పార్థసారధి
హైదరాబాద్: దేశంలో ఎక్కడాలేని విధంగా 70 శాతంపైగా వ్యవసాయ రుణాల మీద ఆధాపడ్డ రైతులు మన ఏపిలో ఉన్నారని, అటువంటి రైతులను ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వడ్డీ వ్యాపారుల విషవలయంలోకి నెట్టివేస్తున్నారని వైఎస్‌ఆర్ సీపీ నేత పార్థసారధి విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ రైతాంగాన్ని చంద్రబాబు మోసం చేశారన్నారు. రుణమాఫీ పేరుతో ఆశలు పెడుతూ రైతులను అవమానపరిచారన్నారు. ఆర్బిఐ మాట వినడంలేదని రైతులకు మొండి చెయ్యి చూపారని మండిపడ్డారు.
చంద్రబాబు వల్ల వడ్డీలేని రుణాలను పొందే అవకాశాన్ని రైతులు కోల్పోయారని ఆయన బాధపడ్డారు. పాత రుణాలు కట్టందే కొత్త రుణాలివ్వం అని బ్యాంకులు చెబుతున్నాయన్నారు. రుణ మాఫీపై చంద్రబాబు శ్వేత పత్రాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. స్థానికత అనేది విద్యా, ప్రభుత్వ ఉద్యోగాలకు మాత్రమే వర్తిస్తుందని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వంతో సంప్రదించి విద్యార్థుల సమస్యలు పరిష్కరించడంలో చంద్రబాబు విఫలయ్యారని పార్థసారధి అన్నారు.