హైదరాబాద్ : జపాన్ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ....పానాసోనిక్ కార్పొరేషన్ ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఏపీలోని పారిశ్రామిక విధానం, అందుబాటులో ఉన్న వనరులపై ఆయన ఈ సందర్భంగా ప్రజంటేషన్ ఇచ్చారు. 25 ఏళ్ల తర్వాత భారతదేశంలో సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పడిందని చంద్రబాబు అన్నారు. జపాన్లో మంచి పారిశ్రామిక సంబంధాలు పెట్టుకోవాలన్నది తమ ఆలోచనగా ఆయన తెలిపారు.
ఆంధ్రప్రదేశ్లో 15 పోర్టులను అభివృద్ధి చేయాలనుకుంటున్నట్లు చంద్రబాబు తెలిపారు. వ్యవసాయ రంగంలోనూ మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉందని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి జపాన్ ముందుకు రావాలని కోరుతున్నామన్నారు. ఏడు రోజుల్లోనే పరిశ్రమలకు అనుమతులు ఇచ్చేలా పాలసీని సిద్ధం చేస్తున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు.
భారత్, జపాన్ మధ్య మంచి సంబంధాలున్నాయని పానాసోనిక్ కార్పొరేషన్ ప్రతినిధులు తెలిపారు. ఇరుదేశాల మధ్య వ్యాపార సంబంధాలను మరింత విస్తరిస్తామని వారు పేర్కొన్నారు. ప్రధాని మోదీ కూడా జపాన్ అంటే ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని, ఏపీలో ఇప్పటికే కొన్ని జపాన్ కంపెనీలు పెట్టుబడులు పెట్టాయని పానాసోనిక్ కార్పోరేషన్ ప్రతినిధులు తెలిపారు. ఈ మేరకు చంద్రబాబు జపాన్ పర్యటన వివరాలను హైదరాబాద్ లో ప్రభుత్వ సమాచార సలహాదారు కార్యాలయం మంగళవారం ప్రకటన జారీ చేసింది.
ఏపీలో పెట్టుబడులు పెట్టండి: చంద్రబాబు
Published Tue, Nov 25 2014 8:25 AM | Last Updated on Sat, Jun 2 2018 2:56 PM
Advertisement