బీసీల్లో మహోదయం | BCs Happy With YS jagan BC Declaration | Sakshi
Sakshi News home page

బీసీల్లో మహోదయం

Published Mon, Feb 18 2019 7:19 AM | Last Updated on Mon, Feb 18 2019 7:19 AM

BCs Happy With YS jagan BC Declaration - Sakshi

జనాభాలో సగానికిపైగా ఉన్న బీసీలకు ఓ భరోసా లభించింది. వైఎస్సార్‌ స్వర్ణయుగంరాబోతుంది.. మళ్లీ రాజన్నపాలన చూడబోతున్నాం.. మాకు మంచిరోజులు రాబోతున్నాయ్‌..అంటూ బీసీలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏలూరు గడ్డపై బీసీ గర్జన సభలో వైఎస్సార్‌సీపీ అధినేత, రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీలు ఆ సామాజిక వర్గీయుల్లో ఎనలేని ఆత్మస్థైర్యాన్ని నింపాయి. గడిచిన ఐదేళ్లుగా తీవ్ర నిర్లక్ష్యానికి గురైన వారిలో భవిష్యత్‌పై ఆశలు చిగురింప చేశాయి. ఆరు నూరైనా ఈసారి వైఎస్సార్‌సీపీనే గెలిపించుకుంటాం..జగనన్నను సీఎం చేసుకుంటాం అంటూ వారంతా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.

సాక్షి, విశాఖపట్నం: టీడీపీ అధికారంలోకి వస్తే బీసీలను అన్ని విధాలా ఆదుకుంటామని 119 హామీలను గుప్పించారు. ఏటా రూ.10 వేల కోట్ల బడ్జెట్‌ కేటాయిస్తామన్నారు. కానీ ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేకపోయారు. చివరకు ఎన్నికల ముందు ఓటు బ్యాంక్‌ రాజకీయాలు చేసేందుకు ఆదరణ–2 అంటూ తెరపైకి తీసుకొచ్చి వందల కోట్లు కమీషన్ల రూపంలో దండుకుని అధికార టీడీపీ నేతలు సొమ్ము చేసుకున్నారు. తమ పట్ల చూపేది కపట ప్రేమని గ్రహించిన బీసీలు వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తేనే తమ బతుకులకు భరోసా లభిస్తుందని ఎదురు చూస్తున్నారు. తాజాగా ఏలూరులో జరిగిన సభలో వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌ బీసీ సామాజిక వర్గాల్లో కొండంత ధైర్యాన్నిచ్చింది. బీసీలకు ఏటా రూ.15 వేల కోట్ల బడ్జెట్‌తో బీసీ సబ్‌ప్లాన్‌ తీసుకొస్తామని.. తొలి çసమావేశాల్లోనే దానికి చట్టబద్ధత కల్పిస్తామని.. శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్‌ ఏర్పాటు చేస్తామని.. గ్రూపుల మార్పిడితో సహా బీసీల సమస్యల పరిష్కార బాధ్యతలను ఆ కమిషన్‌కు అప్పగిస్తామని ఇచ్చిన హామీ బీసీ వర్గాల్లో స్థైర్యాన్ని నింపింది.

జిల్లాలో సగానికిపైగా బీసీలే..
జిల్లా జనాభా 46.50 లక్షలుండగా, వారిలో 22 లక్షల మంది మహిళలున్నారు. మొత్తం జనాభాలో సగం మంది బీసీలే. జిల్లాలో ప్రధానంగా యాదవ, వెలమ, గవర, మత్స్యకార, శెట్టిబలిజ, పద్మశాలి, రజక, కాళింగ, నాగరాజు,నాగవంశం, నెయ్యల, తెలగ వంటి గుర్తింపు కలిగే స్థాయిలో జనాభా ఉన్న వారు 35కు పైగా బీసీ సామాజికవర్గాల వారు ఉన్నాయి. వీటిలో మేజర్‌ జనాభా యాదవ, వెలమ, గవర, మత్స్యకార సామాజిక వర్గీయులు. యాదవ సామాజిక వర్గీయులు నాలుగున్నర లక్షల మంది ఉండగా, వెలమ సామాజిక వర్గీయులు 4 లక్షల మంది ఉన్నారు. ఇక గవర్లు రెండున్నర లక్షల మంది, మత్స్య కారులు రెండులక్షల మంది, మిగిలిన సామాజిక వర్గీయుల్లో శెట్టిబలిజ, పద్మశాలిలుండగా, 50 వేల లోపు జనాభాతో మిగిలిన సామాజిక వర్గీయు లున్నారు.

12 లక్షల మంది పాల ఉత్పత్తిదారులకు లబ్ధి
సహకార రంగంలో డెయిరీలకు పాలుపోసే ప్రతి రైతుకు లీటర్‌కు రూ.4లు సబ్సిడీ ఇస్తామని ప్రకటించారు. బీసీల్లో అత్యధికులు రైతులే. వారిలో పాడిపై ఆధారపడి జీవిస్తున్నవారు జిల్లాలో దాదాపు 12 లక్షల మంది పాల ఉత్పత్తిదారులున్నారు. విశాఖ డెయిరీతో పాటు హెరిటేజ్, తిరుమల తదితర డైరీలున్నాయి.

రైతులకు లీటర్‌కు రూ.21 నుంచి రూ.25లకు ముట్టజెబుతున్న డెయిరీలు.. ఆ పాల నుంచి వచ్చే ఉత్పత్తుల ద్వారా లీటర్‌కు రూ.200 వరకు సంపాదిస్తున్నారు. కానీ పాల ఉత్పత్తిదారులకు మాత్రం ఏటా అప్పులే మిగులుతున్నాయి. జిల్లాలోని పాల ఉత్పత్తిదారులకు లీటర్‌ పాలకు రూ.4 సబ్సిడీ ఇవ్వడంతో పాటు ప్రభుత్వ ఆధీనంలో రైతుల భాగస్వామ్యంతో నడిచే పాలడెయిరీలను ప్రతి జిల్లాకు తీసుకొస్తామని వైఎస్‌ జగన్‌ ఇచ్చిన హామీ వల్ల జిల్లాలో పాల ఉత్పత్తిదారులంతా లబ్ధి పొందనున్నారు. జిల్లాలో ప్రతి రోజు 8.50 లక్షల లీటర్ల పాలు పోస్తుంటారు. ఆ మేరకు రైతులకు రూ.34 లక్షల మేర లబ్ధి చేకూరనుంది.

యాదవులకు కొండంత అండ
యాదవ సామాజిక వర్గీయులు నాలుగున్నర లక్షల మంది ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా వీరిలో మూడోవంతు జనాభా గొర్రెలు, మేకలు మేపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. జిల్లాలో 2.53 లక్షల గొర్రెలు, 3.24 లక్షల మేకలు ఉన్నాయి. ఏటా ప్రకృతి వైపరీత్యాలు, రోడ్డు ప్రమాదాల్లో కనీసం 20 నుంచి 30 శాతం చనిపోతున్నాయి. వాటికి ఎలాంటి ఇన్సూరెన్స్‌ సౌకర్యం లేకపోవడంతో యాదవులు అప్పులఊబిలో కూరుకుపోతున్నారు. బీసీ డిక్లరేషన్‌లో చనిపోయే గొర్రెలు, మేకలకు రూ.6 వేల ఇన్సూరెన్స్‌ వచ్చేటట్టు చేస్తామని వైఎస్‌ జగన్‌ ఇచ్చిన హామీ వారిలో కొండంత భరోసానిచ్చింది. అంతేకాదు యాదవులను కూడా ఆలయ బోర్డుల్లో సభ్యులుగా నియమిస్తామని హామీ ఇచ్చారు.

18 వేల మంది నాయీబ్రాహ్మణులకు లబ్ధి
సెలూన్‌ షాపు ఉన్న ప్రతి నాయీబ్రాహ్మణుడికి సున్నా వడ్డీకే రూ.10 వేలు ఇస్తామని బీసీ డిక్లరేషన్‌ సభలో హామీ ఇచ్చారు. ఆ మేరకు నాయీ బ్రాహ్మణులకు 18 కోట్ల మేర లబ్ధి పొందనున్నారు. అదే విధంగా ఆటోలు, టాక్సీలు సొంతంగా నడిపే వారిలో అత్యధికులు బీసీలే. వారికి ఏటా రూ.10 వేల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని ఇచ్చిన ప్రకటన ద్వారా సుమారు రూ.10 కోట్లకు పైగా లబ్ధి పొందనున్నారు. విశాఖ జిల్లాలో దేవాదాయశాఖ çపరిధిలో 976 ఆలయాలు ఉన్నాయి. తాము అధికారంలోకి వస్తే ఈ ఆలయాల్లో ట్రస్ట్‌ బోర్డు సభ్యుల్లో 50 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల వారిని నియమిస్తామని హామీ ఇచ్చారు.

చేనేతలకు తీరనున్న చింత
జిల్లాలో పద్మశాలి, దేవాంగ తదితర చేనేత సామాజిక వర్గీయులు సుమారు లక్ష మంది వరకు ఉన్నారు. జిల్లాలో మగ్గాలు పదివేలకు పైగా ఉన్నాయి. వీరికి కనీస చేయూతనిచ్చే నాథుడే కరువయ్యాడు. వైఎస్‌ హయాంలో జరిగిన రుణమాఫీ లబ్ధి తప్ప ఆ తర్వాత వీరికి కలిగిన ప్రయోజనం ఏమీ లేదనే చెప్పాలి. అలాంటి వీరికి బీసీ డిక్లరేషన్‌లో వైఎస్‌ జగన్‌ ప్రకటించిన హామీ కొండంత భరోసానిచ్చింది. మగ్గం ఉన్న ప్రతిమత్స్యకార మహిళకు ప్రతి నెలా పెట్టుబడి రాయితీ కింద రూ.2వేలు ఇస్తామని ప్రకటించారు. ఆ మేరకు మగ్గాలున్న చేనేతలందరికి మేలు జరుగనుంది.

జీవనోపాధికి భరోసా
కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ పోస్టుల భర్తీలోనే కాదు.. నామినేషన్‌ పదవుల్లోనూ, నామినేటెడ్‌ పదవుల్లోనూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు  50 శాతం కేటాయిస్తామని వైఎస్‌ జగన్‌ చేసిన ప్రకటన ఆయా వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా అణగారిన బీసీ వర్గాలకు తమకు రానున్నది నిజంగా సువర్ణయుగమేనని సంబరపడుతున్నారు.

వైఎస్సార్‌ చేయూతతో 15 లక్షల మందికి లబ్ధి
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల్లో 45 ఏళ్లు నిండిన మహిళలకు నాలుగు విడతల్లో రూ.75వేలు ఉచితంగా అందించేందుకు ప్రకటించిన వైఎస్సార్‌ చేయూత పథకం ఆయా వర్గాల్లో పట్టరాని ఆనందం నింపింది. ఈ పథకాన్ని విశాఖ జిల్లాలోనే వైఎస్‌ జగన్‌ ప్రకటించారు. జిల్లాలో బీసీలు 26 లక్షల మంది, ఎస్టీలు 6.50 లక్షల మంది, ఎస్సీలు 4 లక్షల మంది, మైనారిటీలు లక్ష మంది ఉన్నారు. ఇందులో సుమారు 15 లక్షల మంది మహిళలు ఉంటారు. వీరికి నాలుగేళ్లలో ఎంత తక్కువ లెక్కేసుకున్నా రూ.10 వేల కోట్లకు పైగా లబ్ధి జరగనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement