వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి బెయిల్ రానివ్వకుండా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు అడ్డుకునే ప్రయత్నం చేశారని ఆ పార్టీ ఎమ్మెల్యేలు జి.శ్రీకాంత్ రెడ్డి, ఎన్. ప్రసన్నకుమార్ రెడ్డి ఆరోపించారు. వైఎస్ జగన్ చంచల్ గూడ జైలు నుంచి మంగళవారం బెయిల్పై విడుదలవుతున్న నేపథ్యంలో హైదరాబాద్లో వారు విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. నిన్నటి వరకు కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)ని చంద్రబాబు భుజాన మోశారని, అలాంటి ఆయన వైఎస్ జగన్కు బెయిల్ రాగనే సీబీఐను దూషించడం మొదలు పెట్టారని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు.
తెలంగాణకు అనుకూలంగా ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకునేలా చంద్రబాబుపై ఒత్తిడి తీసుకురావాలని సీమాంధ్ర ప్రాంతానికి చెందిన టీడీపీ ప్రజాప్రతినిధులకు శ్రీకాంత్ రెడ్డి, ప్రసన్నకుమార్ రెడ్డి సూచించారు. వైఎస్ఆర్ ఎజెండా ప్రకారం సమైక్య రాష్ట్రంగాను ఉండాలని వారు తెలిపారు. తమ పార్టీకి అన్ని ప్రాంతాలు సమానమే అని అన్నారు. ప్రజల సమస్యలపై పోరాడే నాయకుడు కవాలని రాష్ట్రమంతా కోరుకుంటుందని తెలిపారు. కోర్టు అనుమతితో వైఎస్ జగన్ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో పర్యటిస్తారన్నారు.