్యులకు పెనుభారం..
బిజెపి సంపన్న వర్గాలకు మేలు చేకూర్చే బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఆంధ్రప్రదేశ్‌కు ఈ బడ్జెట్ వల్ల ఒరిగేది శూన్యం. మోడీ అధికారంలోకి వస్తే ఏపికి సపోర్టుగా నిలుస్తాం అన్నారు. కానీ రైల్వేబడ్జెట్‌లో గానీ, ఈ బడ్జెట్‌లోగానీ న్యాయం చేయలేదు. మొత్తం మీద ఇది సామాన్యులకు పెను భారం, సంపన్నులకు అనుకూలంగా ఉంది.
- పి. రవీంద్రనాథ్‌రెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే
కాంగ్రెస్ విధానాలనే
కొనసాగించారు
ఈ బడ్జెట్ చాలా నిరాశాజనకంగా ఉంది. కాంగ్రెస్ విధానాలనే కొనసాగించారు. ధరల స్థిరీకరణకు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. రైతుల మద్దతు ధర కల్పించడానికి కేవలం రూ. 500 కోట్లు కేటాయించడం దారుణం. కీలకమైన రక్షణ, ఆర్ధిక రంగాలలో విదేశీ పెట్టుబడులను ఆహ్వానించడం ద్వారా మన సార్వభౌమత్వానికి నష్టం చేకూరుస్తున్నారు. ఇది కార్పొరేట్లకు, ధనికులకు మాత్రమే ఉపయోగపడే బడ్జెట్.
- బి. నారాయణ, సీపీఎం జిల్లా కార్యదర్శి
బంగారం ధర పెరిగింది ..
కేంద్ర బడ్జెట్‌లో బంగారంపై ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ కారణంగా గురువారం మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.28వేల నుంచి రూ.28,700-రూ.29,000 వరకు చేరింది. ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకే ఇలాంటి చర్యలు తీసుకుంటున్నట్లు అర్థమవుతోంది.
-బుశెట్టి రామ్మోహన్‌రావు, ప్రముఖ వ్యాపారి , ప్రొద్దుటూరు
మధ్యతరగతి ప్రజలకు ఒరిగిందేమీ లేదు..
జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో మధ్యతరగతి ప్రజలకు ఒరిగిందేమీ లేదు. నిత్యావసర ధరలను తగ్గించేందుకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. గ్యాస్, డీజిల్, పెట్రోల్‌ధరలకు కళ్లెం వేయకుండా సామాన్యులకు ఒరగబెట్టేది ఏమీ లేదు. రైల్వే బడ్జెట్‌లో మాదిరిగానే ఈ బడ్జెట్‌లో సైతం జిల్లాకు ఏ విధమైన మేలు జరగలేదు
- చక్రాంతం శ్రీహరిగణేష్, కడప
ఆదాయపన్ను పరిమితి ఆశించిన స్థాయిలో లేదు..
కేంద్ర ప్రభుత్వం ఆదాయ పన్ను పరిమితిని ఆశించిన స్థాయిలో పెంచలేదు. నాలుగు లక్షల వరకు పరిమితి విధిస్తారని పత్రికల్లో సైతం కథనాలు వచ్చాయి. ఉద్యో గ, ఉపాధ్యాయులు కూడా కనీసం రూ.3 లక్షల వరకైనా ఉంటుందని భావించారు. అయితే ప్రభుత్వం మాత్రం కేవలం రూ.2.5లక్షలకు పరిమితం చేసింది. ఉద్యోగ, ఉపాధ్యాయులు ప్రభుత్వాలతో పోరాడి పీఆర్సీ ద్వారా పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచేలా కృషి చేస్తుండగా మరో వైపు ప్రభుత్వం ఈ విధంగా పన్ను వసూలు చేస్తోంది.
- ఏ.నరసింహారెడ్డి, ప్రభుత్వ ఉపాధ్యాయుడు, ప్రొద్దుటూరు
అంకెల గారడీ చేశారు..
బడ్జెట్ ద్వారా బిజెపి ప్రభుత్వం అంకెల గారడీ చేసింది. మార్కెట్ అంచనాలను ఇది ఏమాత్రం అందుకోలేక పోయింది. విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాజధానికి ఎంతిస్తారో చెప్పలేదు. తెలుగుజాతికి చంద్రబాబు, మోడీ క్షమాపణ చెప్పాలి. పోలవరం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినప్పటికీ బడ్జెట్‌లో కేటాయింపులు జరపలేదు. రాష్ట్రానికి ఐఐటి, ఎయిమ్స్ ఇస్తామని ఇవ్వలేదు.
- నజీర్ అహ్మద్, డీసీసీ అధ్యక్షులు
ప్రత్యేక ఛానెల్ ఏర్పాటు మంచి నిర్ణయం
సాంకేతిక మార్పులకు అనుగుణంగా రైతులకోసం ప్రత్యేక ఛానెల్ ఏర్పాటు చేయడం మంచి నిర్ణయం. గతంలో ఉచిత టోల్‌ఫ్రీ నెంబరు ఉన్నప్పటికీ సమస్యలకు పరిష్కారం లభించేది కాదు. ప్రత్యేక ఛానెల్ అమలైతే వ్యవసాయ రంగానికి ఎంతో ఊరట.
- శ్రీనివాసులు(రైతు), పులివెందుల
మధ్యతరగతి ప్రజలకు మేలు లేదు..
పేద, మధ్య తరగతి ప్రజలకు మేలు చేకూరని బడ్జెట్. ప్రస్తుతం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో సాధారణంగా జీవించే ప్రజలకు ఎలాంటి మేలు చేకూరడంలేదు. ఎన్నో ఆశలు పెట్టుకున్న సామాన్యుడికి నిరాశే మిగిలింది.
- శేఖర్ (స్థానికుడు), పులివెందుల
భవిష్యత్తుపై ఆశ కల్పించేలా ఉంది
సాధారణ బడ్జెట్ భవిష్యత్తు పట్ల ఆశ కల్పించేలా ఉంది. నూతనంగా ఏర్పడ్డ ఆంధ్ర రాష్ట్రానికి ఎయిమ్స్, ఐఐటీ, వైజాగ్ నుంచి చెన్నై వరకు ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటుకు బడ్జెట్‌లో ప్రాధాన్యత కల్పించడం శుభపరిణామం. సబ్బులు వంటి ధరలను తగ్గించడం, ఆరోగ్యానికి హాని కలిగించే సిగిరేట్, గుట్కా వంటి పదార్థాల ధరలు పెంచడం మంచి నిర్ణయం. అన్ని రకాల ధరలు పెరిగినందున ఆదాయ పరిమితి రూ.3 లక్షలకు పెంచి ఉంటే బాగుండేది. రాజధాని ఏర్పాటు విషయంలో బడ్జెట్‌లో చర్చించి ఉండాల్సింది.
- ఎస్‌వీ రమణరావు, ప్రొఫెసర్, రాజంపేట
వేతన జీవులకు మొండిచెయ్యి..
నూతన ప్రభుత్వంలో ఆదాయపు పన్ను మినహాయింపు రూ. 5 లక్షల వరకు పెంచుతారనుకున్న వేతన జీవులకు ఈ బడ్జెట్ నిరాశను కలిగించింది. 2 లక్షల నుంచి 2.5 లక్షల వరకు పెంచినట్లు కనిపిస్తున్నా వాస్తవానికి రూ. 30 వేలు మాత్రమే పెంచారు. గతంలో రూ. 2.20 లక్షల వరకు వర్తించేదని అటువంటిది ఇప్పుడు 2.5 లక్షలు పెంచడం ద్వారా కేవలం 30వేలు మాత్రమే పెంచినట్లు అయింది.
- ఉద్దండం జయరామయ్య, ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు
నిరాశ కలిగించింది..
కొత్త ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఎంతో కొంత మేలు చేస్తుందని ఆశించాం. కానీ ఆదాయపు పన్ను మినహాయింపు కేవలం రూ. 30 వేలు మాత్రమే పెంచడం నిరాశ కలిగించింది. వృద్ధులకు రూ. 2 లక్షల నుంచి 3 లక్షలకు పెంచడం, పొదుపు రూ. 1 లక్ష నుంచి 1.50 లక్షలకు పెంచడం ఒక్కటే ఊరటనిచ్చే అంశం. మహిళా ఉద్యోగుల గురించి ప్రస్తావన లేకపోవడం విచారకరం.
- వెంకటశివారెడ్డి, పీఆర్‌టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు
ఏపికి న్యాయం జరిగింది
బిజెపి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌తో ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం జరిగింది. ఇదే తరహాలో ఇకపై ప్రవేశపెట్టే బడ్జెట్‌లు ఉంటాయని భావించవచ్చు. బడ్జెట్ ద్వారా ఏపికి అన్నిరంగాలలో తగిన మేరకు కేటాయింపులు జరిపారు. దీన్నిబట్టి రానున్న ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ నవ్యాంధ్రప్రదేశ్‌గా మారగలదని ఘంటాపథంగా చెప్పవచ్చు.
- గోవర్ధన్‌రెడ్డి, టీడీపీ రాష్ట్ర నాయకుడు
జైట్లీ లెక్కలపై జనం మాట...
Published Fri, Jul 11 2014 2:37 AM | Last Updated on Fri, Mar 29 2019 9:04 PM
Advertisement
Advertisement