
నష్టాల జడివేళ ‘గొడుగు’ దక్కేనా!
మండపేట :ప్రజల క్షేమమే ధ్యేయమైన వాడు గనుక మహాకవి గురజాడ ‘వట్టిమాటలు కట్టిపెట్టి గట్టిమేల్ తలపెట్టవోయ్’ అన్నాడు. తనకు సీఎం పదవే ధ్యేయమైన వాడు గనుక టీడీపీ అధినేత చంద్రబాబు ‘ఓటిమాటల డప్పుకొట్టి ఓట్లు రాబట్టవలెనోయ్’ అంటూ నోటికొచ్చిన వాగ్దానం చేశారు. అధికారంలోకి వచ్చాక అదే నోటితో నిస్సిగ్గుగా, నిస్సంకోచంగా మాట తప్పుతున్నారు. తన వాగ్దానాలను నమ్మి, ఆశలు పెంచుకున్న వారిని నిరాశానిస్పృహల్లో ముంచుతున్నారు. రుణ మాఫీపై రోజుకో మాట చెపుతున్న చంద్రబాబు ప్రభుత్వం తాజాగా రుణాలు రీ షెడ్యూల్ చేస్తామంటున్నా అందుకు సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేయలేదు. తొలకరి పనులు ముమ్మరమవుతున్న తరుణంలో సర్కారు తీరు రైతులను అయోమయంలోకి నెడుతోంది. పంటల బీమా ప్రీమియం చె ల్లింపు గడువు ఈ నెలాఖరు వరకే ఉండడంతో ఈలోగా రీ షె డ్యూల్ జరుగుతుందా, మట్టిలో గుమ్మరించే తమ చెమటకూ, సొమ్ముకూ బీమా ధీమా దక్కుతుందా అన్న సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్నారు.
జాతీయ బీమా సంస్థ ప్రస్తుత ఖరీఫ్‌లో ప్రీమియం చెల్లింపునకు జూలై 31ని గడువుగా విధించింది. ఆ లోగా ప్రీమియం చెల్లించిన వారికే బీమా వర్తిస్తుంది. సాధారణంగా తొలకరి పనుల ప్రారంభంలో సొసైటీలు, బ్యాంకుల నుంచి రైతులు పంట రుణాలు తీసుకుంటుంటారు. ఆ సంస్థలు ఇచ్చే రుణంలోనే ప్రీమియం సొమ్మును మినహాయించుకుంటాయి. తమంత తామే పంటల బీమా చేయించే అలవాటు జిల్లా రైతాంగానికి అబ్బలేదు. గత ఏడాది ఖరీఫ్‌లో జిల్లాలో సు మారు 3.5 లక్షల మంది రైతులు రూ.2,750 కోట్ల పంట రు ణాలు తీసుకోవడం ద్వారా బీమా సదుపాయం పొందితే స్వచ్ఛందంగా పంటల బీమా చేయించుకున్న రైతులు సుమారు 120 మంది మాత్రమే ఉన్నారు. సొంతంగా బీమా చేయించుకోవాలంటే ఏఓల చుట్టూ తిరగాల్సి రావడం, ప్రకృతి అనుకూలింక పోతుందా అన్న ధీమా ఇందుకు కారణమని చెప్పవచ్చు. గత అక్టోబరులో కురిసిన భారీ వర్షాలతో వరి పంటకు అపారనష్టం వాటిల్లగా బీమాలేని వారు నష్టం చవిచూడాల్సి వచ్చింది.
ప్రీమియం చెల్లింపు గడువు పెంచాలి..
బీమా సంస్థ గడువు ప్రకారం ఈ ఖరీఫ్ పంటకు ప్రీమియం ఈనెల 31లోగా చెల్లించాలి. తాజా మార్గదర్శకాల మేరకు పంటల బీమా ప్రీమియంగా గరిష్ట రుణపరిమితిలో 18 శాతం చెల్లించాల్సి ఉంది. అందులో ఆరు శాతం రైతులు చెల్లిస్తే, మిగిలిన 12 శాతం ప్రభుత్వం భరిస్తుంది. ప్రకృతి వైపరీత్యాలు, ఇతర కారణాలతో పంటకు నష్టం వాటిల్లినప్పుడు గ్రామం యూనిట్‌గా నష్టాన్ని అంచనా వేసి రైతులకు పరిహారం అందజేస్తారు. కాగా ప్రీమియం గడువు దగ్గర పడుతున్నా రుణాల రీషెడ్యూల్ పేరిట ప్రభుత్వం చేస్తున్న కాలయాపన రైతులను కలవరపరుస్తోంది. వారు బీమా రక్షణ పొందాలంటే గడువులోగా రీ షెడ్యూల్ ప్రక్రియ పూర్తయి, కొత్త రుణాలు పొందాలి. మరోవైపు పాత బకాయిలు చెల్లించిన వారికే కొత్త రుణాలిస్తామని బ్యాంకులు కరాఖండిగా చెపుతున్నాయి. అసలే తుపాన్లు, అల్పపీడనాల తాకిడి ఎక్కువగా ఉండే జిల్లా కావడంతో రైతులకు బీమా రక్షణ అత్యవసరం. ప్రస్తుతం వారి అవస్థ.. కారుమబ్బులు కమ్మి, కుంభవృష్టి కురవనున్న వేళ..తడవకుండా ఆదుకునే గొడుగు సమయానికి చేతికొస్తుందా, లేదా అన్న సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్నట్టుంది. ప్రభుత్వం స్పందించి రుణ మాఫీ లేదా రీషెడ్యూల్‌పై స్పష్టత ఇవ్వడంతో పాటు బీమా ప్రీమియం చెల్లింపు గడువు పెంచాలని వారు కోరుతున్నారు.