తెలుగు ప్రజలను విడదీయొద్దు
Published Sun, Aug 25 2013 3:29 AM | Last Updated on Fri, Sep 1 2017 10:05 PM
బుట్టాయగూడెం, న్యూస్‌లైన్ : అన్నదమ్ముల్లా కలిసి ఉన్న తెలుగు ప్రజలను విడదీయ వద్దని జిల్లా వైద్య,ఆరోగ్య శాఖాధికారిణి టి.శకుంతల కోరారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో వైద్యులు, సిబ్బంది శనివారం బుట్టాయగూడెంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పాల్గొన్న డీఎంహెచ్‌వో మాట్లాడుతూ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరారు. సమైక్యవాదులంతా ఐక్యంగా ఉండి ప్రశాంత వాతావరణంలో నిరసనను తెలపాలన్నారు.
తణుకు పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యుడు వీరాస్వామి మాట్లాడుతూ 57 ఏళ్ల కాలంలో తెలుగు వారంతా ఐక్యంగా ఉండి కలసిమెలసి జీవించారన్నారు. కొందరి స్వార్థం కోసం రాష్ట్రాన్ని ముక్కలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని విడదీస్తే సీమాంధ్ర ప్రజలు సహించరని హెచ్చరించారు. రాష్ట్ర విభజనపై జరుగుతున్న ఉద్యమంలో ప్రజలే నాయకులై ముందుండి నడిపిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యుడు ఎస్‌పీహెచ్‌వో ఎ.రామారావు, డెప్యూటీ డీఎంహెచ్‌వో నాగేశ్వరరావు, వంశీలాల్ రాథోడ్, డాక్టర్ రసూల్, దీప, ప్రవీణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
సీజనల్ వ్యాధులపై అవగాహన అవసరం
బుట్టాయగూడెం, న్యూస్‌లైన్ : ఏజెన్సీ ప్రాంతంలో వాతావరణ మార్పుల వల్ల వచ్చే సీజనల్ వ్యాధులపై ప్రజలు అవగాహన పెంచుకుని తద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని డీఎంహెచ్‌వో డాక్టర్ టి.శకుంతల తెలిపారు. జిల్లా వైద్య శాఖ, ఐటీడీఏ ఆధ్వర్యంలో శనివారం స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో ఆమె మాట్లాడారు.
ఏజెన్సీ ప్రజలకు మెరుగైన వైద్యాన్ని అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. బుట్టాయగూడెం మండలంలో దాదాపు అన్ని గ్రామాల్లో వైద్యశిబిరాలు ఏర్పాటు చేసి సేవలందించామన్నారు. ఈ నెల 27న పోలవరంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో డెప్యూటీ డీఎంహెచ్‌వో టి.నాగేశ్వరరావు, ఎస్పీహెచ్‌వో ఎ.రామారావు, వైద్యులు వీరాస్వామి, అనిల్‌కుమార్, సుధీర్ బాబు, హరికృష్ణ, ప్రియాంక తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement