శేషాచలం అడవులకు మాత్రమే పరిమితమైన అరుదైన జాతి సంపద ఎర్రచందనాన్ని అక్రమంగా రవాణా చేసేవారి ఆస్తులను సైతం స్వాధీనం చేసుకోవాలని ఏపీ పోలీసు శాఖ భావిస్తోంది.
సాక్షి, హైదరాబాద్: శేషాచలం అడవులకు మాత్రమే పరిమితమైన అరుదైన జాతి సంపద ఎర్రచందనాన్ని అక్రమంగా రవాణా చేసేవారి ఆస్తులను సైతం స్వాధీనం చేసుకోవాలని ఏపీ పోలీసు శాఖ భావిస్తోంది. దీనిపై ప్రస్తుతం గట్టి చట్టాలు లేకపోవడంతో ప్రాథమికంగా క్రిమినల్ ఎమెండ్‌మెంట్ చట్టాన్ని ప్రయోగించాలని నిర్ణయించింది. ఎర్రచందనం స్మగ్లర్లు మాదకద్రవ్యాల వ్యాపారం కూడా నిర్వహిస్తున్నట్లు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) ఇటీవల నిర్ధారించింది. చెన్నై విమానాశ్రయంలో గత వారం చిక్కిన చిత్తూరు జిల్లా వాసి ఆనంద్‌ను విచారించిన సమయంలో ఈ అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఎర్రచందనం స్మగ్లర్లపై అటవీ చట్టంతో పాటు ఐపీసీ కింద కేసులు నమోదు చేస్తున్నారు. అటవీ చట్టంలోనూ అక్రమ రవాణా దారులు హడలెత్తిపోయే చర్యలు తీసుకునే సెక్షన్లు లేవు. అక్రమ రవాణాదారుల ఆస్తుల్ని స్వాధీనం చేసుకోవడానికి అవకాశం ఉండట్లేదు. దీంతో ఐపీసీ కింద చోరీ సెక్షన్‌తో సరిపెట్టాల్సి వస్తోంది. నిందితుడు ఎర్రచందనం అక్రమ రవాణా ద్వారా భారీగా ఆస్తులు కూడబెట్టాడని తెలుస్తున్నా అధికారులు చర్యలు తీసుకోలేకపోతున్నారు. క్రిమినల్ ఎమెండ్‌మెంట్ యాక్ట్‌లోని సెక్షన్లను ఈ కేసులకు జోడిస్తే గట్టి చర్యలకు ఆస్కారం లభిస్తుందని పోలీసు శాఖ భావిస్తోంది. ఈ నేపథ్యంలో చట్టం అమలులో సాంకేతిక ఇబ్బందులు, ఇతర అంశాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని డీజీపీ కార్యాలయం ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేసింది. న్యాయ నిపుణులతో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. మరోపక్క ఎర్రచందనం అక్రమ రవాణాదారులకు పూర్తిస్థాయిలో అడ్డుకట్ట వేయడానికి ప్రత్యేక చట్టం తెచ్చేందుకు కూడా పోలీసు విభాగం కసరత్తు ముమ్మరం చేసింది. దీనికి అటవీ శాఖ అధికారుల సహకారం తీసుకోవాలని నిర్ణయించింది.