ఉమ్మడి రాజధానికి బీజేపీ వ్యతిరేకం: దత్తాత్రేయ
హైదరాబాద్ : హైదరాబాద్ ఉమ్మడి రాజధానికి బీజేపీ వ్యతిరేకమని ఆపార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు బండారు దత్తాత్రేయ అన్నారు. తెలంగాణ ఏర్పాటును బీజేపీ సమర్థించింది కాబట్టే యూపీఏ నిర్ణయం తీసుకుందని ఆయన సోమవారమిక్కడ వ్యాఖ్యానించారు. తెలంగాణపై స్పష్టత ఇచ్చి లిఖితపూర్వకంగా నిర్ణయం ఉంటేనే చట్టబద్ధత లభిస్తుందని దత్తాత్రేయ అన్నారు. ప్రస్తుత సీమాంధ్రలో పరిస్థితులకు కారణం ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షులే కారణమని ఆయన ఆరోపించారు.
ఉమ్మడి రాజధానిగా ఉండే పదేళ్ల కాలంలో హైదరాబాదు నగరం పోలీసు వ్యవస్థ, శాంతి భద్రతలు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటాయని రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్ వెల్లడించిన విషయం తెలిసిందే. దేశ రాజధాని ఢిల్లీలో అమలు చేస్తున్న విధంగా హైదరాబాద్‌లోనూ శాంతి భద్రతలు, పోలీసు వ్యవస్థ బాధ్యతలను కేంద్ర హోం శాఖ నిర్వహించేలా చర్యలు తీసుకునే విషయం పరిశీలనలో ఉన్నదని ఆయన నిన్న ఓ జాతీయ న్యూస్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. దాంతో ఉమ్మడి రాజధాని కాబోతున్న హైదరాబాదులోని సీమాంధ్రులకు భద్రత కల్పించేందుకు ఢిల్లీ తరహా రక్షణ విధానం అమలు చేసేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది.