ముఖ్యమంత్రి ‘కాపు’ కాయలేదు | BC Corporation loan units only 60 thousand limited | Sakshi
Sakshi News home page

ముఖ్యమంత్రి ‘కాపు’ కాయలేదు

Published Thu, Feb 25 2016 12:43 AM | Last Updated on Sun, Sep 3 2017 6:20 PM

BC Corporation loan units only 60 thousand limited

రూ.60వేలకే పరిమితమైన బీసీ కార్పొరేషన్ రుణయూనిట్లు
 జన్మభూమి కమిటీల అడ్డంకులతో నేటికి 842మందికే సాయం

 
 సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఏరు దాటినంత వరకు ఓడ మల్లన్న..ఏరు దాటాక బోడి మల్లన్న అన్నట్లు ఉంది ప్రభుత్వం పరిస్థితి. అధికారం చేపట్టేందుకు ఇబ్బడిముబ్బడిగా హామీలిచ్చి తీరా అధికారం చేజిక్కాక అందుకు సాయపడిన వారిని కరివేపాకు లా తీసిపారేస్తోంది. కాపులే తమ బలమని, వారి కోసం ప్రభుత్వం ఎంతైనా చేస్తుందని పదేపదే చెబుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆచరణలోకొచ్చేసరికి వారికి ఝలక్ ఇచ్చారు. ఒక్కో రుణ యూనిట్ రూ.2లక్షల విలువతో  మంజూరు చేస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి ఇప్పుడేమో యూనిట్‌ను రూ.60వేలకే పరిమితం చేసి వారి ఆశలపై నీళ్లు చల్లారు. మరోవైపు చంద్రబాబు నియమించిన జన్మభూమి కమిటీలు బీసీలకు తీవ్ర అన్యాయం చేస్తున్నాయి.
 
  బీసీలకు 5945యూనిట్లు మంజూరు చేసేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నా జన్మభూమి కమిటీల గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో అర్థిక సంవత్సరం ముగియవస్తున్నా వెయ్యి యూనిట్లు కూడా లబ్ధి చేకూర్చే పరిస్థితి లేదు. ఇంకోవైపు బ్యాంకు రుణాలతో మెలిక పెడ్డటం కూడా లబ్ధిదారులకు ప్రతిబంధకంగా మారింది. 50శాతం రుణమిస్తామని, బ్యాంకులు అంగీకరిస్తేనే మిగతా 50శాతం సబ్సిడీ విడుదల చేస్తామని  ప్రభుత్వం కొర్రీ పెట్టింది. ఏదో రకంగా ప్రజలను మభ్యపెట్టి, మోసగిస్తూ పబ్బం గడుపుకునే ప్రయత్నమే ప్రభుత్వం  చేస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
 
 రూ. 60వేల లోపే కాపులకు రుణం
 2015-2016ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో ఉన్న కాపులకు రూ.50వేల నుంచి రూ. 2లక్షల విలువైన యూనిట్లను మంజూరు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు జిల్లావ్యాప్తంగా 2462 రుణయూనిట్లు ఇచ్చేందుకు లక్ష్యం పెట్టుకుంది. అయితే, అమల్లోకి వచ్చేసరికి రూ.60వేలకు మించి రుణయూనిట్ ఇచ్చేది లేదని కరాఖండిగా చెబుతోంది. అంతమేరకే బీసీ కార్పొరేషన్‌కు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఇప్పుడా నిధుల విడుదలకు కూడా బ్యాంకు రుణం మెలిక పెట్టింది. 50శాతం మేర బ్యాంకులు రుణమిచ్చేందుకు అంగీకరిస్తేనే మిగతా 50శాతం సబ్సిడీని విడుదల చేస్తామని చెబుతోంది. లేదంటే ఆ రుణ యూనిట్‌ను పెండింగ్‌లో పెడుతోంది. ఈ క్రమంలో బ్యాంకు అనుమతి లేక అనేక మంది రుణ యూనిట్లకు దూరమవుతున్నారు.
 
 బీసీలకు అడ్డంకిగా మారిన జన్మభూమి కమిటీలు
 బీసీలకు జన్మభూమి కమిటీల ద్వారా తీవ్ర అన్యాయం జరుగుతోంది. కమిటీలు పెడుతున్న ఇబ్బందులు పడలేక చాలామంది నిరాశకు లోనవుతున్నారు. జిల్లాలో బీసీలకు 5945యూనిట్లు మంజూరు చేసేందుకు అవకాశం ఉంది. ఈమేరకు ఆన్‌లైన్‌లో 10,572దరఖాస్తులొచ్చాయి. వాటిలో అర్హులైన వారిని ఎంపిక చేసి, బీసీ కార్పొరేషన్‌కు నివేదించాల్సిన బాధ్యతను జన్మభూమి కమిటీలకు సర్కార్ అప్పగించింది. జన్మభూమి కమిటీలు టీడీపీ కమిటీలుగానే చెలామణి అవుతున్నాయని సర్వత్రా వినిపిస్తున్న మాట.
 
  దాదాపు సభ్యులంతా అధికార పార్టీకి చెందిన వారే కావడంతో అవి కాస్తా పచ్చ కమిటీలుగా మారిపోయాయి. వాళ్లకు నచ్చితే ఎంపిక చేస్తారు. లేదంటే పక్కన పడేస్తారు.  పలు కమిటీలు చిలక్కొట్టుడుకు ఆశపడడంతో  పరిస్థితి దయనీయంగా తయారైంది.   ఈ ఆర్థిక సంవత్సరం మరో నెలతో ముగియనుంది. కానీ ఇప్పటి వరకు 842మందికి సంబంధించిన ఎంపిక జాబితాయే అధికారుల వద్దకు వచ్చింది. వాటికి మాత్రమే రుణమంజూరు ఇచ్చారు.  వారికి 50శాతం మేర బ్యాంకు రుణ అనుమతి ఇస్తేనే సబ్సిడీ నిధుల్ని విడుదల చేస్తున్నారు. లేదంటే కొర్రీ పెడుతున్నారు.   
 
 నిధుల మేరకే యూనిట్లు
 ప్రభుత్వం కేటాయించిన నిధుల మేరకు కాపులకు యూనిట్లు మంజూరు చేస్తున్నాం. రూ.60వేల లోపే యూనిట్లు కేటాయిస్తున్నాం. జన్మభూమి కమిటీలిచ్చే జాబితా ప్రకారమే బీసీలకు రుణ యూని ట్లు మంజూరు చేస్తున్నాం. బ్యాంకులు 50శాతం రుణం ఇచ్చేందుకు అంగీకరిస్తేనే మిగతా 50శాతం సబ్సిడీ నిధుల్ని విడుదల చేస్తున్నాం. అంతకుమించి చేసేదేమీ లేదు.                 - ఆర్.వి.నాగరాణి,
 ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్, బీసీ కార్పొరేషన్
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement