'జపాన్ భాషలో మాట్లాడే అవకాశం రావటం అదృష్టం'
ఒసాకా : జపాన్‌లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండో రోజూ బిజీబిజీగా గడిపారు. పర్యటనలో భాగంగా ఆయన ఒసాకాలోని ఛాంబర్ ఆఫ్ కామర్స్‌ను సందర్శించారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు హషీమటోతో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ లోని పారిశ్రామిక విధానం, అందుబాటులో ఉన్న వనరులపై చంద్రబాబు ప్రెజెంటేషన్ ఇచ్చారు.
ఏపీలో పెట్టుబడులకు గల అవకాశాలను, కల్పిస్తున్న రాయితీలను, ప్రోత్సాహకాలను వివరించారు. రాష్ట్రంలో 15 చిన్న, పెద్ద పోర్టులను అభివృద్ధి చేయాలనుకుంటున్నట్లు చెప్పారు. కాకినాడను హార్డ్‌వేర్ హబ్‌గా, కృష్ణపట్నంను స్మార్ట్ సిటీగా చేయాలనుకుంటున్నామని వెల్లడించారు. పెట్టుబడులు పెట్టేందుకు ఏపీ అత్యంత అనుకూల రాష్ట్రమని, పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాలని జపాన్ వ్యాపారవేత్తలను కోరారు.
జపాన్ భాషలో మాట్లాడే అవకాశం రావడం తన అదృష్టమని బాబు చెప్పారు. తుపానులు, భూకంపాలు, అణు విధ్వంసాలు జరిగినా జపాన్ అభివృద్ధిలో దూసుకుపోతోందని బాబు కితాబునిచ్చారు. సింగపూర్, మలేషియా, చైనా, తదితర దేశాలకు ఎగుమతులు ఆంధ్రప్రదేశ్ నుంచే జరుగుతున్నాయని, ఆ దేశాలకు ఏపీ గేట్ వేగా ఉందన్నారు.