విజయనగరం ఫోర్ట్ : చిన్నారులు ప్రయాణించే ప్రైవేటు పాఠశాలల బస్సుల పట్ల పలు పాఠశాలల యాజమాన్యాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. రవాణా శాఖాధికారులకు ఎంతోకొంత ముట్టజెప్పి, మేనేజ్ చేసుకోవచ్చునన్న భావనలో చాలామంది యాజమానులు ఉన్నారు. ఈ కారణంగానే పాఠశాలలు పునఃప్రారంభమై 12 రోజులు కావస్తున్నా...ఇప్పటికీ చాలామంది బస్సులు ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు (ఎఫ్‌సీ) తీసుకోలేదు. ఈ విషయమై సంబంధిత అధికారులు కూడా పట్టించుకోకపోవడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని పిల్లల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో 400 ప్రైవేటు పాఠశాలల బస్సులు ఉన్నాయి. వీటిలో 340 బస్సులు మాత్రమే ఇప్పటివరకు ఎఫ్‌సీ చేయించుకున్నాయి. 60 బస్సులు ఇంకా ఎఫ్‌సీ చేరుుంచుకోవాల్సి ఉంది.
వాస్తవానికి పాఠశాలలు పునఃప్రారంభమైన రోజు నాటికే ఎఫ్‌సీలు తీసుకోవాలి. కానీ 12 రోజులు కావస్తున్నా.. బస్సుల యజమానులు ఎఫ్‌సీలు తీసుకోకుండా అలసత్వం వహిస్తున్నారు. ఎఫ్‌సీ చేయించుకున్న బస్సుల్లో కూడా కొన్నింటి పరిస్థితి అధ్వాన్నంగా ఉన్నట్టు సమాచారం. విద్యార్థులు ప్రయాణించే బస్సు పూర్తిస్థాయి సామర్థ్యాన్ని కలిగి ఉండాలి. అలాగే డ్రైవర్ కూడా ఆరోగ్యవంతుడై ఉండి, ఎటువంటి చెడు అలవాట్లు లేకపోతే అప్పుడు విద్యార్థులు సురక్షితంగా ఇంటికి చేర్చగలరు. కానీ ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల యజమానులు ధనార్జనే తప్ప విద్యార్థుల భవిష్యత్తు గురించి అలోచించడం లేదు. కండిషన్ బాగాలేని బస్సులు నడిపి కాసుల కూడేసుకోవాలని చూస్తున్నారే తప్ప విద్యార్థుల క్షేమాన్ని విస్మరిస్తున్నారు. జిల్లాలో చాలా బస్సుల కండిషన్ అధ్వానంగా ఉంది. కొన్ని బస్సులు ప్రమాదాలకు ద్వారాలు తెరిచే విధంగా ఉన్నాయి. సీట్లు చిరిగిపోవడం, పెయింటెంగ్ వెలిసిపోవడం, అద్దాలు పగిలిపోవడంతో పాటు ఇంజిన్ కండిషన్ లేకపోవడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.
ప్రత్యేక డ్రైవ్‌పై మీనమేషాలు
గత ఏడాది రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ ఆదేశాలతో అధికారులు జిల్లావ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. ఈ డ్రైవ్‌లో నిబంధనలు అతిక్రమించిన 40 బస్సులను సీజ్ చేశారు. డ్రైవ్ చేపట్టిన వారం రోజులు స్కూల్ బస్సులు ప్రతీ రో జూ రవాణా శాఖ కార్యాలయం వద్ద బారులు తీరేవి. ఈ ఏడాది కూడా ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని కమిషనర్ ఆదేశించినప్పటికీ అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. అన్ని జిల్లాలోనూ దాడులు నిర్వహించినప్పటికీ ఇక్కడ మాత్రం ప్రత్యేక డ్రైవ్ చేపట్టలేదు.
నిబంధనలు కఠినతరం
గత ఏడాది కాకినాడ, ఖమ్మం జిల్లాలో జరిగిన పాఠశాల బస్సు ప్రమాదంలో కొంతమంది విద్యార్థులు మృత్యువాత పడ్డారు. దీంతో ఈ ఏడాది అధికారులు నిబంధనలను కఠినతరం చేశారు. నిబంధనలకు అనుగుణంగా బస్సు లేకపోతే ఫిటినెస్ సర్టిఫికేట్ ఇవ్వకుండా పంపించేస్తున్నారు. గత రెండు రోజుల్లో 20 వరకు బస్సులను రవాణాశాఖ అధికారులు తిప్పి పంపించేశారు. దీంతో బస్సు యాజమానులు బస్సులను కండిషన్‌గా ఉంచేందుకు షెడ్డులకు పంపించి యుద్ధప్రాతిపాదకన చర్యలు చేపడుతున్నారు.
రెండు రోజుల్లో ప్రత్యేక డ్రైవ్ :
ఒకటి, రెండు రోజుల్లో స్కూల్ బస్సులపై ప్రత్యేక డ్రైవ్ చేపడతామని ఇన్‌చార్జ్ ఆర్‌టీఓ ఐ. శివప్రసాద్‌రావు తెలిపారు. నిబంధనలు పాటించని, ఎఫ్‌సీ లేని వాహనాలను సీజ్ చేస్తామని చెప్పారు.
ఎఫ్‌సీ నిబంధనలు ఇవి
బస్సు ప్రధాన ద్వారం వద్ద పిల్లలు ఎక్కడనాకి 325 మిల్లీ మీటర్లు ఎత్తు ఉండాలి.
స్టీరింగ్, బ్రేకు, ఇంజిన్ కండిషన్ బాగుండాలి.
సీట్లు కొత్తగా ఉండాలి. టైర్లు కండిషన్ బాగు ఉండాలి.
బస్సులపై విద్యార్థులను ఆకర్షించే విధంగా బొమ్మలు వేయాలి. ప్రథమ చికిత్స బాక్సు ఉండాలి.
డ్రైవర్ 50 ఏళ్ల లోపు ఉండాలి. డ్రైవర్, క్లీనర్ యూనిఫారం ధరించాలి. డ్రైవర్ గాని క్లీనిర్ గాని మద్యం సేవించరాదు.
అద్దాలు, గ్రిల్స్ ఏర్పాటు చేయాలి. లైట్లు అన్నీ కొత్తవి ఏర్పాటు చేయాలి.
అత్యవసర ద్వారం, బ్రేకులు, స్టీరింగ్ కండిషన్‌గా ఉండాలి.
వాహనంలో విద్యార్థుల జాబితా ఉండాలి. డ్రైవర్‌కు లెసైన్సు తప్పనిసరి
ఇవి చేయకూడదు
సీట్లకు సరిపడ విద్యార్థులను మాత్రమే బస్సులో ఎక్కించాలి.
పరిమితికి మించి పిల్లలను ఎక్కించకూడదు.
ఎఫ్‌సీ లేకుండా బస్సును నడపరాదు. అలా చేస్తే రూ. 5 వేలు అపరాధ రుసం విధిస్తారు. బస్సును సీజ్ చేస్తారు.