రాజీనామా చెయ్.. తేల్చుకుందాం
Published Tue, Mar 7 2017 9:37 AM | Last Updated on Fri, Jun 1 2018 9:07 PM
జేసీపీఆర్‌పై మాజీ ఎంపీ అనంత ఆగ్రహం
‘రా..తేల్చుకుందాం’ అంటున్నారు... వీుకంత మోజు ఉంటే రాజీనామా చేయండి. ప్రజల్లోకి పోదాం.. ప్రజాక్షేత్రంలో తేల్చుకుందాం. టీడీపీ నేతలంతా రాజీనామా చేస్తారా...? లేదంటే నువ్వు,. నీ సోదరుడు రాజీనామా చేయండి.. అప్పుడు తేల్చుకుందాం.
► రాజీనామాలు చేసి రండి
► జేసీ ప్రభాకర్ వ్యాఖ్యలకు సభ్య సమాజం తలదించుకుంటోంది
► తాడిపత్రిలోని పరిశ్రమలన్నీ జేసీకి కప్పం కట్టాల్సిందే
► జేసీ సోదరులపై మాజీ ఎంపీ అనంత ఫైర్
అనంతపురం :
రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు ముఖ్యంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, ఆయన సతీమణి, వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ పట్ల తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు, వాడిన పదజాలం సభ్యసమాజంలో అందరూ తలదించుకునేలా ఉందని మాజీ ఎంపీ, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంత వెంకటరావిురెడ్డి విమర్శించారు.
సోమవారం పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైఎస్ కుటుంబం పై జేసీ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. 20–25 ఏళ్లుగా జేసీని చూస్తున్నామనీ, అందరినీ బెదిరించి లొంగదీసుకుందామనే ధోరణిలోనే ఆయన రాజకీయ చరిత్ర ఉందన్నారు. ప్రభాకర్‌రెడ్డి మాటలు వింటుంటే ఆటవిక రాజ్యంలో ఉన్నామా? అనే అనుమానాలు అందరిలో మెదలవుతున్నాయన్నారు. కేవలం ‘సాక్షి’ పత్రికనో, వైఎస్ జగన్‌నో కాదు వారి దురాగతాలను ఏ పత్రిక, రాజకీయ పార్టీ ప్రశ్నించినా వారిపట్ల ఇదే రకంగా వ్యవహరిస్తారని ధ్వజమెత్తారు.
నాయకులను ఎస్సీ ఎస్టీ కేసులంటూ కోర్టుకు ఈడ్చి బ్లాక్‌మెయిల్ చేస్తారని ఆరోపించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని తాడిపత్రిలో ఆటవిక సామ్రాజ్యాన్ని స్థాపించుకున్నారన్నారు. ప్రజల హృదయాలను గెలుచుకున్న మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మరణానాన్ని కూడా అపహాస్యం చేసేలా మాట్లాడటం సిగ్గుచేటని విమర్శించారు. చివరికి తాడిపత్రి నియోజకవర్గ ఆడబిడ్డ అనేది కూడా మరచిపోయి విజయమ్మపై కూడా విచక్షణ, జ్ఞానం లేకుండా మాట్లాడారన్నారు. ఏం మాట్లాడినా ‘రా..తేల్చుకుందాం’ అంటున్నారనీ, ఏం తేల్చుకుంటాం కుస్తీలు పట్టేందుకు ఏమైనా రౌడీలా అని ప్రశ్నించారు. మీకంత మోజు ఉంటే రాజీనామా చేయండి. ప్రజా క్షేత్రంలోకి వెళ్లి తేల్చుకునేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. తమ మాట వినలేదని గతంలో ఆర్టీఏ అధికారులు, పోలీసులను అనేకమార్లు బెదించారని విమర్శించారు. అందరూ భయపడితే ఎంతవరకైనా బెదిరిస్తారని, జరక్కపోతే తోక ఎలా ముడుచుకుంటాడో కూడా తెలుసని చెప్పారు.
ముఖ్యమంత్రులను, అధికారంలో ఉన్నవారిని పొగిడి ఎలా పనులు చేసుకుంటాడో ప్రజలందరికీ తెలుసన్నారు. చెన్నారెడ్డిని మొదలుకుని జనార్ధన్‌రెడ్డి, విజయభాస్కర్‌రెడ్డి, మధ్యలో టీడీపీ తప్ప తర్వాత వచ్చిన వైఎస్, ఆయన తర్వాత వచ్చిన సీఎంలు, ప్రస్తుత ముఖ్యమంత్రి చందబాబును తమ దందాను జరుపుకునేందుకు ఎలా పొగిడారో తెలుసన్నారు. జరక్కపోతే మాత్రం 1994లో జిల్లాలో రాజకీయాలనే ధారాదత్తం చేసి బెంగళూరు, హైదరాబాద్‌కు పారిపోయిన విషయమూ తెలుసన్నారు. అలాంటి వారా జగన్ గురించి మాట్లాడేదని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి అవసరాలు జేసీ సోదరులకు ఉన్నాయి, వీరి అవసరాలు ముఖ్యమంత్రికి ఉన్నాయని చెప్పారు.
చంద్రబాబు ప్రభుత్వ ఒత్తిడితో వారు చెప్పింది చేయకపోతే బదిలీలు చేస్తారనే భయం ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల్లో ఉందన్నారు. ప్రజల దృష్టి మరల్చేందుకే జేసీ ప్రభాకర్‌రెడ్డి ఎదురుదాడికి దిగుతున్నారన్నారు. జిల్లాలో అదృష్టమో దురదృష్టమో తెలీదుకాని తాడిపత్రిలో చాలా పరిశ్రమలు ఉన్నాయన్నారు. అందరూ వీరికి కప్పం కట్టాలి్సందేనన్నారు. ఇవన్నీ చంద్రబాబుకు తెలీదా? అని ప్రశ్నించారు. సమావేశంలో కదిరి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సిద్ధారెడ్డి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఆలూరి సాంబశివారెడ్డి, పార్టీ నాయకులు చవ్వా రాజశేఖర్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి గౌస్‌బేగ్, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ సత్యనారాయణరెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మీసాల రంగన్న, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు పెన్నోబులేసు, సాంస్కృతిక విభాగం జిల్లా అధ్యక్షులు రిలాక్స్ నాగరాజు, ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షులు ఆదినారాయణరెడ్డి పాల్గొన్నారు.
Advertisement