
పెదవేగి పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహిస్తున్న అబ్బయ్య చౌదరి, కొఠారు రామచంద్రరావు, నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే దాడిలో తీవ్రంగా గాయపడిన మేడికొండ కృష్ణారావు
పశ్చిమగోదావరి, పెదవేగి రూరల్: చింతమనేని ప్రభాకర్ మరోసారి పైశాచికత్వం ప్రదర్శించారు. తన అక్రమ మట్టి తవ్వకాలపై ఫిర్యాదు చేసిన వ్యక్తిని కిడ్నాప్ చేయించి ఇంటికి తీసుకువచ్చి మరీ దాడి చేశారు. ఈ వ్యవహారంలో గన్‌మెన్లు కూడా సహకరించడం చర్చనీయాంశంగా మారింది. హత్యాయత్నం చేయడమే కాకుండా బాధితునిపై తన అనుచరులతో తనదైన శైలిలో ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టించే ప్రయత్నం చేశారు. దీన్ని వైఎస్సార్ సీపీ నేతలుఅడ్డుకున్నారు. చింతమనేని ప్రభాకర్‌పై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ పెదవేగి పోలీసు స్టేషన్ ఎదుట మూడు గంటలకుపైగా వైఎస్సార్ సీపీ దెందులూరు నియోజకవర్గ కన్వీనర్ కొఠారు అబ్బయ్యచౌదరి బైఠాయించారు. దీంతో రంగంలోకి దిగిన అదనపు ఎస్పీ ఈశ్వరరావు చింతమనేని ప్రభాకర్‌తో పాటు దాడి చేసిన అనుచరులు, గన్‌మెన్‌లపై కేసు పెడుతున్నట్టు ప్రకటించారు. మరోవైపు 65 రోజుల క్రితం చింతమనేని దాడి చేసిన జాన్ అనే దళిత కార్మికుని విషయంలో హైకోర్టు పోలీసులకు నోటీసులు జారీ చేసింది. చింతమనేనిపై కేసు నమోదు చేసినా ఏ కేసులోనూ పోలీసులు అరెస్టు చేయకపోవడంతో అతను ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.
అసలేం జరిగింది..
దెందులూరు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ నేత మేడికొండ సాంబశివ కృష్ణారావుపై గురువారం చింతమనేని అనుచరులు దాడికి దిగారు. పెదవేగి మండలం వంగూరు పంచాయతీ లక్ష్మీపురం పోలవరం కుడికాలువ గట్టు వద్ద ఈ ఘటన జరిగింది.
పెదవేగి మాజీ సర్పంచ్ అయిన కృష్ణారావు గురువారం ఏలూరు నుంచి గార్లమడుగు వెళ్తుండగా లక్ష్మీపురం కాలువ గట్టును చింతమనేని అనుచరులు పొక్లెయిన్, టిప్పర్లతో మట్టిని తవ్వి తరలించడం చూశారు. దీనిపై ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే ఇరిగేషన్ అధికారులు ఘటనా స్థలానికి వచ్చేలోగానే ఫిర్యాదు చేసిన సమాచారాన్ని ఎమ్మెల్యేకు అందించినట్టు ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఎమ్మెల్యే ఇరిగేషన్ అధికారులతోనే మేడికొండ కృష్ణారావుకు ఫోన్ చేయించి ఘటనా స్థలానికి రప్పించారు. ఈలోగా ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుచరులు గద్దేకిషోర్, ఏలియా, మరో పది మందికిపైగా టిడిపి నేతలు వచ్చి ‘మా మీదే ఫిర్యాదు చేస్తావా’ అంటూ కృష్ణారావును విచక్షణారహితంగా కొట్టారు. తర్వాత వారు కృష్ణారావును కిడ్నాప్ చేసి దుగ్గిరాల గ్రామంలోని ఎమ్మెల్యే ఇంటికి తీసుకువెళ్లారు. అక్కడ ఎమ్మెల్యే ‘ఏరా మన సామాజిక వర్గానికి చెందినవాడివై ఉండి మా మీదే ఫిర్యాదు చేస్తావా’ అంటూ బూటుకాలితో పొట్టలో, తలపై తన్నటంతో కృష్ణారావు కింద పడిపోయారు. కిందపడిన తర్వాత ఎమ్మెల్యే, అతని అనుచరులు మరోసారి కృష్ణారావుపై దాడి చేశారు. గన్‌మెన్‌లు చేతులు వెనక్కి విరిచి పట్టుకున్నారని బాధితుడు చెబుతున్నారు. అనంతరం దాడిచేసిన వారే తనను పెదవేగి పోలీస్ స్టేషన్ వద్దకు తీసుకువెళ్లి అక్రమ కేసులు బనాయించేందుకు యత్నించారని కృష్ణారావు వివరించారు.
వీధిరౌడీలా ప్రవర్తిస్తే చూస్తూ ఊరుకోం : అబ్బయ్యచౌదరి
చింతమనేని ప్రభాకర్ వీధిరౌడీలా ప్రవర్తిస్తే చూస్తూ ఊరుకునేది లేదని దెందులూరు వైఎస్సార్ సీపీ సమన్వయకర్త అబ్బయ్యచౌదరి హెచ్చరించారు. కృష్ణారావుపై జరిగిన హత్యాయత్నం సమాచారాన్ని తెలుసుకుని పెదవేగి పోలీస్ స్టేషన్‌కు చేరుకుని అక్కడ బైఠాయించారు. హత్యాయత్నం చేసిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, టీడీపీ నేతలు, గన్‌మెన్‌లపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కృష్ణారావుకు న్యాయం జరిగేంతవరకూ తాము పోరాడతామన్నారు. ఈ విషయాన్ని తమ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకువెళతానన్నారు. కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తే తాము చూస్తూ ఊరుకోబోమన్నారు.ఆందోళన తీవ్రతరం కావడంతో ఘటనా స్థలానికి చేరుకున్న జిల్లా ఏఎస్పీ కె.ఈశ్వరరావు అబ్బయ్య చౌదరితో మాట్లాడి, ఎమ్మెల్యే, టీడీపీ నేతలు, గన్‌మెన్‌లపై కేసు నమోదు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ధర్నాలో వైఎస్సార్‌సీపీ దెందులూరు కన్వీనర్ అబ్బయ్య చౌదరి, పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త కోటగిరి శ్రీధర్, జిల్లా అధికార ప్రతినిధి కొఠారు రామచంద్రరావు, పలువురు మండల నేతలు పాల్గొన్నారు. పార్టీ లీగల్ అడ్వయిజర్ లక్ష్మీకుమార్ మాట్లాడుతూ చట్టపరంగా నిందితులపై కఠిన చర్యలు తీసుకునేందుకు కోర్టును ఆశ్రయిస్తామన్నారు. గాయపడిన కృష్ణారావును ఏలూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించి వైద్యచికిత్స చేయిస్తున్నారు.
చింతమనేనిపై కేసు
మేడికొండ కృష్ణారావుపై హత్యాయత్నం చేసిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, అతని అనుచరులు, గన్‌మెన్‌లపై 248/18గా ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. సెక్షన్ 341, 363, 323,324,379 రెడ్ విత్ 34 (కిడ్నాప్, దాడి చేసినట్లు)గా నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. హత్యాయత్నం కేసులో ఏ2గా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పేరు, ఏ1గా చింతమనేని ప్రధాన అనుచరుడు గద్దే కిషోర్ పేరు, ఏ3గా ఎమ్మెల్యే గన్‌మెన్‌ల పేర్లు నమోదు చేశారు.