మెర్రీ క్రిస్మస్
తిరుపతి కల్చరల్: ఏసుక్రీస్తు పుట్టిన పర్వదినమైన క్రిస్మస్ సందర్భంగా జిల్లాలోని చర్చిలన్నీ రంగు రంగుల విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. గురువారం క్రిస్మస్ పర్వదినం కావడంతో బుధవారం రాత్రి నుంచే చర్చిలు క్రిస్మస్ వేడుకలతో కళకళలాడాయి. చర్చిల్లో ఆకర్షణీయంగా క్రిస్మస్ ట్రీలు కొలువుతీర్చారు. ఏసు త్యాగనిరతిని, లోకానికి అందించిన శాంతి సందేశాన్ని తెలిపే చిత్రాలు, బొమ్మలతో అలంకరణలు చేశారు. బుధవారం అర్ధరాత్రి క్రిస్మస్ కేక్‌లు కట్ చేసి ఏసు పుట్టిన రోజు సంబరాలను జరుపుకున్నారు. క్రిస్టియన్లందరూ పరస్పరం క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. భక్తి శ్రద్ధలతో పరిశుద్ధ క్రిస్మస్ ప్రార్థనలు నిర్వహించారు. బిషప్‌లు, పాస్టర్లు చర్చిల్లో ఏసు జన్మ చరిత్రను తెలుపుతూ శాంతి సందేశాలు అందించారు. క్రిస్టియన్లు అందరూ కుంటుంబ సమేతంగా చర్చిలకు చేరుకుని ప్రార్థనలు చేశారు.
తిరుపతి నగరంలోని వెస్ట్ చర్చి, ఈస్ట్ చర్చిలో, సౌత్ ఆంధ్రా లూథరన్ సంఘం ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. చర్చిల్లో పిల్లలు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. పవిత్ర క్రిస్మస్‌ను పురస్కరించుకుని పేదలకు అన్నదానం, వస్త్ర దానాలు చేశారు. ఒక్క తిరుపతి నగరంలోనే కాదు.. మదనపల్లె, చిత్తూరు, శ్రీకాళహస్తి, పుంగనూరు, పలమనేరు తదితర పట్టణాలతో పాటు జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోని చర్చిల్ల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
లోకరక్షకుడి జన్మదినం క్రిస్మస్
ప్రజల రక్షణకై లోకరక్షకుడు ప్రభువైన ఏసుక్రీస్తు దివి నుంచి భువికి దిగివచ్చిన శుభదినమే క్రిస్మస్. క్రిస్మస్ అంటే వెలుగు. పాపంతో నిండిన చీకటి లోకానికి ఏసుక్రీస్తు వెలుగుగా అవతరించాడు. ఏసు ప్రసాదించిన వె లుగు జనులకు పవిత్ర త్రోవ చూపి సత్యమార్గంలో నడిపించింది. దీవించి నిత్య జీవితమును అనుగ్రహించిన రక్షకుడు ఏసుక్రీస్తు. అలాంటి వెలుగును అందరూ కలిగి ఉండాలని క్రిస్మస్ సందర్భంగా యావన్మందికి క్రిస్మస్ శుభాకాంక్షలు.
-బి.అరుణోదయకుమార్,
కోశాధికారి, సౌత్ ఆంధ్రా లూథరన్ సంఘం