గుంటూరు: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు జిల్లాలోని గురజాల నియోజకవర్గం నుంచి బస్సుయాత్రను చేపట్టేందుకు సన్నద్దమవుతున్నారు. కాగా, బాబు బస్సుయాత్ర చేపడతారా? లేదా? అనే దానిపై పలు అనుమానాలున్నాయి. వచ్చే నెల 1 నుంచి దాచేపల్లి మండలం పొందుగల గ్రామం నుంచి బస్సుయాత్ర చేపడతారని సమాచారం ఉన్నా.. ఈ యాత్రపై అనేక సందేహాలున్నాయి. ముందు ప్రకటించిన యాత్ర కాస్తా వెనక్కి పోవడంతో ..తాజాగా ప్రకటించిన యాత్ర జరుగుతుందా అనేది మాత్రం వేచి చూడాల్సిందే.
సీమాంధ్రలో ఆగస్టు 25వ తేదీ నుంచి బస్సుయాత్రను చేపడుతున్నట్లు ముందుగా చంద్రబాబు ప్రకటించినా అనివార్య కారణాల వల్ల వాయిదా వేశారు. ఓ దశలో ఎలాగైనా యాత్రను చేపట్టేద్దామని నిర్ణయించుకున్న బాబుకు సీమాంధ్ర నేతలు అసలు సంగతి చెప్పి రెండు కళ్ల సిద్ధాంతం వికటించిందని కళ్లు తెరిపించారు. దీంతో బాబు బస్సు యాత్రకు బ్రేక్ పడింది. తొలుత ప్రకటించిన షెడ్యల్ ప్రకారం విజయనగరం జిల్లా కొత్త వలస నియోజకవర్గం నుంచి రోడ్ షోను ఆరంభించాల్సి ఉంది.
బస్సుయాత్రపై సీమాంధ్ర నాయకులతో సంప్రదింపులు జరిపినప్పుడు అక్కడి నేతలు బాబుపై వ్యతిరేకతను పూసగుచ్చినట్టు వివరించారు. రాష్ట్ర విభజనను స్వాగతించి ప్యాకేజీలు గురించి మాట్లాడిన బాబు వైఖరిని సీమాంధ్ర ప్రజలు ఛీ కొడుతున్నారని కొంతమంది ముఖ్యనేతలు కుండబద్దలు కొట్టారు. సీమాంధ్ర ప్రజల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందేమేనని భయపడిన బాబు యాత్రకు తాత్కాలిక బ్రేక్ ఇచ్చారు. అంతే కాకుండా సీమాంధ్ర మొత్తం సమైక్యాంధ్ర కోరుతున్నప్పుడు జనంలోకి వచ్చి ఏం చెప్తారన్న విషయమై కూడా బాబును పార్టీనేతలు ప్రశ్నించారు. దీంతో అప్పటి యాత్రకు బ్రేక్ పడక తప్పలేదు.