
సాక్షి, విశాఖపట్నం/పెందుర్తి: విశాఖ జిల్లాలో దళిత మహిళను వివస్త్రను చేసి దాడికి పాల్పడిన కేసులో నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టంతోపాటు నిర్భయ చట్టం కింద కూడా కేసులు నమోదు చేయాలని జాతీయ ఎస్సీ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. బాధితులకు న్యాయం జరగకపోతే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించింది. విశాఖ జిల్లా పెందుర్తి మండలం జెర్రిపోతులపాలెం గ్రామాన్ని గురువారం సందర్శించిన కమిషన్.. బాధితుల నుంచి ఘటన వివరాలను సేకరించింది. 40 ఏళ్ల క్రితం 14 మంది దళితులకు కేటాయించిన 80 సెంట్ల స్థలాన్ని ఇప్పుడు వేరొకరికి ఇవ్వడం ఏమిటని బాధితులు కమిషన్ దృష్టికి తెచ్చారు.
సస్పెన్షన్‌కూ వెనుకాడం
దళిత మహిళపై దాడికి పాల్పడ్డ నిందితులను 24 గంటల్లోగా అరెస్ట్ చేయాలని ఈ సందర్భంగా జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు కె.రాములు విశాఖ జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని ఆదేశించారు. రెవెన్యూ అధికారుల ఉదాసీన వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడికి గురైన బాధిత మహిళకు రూ.8 లక్షల పరిహారాన్ని చెల్లించాలని, 25 శాతం సొమ్మును ఈరోజు(గురువారం) రాత్రిలోగా ఇవ్వాల న్నారు. దాడికి గురైన మహిళ లేదా ఆమె కుమార్తెకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని సూచించారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణ సౌకర్యం కూడా కల్పించాలని ఆదేశించారు. తన ఆదేశాలను పట్టించుకోకుంటే బాధ్యులైన ప్రతి ఒక్కర్ని సస్పెండ్ చేసేందుకు కూడా వెనుకాడబోనన్నారు.
‘మా స్థలాలు మాకివ్వమని అధికారులతోపాటు స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి వద్దకు వెళితే పట్టించుకోలేదు. మేం అక్కడ ఉండగానే స్థానిక వైస్ ఎంపీపీకి ఫోన్ చేసిన ఎమ్మెల్యే... మీరు ఇళ్లు కట్టుకోండి. మిమ్మల్ని ఎవరూ అడ్డుకోలేరని వారికి అభయం ఇచ్చారు. మా స్థలంలో టీడీపీ నేతలు తవ్వకాలు చేపడుతుంటే అడ్డుకున్నాం. అంతే.. అంతా కలబడి నా దుస్తులు చింపేసి దారుణంగా కొట్టారు. ’ – జాతీయ ఎస్సీ కమిషన్ ఎదుట బాధిత దళిత మహిళ ఆక్రోశం.
Comments
Please login to add a commentAdd a comment