
తెలంగాణపై కేంద్రం ఏకపక్షంగా నిర్ణయం తీసుకోలేదు
ప్రత్యేక తెలంగాణ విషయంలో కాంగ్రెస్ పార్టీ, కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకోలేదని మంత్రి గీతారెడ్డి గురువారం హైదరాబాద్లో తెలిపారు.
ప్రత్యేక తెలంగాణ విషయంలో కాంగ్రెస్ పార్టీ, కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకోలేదని మంత్రి గీతారెడ్డి గురువారం హైదరాబాద్లో తెలిపారు. విస్తృత సంప్రదింపుల తర్వాతే నిర్ణయం తీసుకున్నారని ఆమె స్పష్టం చేశారు. చారిత్రక నిర్ణయం తీసుకున్న యూపీఏ అధ్యక్షురాలు సోనియాగాంధీకి తెలంగాణ ప్రాంత ప్రజలు, కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల తరపున గీతారెడ్డి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
రాష్ట్ర విభజనపై సీఎం కిరణ్కుమార్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరును అధిష్టానం గమనిస్తోందని అన్నారు. అలాగే సీఎంతోపాటు అందరిపైనా నిఘా ఉందన్నారు. హైదరాబాద్లో ఉండే సీమాంధ్రులంతా స్థానికులే అని గీతారెడ్డి తన అభిప్రాయాని వ్యక్తం చేశారు. సీమాంధ్ర ఉద్యోగులను హైదరాబాద్ నుంచి వెళ్లిపోమ్మనే అధికారం ఎవరికి లేదన్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందవచ్చని గీతారెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.