ఉక్కునగరం(గాజువాక): స్టీల్‌ప్లాంట్ జూనియర్ ట్రైనీ పోస్టుల రాత పరీక్షకు దళారులు దందా ప్రారంభించారు. ఉద్యోగాల పేరిట అమాయకులైన నిరుద్యోగులను మోసం చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. స్టీల్‌ప్లాంట్ జూనియర్ ట్రైనీ పోస్టులకు మే 5 నుంచి 14 వరకు వివిధ కేంద్రాల్లో ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇందుకోసం సుమారు 43 వేల మంది దరఖాస్తు చేస్తున్నారు. స్టీల్‌ప్లాంట్‌లో ఉద్యోగం వస్తే ఆకర్షణీయమైన జీతంతో పాటు అన్ని సౌకర్యాలు ఉంటాయని భావించి నిరుద్యోగులు దళారులను ఆశ్రయిస్తున్నారు. కొంత మంది నిరుద్యోగులు తమ తల్లిదండ్రులపై ఒత్తిడి తెచ్చి ఇళ్లు, భూములు కుదువ పెట్టి వచ్చిన నగదును దళారుల చేతిలో పెడుతున్నారు. గతంలో ఆఫ్‌లైన్‌లో పరీక్ష జరిగిన సమయంలో కొంత మంది దళారులు పరీక్ష కేంద్రాల నిర్వాహకులతో కుమ్మక్కై పేపర్ లీకేజ్‌కు పాల్పడటం, మరికొంత మంది ఇన్విజిలేటర్ల సాయంతో పరీక్ష రాయించడం తదితర ఘటనలు వెలుగు చూశాయి.
దళారులు నిరుద్యోగుల బలహీనతను ఆసరాగా చేసుకుని డబ్బులు ముందుగా గుంజి తమ వద్ద ఉంచుకుంటారు. అదృష్టవశాత్తు అభ్యర్థులు పరీక్షలో పాసైతే.. వారు ఇచ్చిన డబ్బులు దళారులకు అప్పనంగా మిగిలిపోతాయి. పరీక్షలో పాసు కాకపోతే ప్రయత్నించాం.. అవ్వలేదంటూ ఓదార్చడం.. కొన్ని రోజులు అభ్యర్థులను తిప్పుకుని ఖర్చులకని డబ్బులు తీసుకుని మిగతాది తిరిగి ఇవ్వడం పరిపాటిగా మారింది. మరికొంత మంది నకిలీ నియామకపు పత్రాలు ఇచ్చి అభ్యర్థులను మోసగించిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఈ విధంగా చేసిన వారిలో స్టీల్‌ప్లాంట్‌కు చెందిన కొంత మంది కార్మిక నాయకులు ఉండటం గమనార్హం. అభ్యర్థులు ఆ నియామక పత్రాలు తీసుకుని ప్లాంట్‌కు వెళ్లడం, అక్కడ అధికారులు తిప్పిపంపుతుండటంతో.. లబోదిబోమంటూ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఈసారి ఆన్‌లైన్‌లో పరీక్ష నిర్వహిస్తున్నప్పటికీ నిరుద్యోగులను ప్రలోభ పెట్టేందుకు దళారులు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్టీల్‌ప్లాంట్ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. దళారుల చేతిలో నిరుద్యోగులు మోసపోవద్దని సూచిస్తున్నారు. ఎవరైనా ప్రలోభ పెడితే టోల్ ఫ్రీ నంబర్ 1800 425 8878ను సంప్రదించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment