
బాబు హామీలు ఎండమావులే
వైఎస్సార్ సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గౌతమ్‌రెడ్డి
విజయవాడ : ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలు ఆయన అధికారంలోకి రాగానే ఎండమావులను తలపిస్తున్నాయని వైస్సార్‌సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గౌతమ్‌రెడ్డి విమర్శించారు. అధికారంలోకి రావడానికి ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన రైతు, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ హామీలు ఆ తరహాకు చెందినవేనని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీలన్నీ ముఖ్యంగా సంపూర్ణ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ 5వ తేదీన మచిలీపట్నంలోని కలెక్టరేట్ వద్ద జరగనున్న ధర్నాను జయప్రదం చేయాలని కోరారు. బుధవారం కండ్రికలో గౌతమ్‌రెడ్డి ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ లక్షా 5 వేల మంది రైతులకు 84,164 కోట్లు, డ్వాక్రా మహిళలకు 14 వేల కోట్ల రుణమాఫీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెప్పారు.ప్రభుత్వం కంటితుడుపు చర్యగా కేవలం 43 లక్షల మంది రైతులే రుణమాఫీకి అర్హులని ప్రకటించిందని, ప్రభుత్వ చర్యలను గమనిస్తే ఈ సంఖ్యను మరింత కుదించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల్లో ఏ ఒక్కటీ అమలు చేయలేని చంద్రబాబు హైటెక్ సిటీ, సింగపూర్, జపాన్ అంటూ ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు.
రాజధాని నిర్మాణం పేరుతో చంద్రబాబు పేద రైతుల పొట్టలు కొట్టి, తెర వెనుక రియల్ వ్యాపారం చేస్తున్నారని విమర్శించారు. కార్మికులకు బీమా సౌకర్యం కల్పించాల్సిన ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా బీమా ప్రీమియం పేరుతో కార్మికుల నుంచి అదనంగా వసూలు చేస్తోందని విమర్శించారు. కుల వృత్తి చేసుకుంటున్న వారికి ఉచితంగా పరికరాలు అందిస్తామన్న చంద్రబాబు... ఆ హామీనీ నిలబెట్టుకోలేదని చెప్పారు. 59వ డివిజన్ కండ్రికలోని వైఎస్సార్ విగ్రహం వద్ద నుంచి ప్రారంభమైన భారీ బైక్ ర్యాలీ లెనిన్ సెంటర్ వరకు కొనసాగింది. 59వ డివిజన్ కార్పొ రేటర్ అవుతు శ్రీశైలజ, నాయకులు అవుతు శ్రీనివాసరెడ్డి, పార్టీ 58వ డివిజన్ అధ్యక్షుడు టెక్యం కృష్ణ, యాదల శ్రీనివాసరావు, 54వ డివిజన్ అధ్యక్షుడు ఎండి.రుహుల్లా, లోకనాథం కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.