
చెవిరెడ్డి మాటమీద నిలబడే వ్యక్తి
తిరుచానూరు : చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మాట మీద నిలబడే వ్యక్తి. నమ్మిన పార్టీని, సిద్ధాంతాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోని వ్యక్తి. అని చెవిరెడ్డిపై చిత్తూరు ఎంపీ డాక ్టర్ ఎన్. శివప్రసాద్ ప్రశంసల జల్లు కురిపించారు. తిరుపతి రూరల్ మండలం తనపల్లి, కుంట్రపాకం గ్రామ పంచాయతీలో ఆదివారం జరిగిన జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో ఎంపీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. చెవిరెడ్డి నమ్మిన సిద్ధాంతం, పార్టీ కోసం పని చేసే వ్యక్తి అన్నారు.
2001 టీడీపీ పాలనలో తాను రాష్ట్ర మంత్రిగా ఉన్నానని, ఆ సమయంలో జిల్లాలో టీడీపీ 32, కాంగ్రెస్ 33జెడ్పీటీసీ స్థానాలను కైవసం చేసుకుందన్నారు. ఎలాగైనా సీఎం సొంత జిల్లా అయిన చిత్తూరులో జెడ్పీ స్థానాన్ని టీడీపీ సొంతం చేసుకోవాలని, ఆ సమయంలో చెవిరెడ్డిని టీడీపీలోకి తీసుకోవడానికి అనేక ప్రయత్నాలు, ప్రలోభాలు పెట్టినా లొంగలేదని తెలిపారు. చివరకు కిడ్నాప్ చేయాలనుకున్నానని ఎంపీ ఆనాటి సంగతులను గుర్తుకు తెచ్చుకున్నారు. కేవలం చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి వల్లే టీడీపీ హయాంలోనూ జిల్లా పరిషత్‌ను కాంగ్రెస్ కైవసం చేసుకోగలిగిందని తెలిపారు.
చిన్నప్పటి నుంచే చెవిరెడ్డితోనూ, వారి కుటుంబతోనూ అనుబంధం ఉందని, ఆ చనువుతోనే చెవిరెడ్డిని తమ పార్టీలోకి తీసుకోవాలని అనుకున్నట్లు తెలిపారు. నమ్మిన పార్టీని, సిద్ధాంతాన్ని మోసం చేయలేనని తమ్ముడు చెవిరెడ్డి తనతో చెప్పిన మాటలు నాకు ఇంకా గుర్తు ఉందన్నారు. అంతటి నిబద్ధత కలిగిన చెవిరెడ్డితో కలిసి చంద్రగిరి నియోజకవర్గ అభివృద్ధికి తాను కృషి చేస్తానని, ప్రజలు కూడా తమతో పనిచేయించుకోవాలని కోరారు. అంతకుముందు ఎంపీ శివప్రసాద్‌ను పుష్పగుచ్ఛం, దుశ్శాల్వతో చెవిరెడ్డి సత్కరించారు.