ముచ్చట ముగిసింది!
హంగూ ఆర్భాటాలతో సీఐఐ సదస్సు నిర్వహణ
మూడు రోజులకు రూ.20 కోట్ల భారీ వ్యయం
ఊపిరి పీల్చుకున్న అధికార యంత్రాంగం
వచ్చే ఏడాదీ ఇక్కడే..
విశాఖపట్నం: మూడు రోజుల ముచ్చట ముగిసింది. వందల సంఖ్యలో ఒప్పందాలు.. లక్షల కోట్ల పెట్టుబడుల నిర్ణయాలు జరిగాయి.. వీటిలో ఎన్ని ఆచరణరూపం దాలుస్తాయన్నది ఇప్పటికిప్పుడు చెప్పలేకపోయినా.. దేశ విదేశాల నుంచి వచ్చిన పారిశ్రామిక దిగ్గజాలు, మంత్రులు, అధికారులతో, ఇతర ప్రతినిధులతో మూడు రోజులపాటు కళకళలాడిన సాగరతీరంలోని సదస్సు ప్రాంగణం సదస్సు ముగిసిన తర్వాత మంగళవారం సాయంత్రం బోసిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం సీఐఐతో కలిసి ఆర్బాటంగా నిర్వహించిన అంతర్జాతీయ భాగస్వామ్య సదస్సు నిర్వహణలో గత కొన్ని రోజులుగా తలమునకలైన రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యంగా విశాఖ జిల్లా యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. 41 దేశాల నుంచి 350 మంది, దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి సుమారు 1200 మంది ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరయ్యారు. కేంద్ర మంత్రులతో పాటు కొన్ని దేశాల మంత్రులు కూడా పాల్గొన్నారు. రెండు వేల మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
తొలిరోజు ముఖ్యమంత్రితో పాటు కేంద్రమంత్రులు అరుణ్‌జైట్లీ, నిర్మలాసీతారామన్, పీయూష్ గోయల్, రిలయన్స్ అధినేత అనీల్ అంబానీ, గోద్రేజ్ చైర్మన్ ఆది గోద్రేజ్, జీఎంఆర్ అధినేత గ్రంథి మల్లికార్జునరావు, భారత్ ఫోర్జ్ సీఎండీ బాబా కల్యాణి, ఫోర్బ్స్ డెరైక్టర్ నౌషద్ ఫోర్బ్స్, సీఐఐ డీజీ చంద్రజీత్ బెనర్జీ వంటి ప్రముఖులు హాజరయ్యారు. రెండో రోజు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, నిర్మలా సీతారామన్, జయంతి సిన్హా, సుజనాచౌదరి, బంగ్లాదేశ్ మంత్రి తోఫైల్ అహ్మద్, నేపాల్ మంత్రి దీపక్ బొహరా, మాలవి మంత్రి జోసెఫ్ మనమ్‌వెఖా, వాల్‌మార్ట్ ప్రెసిడెంట్ క్రిష్‌లేర్, ఫ్యూచర్ గ్రూప్ సీఈఓ కిషోర్ బియానీ, ఆదిత్య బిర్లా సీఈవో విశాక్ కుమార్, సీఐఐ రాష్ట్ర అధ్యక్షుడు సుమీత్ సురేష్‌రాయుడు చిట్టూరి తదితరులు పాల్గొన్నారు. మూడో రోజు గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్, కేంద్రమంత్రులు అశోక్‌గజపతిరాజు, అనంతకుమార్, ప్రకాష్ జవదేకర్, సుజనాచౌదరి, రాష్ట్ర మంత్రి యనమల రామకృష్ణుడు, ఏంపీ గల్లా జయదేవ్, ఐటీసీ ఈడీ నకుల్ ఆనంద్, ఇండిగో అధ్యక్షుడు ఆదిత్య ఘోష్ తదితరులు హాజరయ్యారు. ఎనిమిది ప్లీనరీలు, పలు సెషన్లు నిర్వహించారు. మొత్తం మూడు రోజుల్లో 328 ఎంఓయూలు కుదుర్చుకోగా, రూ.4.67 లక్షల కోట్ల పెట్టుబడులు సమకూరుతాయని అంచనా వేస్తున్నారు.
మంచినీళ్లలా ఖర్చు..: సాగ రతీరానికి చేరువలోని హార్బర్ పార్కు వద్ద ఉన్న ఏపీఐఐసీ స్థలంలో నిర్వహించిన ఈ సదస్సుకు ప్రభుత్వం మంచినీళ్ల ప్రాయంగా నిధులు ఖర్చు చేసింది.
సదస్సు ప్రాంగణంలో ప్లీనరీలు, సెషన్ల నిర్వహణకు, ఎంఓయూలు కుదుర్చుకోవడానికి వీలుగా అత్యాధునిక షామియానాలు, స్టాళ్లను ఏర్పాటు చేశారు. ప్రతినిధులకు స్టార్‌హోటళ్లలో ఖరీదైన బస, విందు భోజనాలు ఏర్పాటు చేసింది. అత్యంత విలాసవంతమైన వందలాది కార్లను సమకూర్చింది. సుమారు రూ.20 కోట్లు వెచ్చించినట్టు అంచనా. ఈ మూడు రోజులూ విశాఖనే రాజధానిగా మలిచి ఇక్కడ నుంచే ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వివిధ శాఖల కార్యదర్శులు పాలన సాగించారు. ప్రాంగణంలో నాలుగు హాళ్లను ఏర్పాటు చేసి ఒకదాన్ని ముఖ్యమంత్రి సచివాలయంగా మార్చేశారు. సదస్సుకు వచ్చిన స్పందనను చూసి వచ్చే ఏడాది కూడా విశాఖలోనే సీఐఐ భాగస్వామ్య సదస్సు నిర్వహించాలని నిర్ణయించారు.