కన్నబాబుకు ఆపిల్ ఇచ్చి దీక్ష విరమింపజేస్తున్న మంత్రి నారాయణ
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: వారం రోజులుగా సాగుతున్న ఆత్మకూరు పంచాయితీకి సోమవారం తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఇరుపక్షాలు కొంత సర్దుబాటు ధోరణితో వ్యవహరించడం, జిల్లా పరిణామాలపై సీఎం చంద్రబాబు సీరియస్ కావడంతో ఈ వ్యవహారాన్ని తాత్కాలికంగా సద్దుమణిగించారు.
పార్టీ నేత కన్నబాబు దీక్ష విరమించడం, మాజీ మంత్రి ఆదాల ప్రభాకరరెడ్డి ఆత్మకూరులో పార్టీ సమావేశం నిర్వహించడం రెండూ జరిగిపోయాయి. ఆదివారం నుంచి ఎడతెరిపి లేకుండా సాగిన ఆత్మకూరు హైడ్రామా ఎపిసోడ్ చివరకు జిల్లా మంత్రుల మెడకు చుట్టుకుంది. జిల్లాలో ఇంత జరుగుతున్నా కనీసం మంత్రులు ఎందుకు జోక్యం చేసుకోలేదని పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు కన్నబాబుకు మొదటి నుంచి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మద్దతు ఇస్తుండగా, మాజీ మంత్రి ఆదాల ప్రభాకరరెడ్డికి మరో మంత్రి పి.నారాయణ సహకరిస్తుండడంతో ఇద్దరు మంత్రుల తీరు పార్టీలో తీవ్ర చర్చనీయాశంగా మారింది.
ఆదివారం రాత్రి కన్నబాబుతో మొదలైన మంతనాలు సోమవారం ఉదయం వరకు కొనసాగాయి. సామాజిక సమీకరణల నేపథ్యంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్రతోపాటు వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఇరువర్గాల మధ్య రాజీ చర్చలు సాగించారు. ఉదయం మంత్రి నారాయణ పార్టీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర, ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ మాజీ మంత్రి ఆదాల ప్రభాకరరెడ్డి నివాసంలో భేటీ అయి మంతనాలు జరిపారు. ఈక్రమంలో పార్టీ ముఖ్యులు కన్నబాబును కూడా కలుపుకొని ముందుకెళదామని ప్రతిపాదించడం, దానికి ఆదాల అంగీకరించడంతో ఆ తర్వాత బీద రవిచంద్ర, రామకృష్ణ కన్నబాబుతో మాట్లాడి అంగీకరింపజేశారు. చివరకు మంత్రి నారాయణ వచ్చి కన్నబాబుతో ఆపిల్ తినిపించి దీక్ష విరమింపజేశారు.
అక్కడి నుంచి మంత్రి నారాయణ, ఆదాల ప్రభాకరరెడ్డి, బీద రవిచంద్ర, కన్నబాబు అందరూ కలిసి వెళ్లి ఆత్మకూరులో సమావేశంలో పాల్గొన్నారు. అక్కడ కూడా కన్నబాబు సభాధ్యక్షత వహించి నేతలందరినీ ఆదాల ప్రభాకరరెడ్డికి పరి చయం చేశారు. దీంతో వివాదాన్ని తాత్కాలికంగా ముగించారు. అయితే తెర వెనుక భారీ మంతనాలు మాత్రం కొనసాగడంతో వర్గపోరులో ఆధిపత్యం కోసం మంత్రి సోమిరెడ్డి వర్గం, మాజీ మంత్రి ఆదాల వర్గం తీవ్రంగా కసరత్తు చేశాయి.
ఆదాల డౌన్ డౌన్ అంటూనే..
కన్నబాబు ఆమరణ దీక్ష పూర్తి సారాంశం పార్టీలో తనకి ప్రాధాన్యం ఇవ్వాలని, అందరినీ కలుపుకొని పోవాలనే అజెండాతో దీక్ష చేశారు. అయితే దీక్ష ప్రారంభం నుంచి ముగింపు వరకు పూర్తిగా ఆదాల నాయకత్వాన్ని వ్యతిరేకించడమే అజెండాగా కనిపించింది. సేవ్ టీడీపీ, ఆదాల డౌన్‌డౌన్ అంటూ నినాదాలు ఇచ్చారు. కానీ చివరికి ఆదాలతో కలిసి ఆత్మకూరు వెళ్లటం గమనార్హం.
పార్టీ ముఖ్యలపై అధిష్టానం సీరియస్
పార్టీ కార్యాలయంలో ఆమరణ దీక్ష నిర్వహించడాన్ని పార్టీ సీరియస్‌గా తీసుకుని కన్నబాబు తీరుపై మండిపడినట్లు సమాచారం. జిల్లాలో ఇదంతా జరుగుతున్నా సమన్వయం చేయాల్సిన మంత్రులు ఇలా చెరో గ్రూప్‌లో ఉంటూ రాజకీయం చేస్తున్నారా అని అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. మరోవైపు ఈ వ్యవçహారం జరగుతున్న క్రమంలో పార్టీ అధినేత చంద్రబాబునాయుడు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈక్రమంలో ఆదాల ప్రభాకరరెడ్డి జిల్లాలో పార్టీ ముఖ్యనేత ఇదంతా చేస్తున్నాడని మళ్లీ పరోక్షంగా సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిపై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఇంకోవైపు మంత్రి నారాయణ ఆదివారం నుంచి నెల్లూరు నగరంలోనే ఉన్నప్పటికీ జరుగుతున్న పరిణామాలపై నష్టనివారణ చర్యలు తీసుకోకపోవడంపై అసంతృప్తి వ్యక్తమయినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment