గడువులోగా స్కీమ్స్‌ | CM YS Jagan launched a special revolutionary program in AP | Sakshi
Sakshi News home page

గడువులోగా స్కీమ్స్‌

Published Wed, Jun 10 2020 3:17 AM | Last Updated on Wed, Jun 10 2020 8:24 AM

CM YS Jagan launched a special revolutionary program in AP - Sakshi

నిర్దిష్ట కాల పరిమితిలోగా సేవలు అందించే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న సీఎం జగన్‌

దరఖాస్తు చేసుకున్న కొద్దిపాటి సమయంలోనే లబ్ధిదారులకు సంక్షేమాన్ని చేరువ చేయాలి. అలా చేయగలమనే నమ్మకంతో ఈ రోజు ఒక విప్లవాత్మక నిర్ణయానికి శ్రీకారం చుట్టాం. ఈ నిర్ణయం తీసుకునేటప్పుడు ‘ప్రజలకు ఎందుకు అంతగా కమిట్‌మెంట్‌ ఇవ్వాలి? అలా ఇస్తే చేయగలుగుతామో.. లేదో’నని కొంత మంది అనుమానాలు వ్యక్తం చేశారు. ప్రజలకు మనం సంతృప్త స్థాయిలో పారదర్శకంగా.. అవినీతి, వివక్ష లేని వ్యవస్థను అందిస్తున్నప్పుడు కచ్చితంగా కమిట్‌మెంట్‌ ఇవ్వగలమని వారికి స్పష్టం చేశాను.

పది రోజుల్లో నిర్ధిష్టమైన కారణం ఉంటేనే దరఖాస్తును నిరాకరించాలి. సరైన కారణం లేకుండా నిరాకరిస్తే మనం దానికి తగిన పరిహారం కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇది ప్రభుత్వం తీసుకుంటున్న కమిట్‌మెంట్‌. దీనిని కలెక్టర్లు, జేసీలు అంతే కమిట్‌మెంట్‌తో అత్యంత ప్రాధాన్యతగా తీసుకోవాలి. దీనిపై మరింత శ్రద్ధ పెట్టాలి. 
– సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: అర్హత ఉన్న వారికి సంక్షేమ పథకాలను నిర్ధిష్ట కాల వ్యవధిలో మంజూరు చేయకపోతే పరిహారం చెల్లించాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. సరైన కారణం లేకుండా ఏ దరఖాస్తూ తిరస్కరించరాదని చెప్పారు. నిర్ధిష్ట కాల పరిమితిలోగా అర్హులకు సంక్షేమ పథకాలను మంజూరు చేసే బాధ్యత గ్రామ సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థను పర్యవేక్షిస్తున్న జాయింట్‌ కలెక్టర్లదేనని స్పష్టం చేశారు. పాలనలో విప్లవాత్మక మార్పుల్లో భాగంగా సంక్షేమ పథకాల అమలులో సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి.. నిర్ధిష్ట కాలపరిమితిలోగా సేవలు అందించే కార్యక్రమాన్ని మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు. అర్హులైన వారికి దరఖాస్తు చేసుకున్న 10 రోజుల్లోనే బియ్యం కార్డు, పెన్షన్‌ కార్డు, 20 రోజుల్లో ఆరోగ్యశ్రీ కార్డు, 90 రోజుల్లో ఇళ్ల స్థలాల పట్టాలు ఇస్తామనే అంకితభావం (కమిట్‌మెంట్‌)పై ముఖ్యమంత్రి సంతకం చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్లు, జేసీలు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ.. అవినీతి, వివక్షకు తావు లేకుండా అర్హులందరికీ సంతృప్త స్థాయిలో సంక్షేమ ఫలాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. తనకు ఓటు వేయని వారికి కూడా అర్హత ఉంటే సంక్షేమ పథకాలు అందాల్సిందేనని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో ఎంత చిత్తశుద్ధితో ఉందో అంతే చిత్తశుద్ధితో జిల్లా కలెక్టర్లు, జేసీలు అత్యంత ప్రాధాన్యతగా తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో సీఎం ఇంకా ఏమన్నారంటే.. 
క్యాంపు కార్యాలయంలో నిర్దిష్ట కాలపరిమితిలోగా సేవలు అందించే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌. చిత్రంలో మంత్రులు పెద్దిరెడ్డి, కొడాలి నాని, సురేష్, సీఎస్‌ నీలం సాహ్ని తదితరులు   

సంతృప్త స్థాయిలో అర్హులందరికీ పథకాలు 
► గతంలో ఎన్నికలకు ఆరు నెలల ముందు 44 లక్షల పెన్షన్లు ఉంటే, మన ప్రభుత్వం వచ్చాక 58 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నాం. ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు రూ.1,000 పెన్షన్‌ ఇచ్చేవారు. నేడు మనం దానిని రూ.2,250కి పెంచి ఇస్తున్నాం. సంతృప్తికర స్థాయి వరకు అర్హులైన వారందరికీ పెన్షన్లు ఇస్తున్నాం. 
► బియ్యం కార్డుల విషయంలో కూడా విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నాం. అర్హులైన లబ్ధిదారులకు అవసరమైన పథకాలను సంతృప్తికర స్థాయిలో ఇవ్వాలన్నదే మన ప్రభుత్వ లక్ష్యం. 
► రాష్ట్రంలో 1.42 కోట్ల మందికి ఆరోగ్యశ్రీ కార్డులను పంపిణీ చేశాం. రాష్ట్రంలో దారిద్య్ర రేఖకు ఎగువనున్న వారితో (ఏపీఎల్‌)తో కలుపుకుంటే.. మొత్తం ఇళ్లు 1.47 కోట్ల వరకు వుంటాయి. ఇవాళ 30 లక్షలకు పైగా అర్హులైన వారికి ఇళ్ల స్థలాల పట్టాలు ఇస్తున్నాం. అంటే దాదాపు 20 శాతం వరకు ఇళ్ల స్థలాల పట్టాలు ఇస్తున్నాం. శాచ్యురేషన్‌ లెవల్‌ వరకు ఇస్తున్నాం కాబట్టి తర్వాత వచ్చే దరఖాస్తులు కూడా తక్కువగానే వుంటాయి. 

త్వరితగతిన దరఖాస్తుల పరిశీలన 
► నిర్ణీత సమయంలో దరఖాస్తులను పరిశీలించి అర్హులు అని తేలితే.. వెంటనే కార్డులు ఇవ్వాల్సిందే. దీనిపై ఇప్పటికే జాయింట్‌ కలెక్టర్లకు ప్రత్యేక ఆదేశాలు ఇచ్చాం. జిల్లాల్లో కలెక్టర్లు, జేసీలు ఇందుకు పూర్తి బాధ్యత వహించాలి. 
► కలెక్టర్లు గ్రామ, వార్డు సచివాలయాల్లో ఏ జరుగుతోందో పర్యవేక్షించాలి. వస్తున్న దరఖాస్తులపై ఎప్పటికప్పుడు సమీక్షించాలి. అర్హత వుంటే.. కచ్చితంగా ఇన్ని రోజుల్లో సంక్షేమ పథకం అందిస్తామనే నమ్మకం కలిగించాలి.  

ఎవరి సిఫారసూ అక్కరలేదు.. 
► ఎవరికైనా ప్రభుత్వ సంక్షేమ పథకం సేవలు లభించకపోతే తర్వాత వారు తిరిగి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తున్నాం. గతంలో సంక్షేమ పథకాలు ఇస్తారో లేదో తెలియని పరిస్థితి వుండేది. దానికి కూడా లంచాలు, రికమండేషన్లు అవసరమయ్యేవి. దానికి భిన్నంగా నేడు అర్హత వుంటే చాలు ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హులవుతారు. గ్రామ సచివాలయాల్లో అర్హుల జాబితాలను ప్రదర్శిస్తున్నాం. జాబితాలో అర్హులైన వారి పేరు లేకపోతే.. వారు తిరిగి ఎలా దరఖాస్తు చేసుకోవాలో సూచిస్తున్నాం. 
► పారదర్శకంగా, అవినీతి లేకుండా.. అందరికీ పథకాలను అందించాలనేదే ప్రభుత్వ లక్ష్యం. మనకు ఓటు వేయని వారైనా సరే, వారికి కూడా సంక్షేమ పథకాలు అందాలనేది మన లక్ష్యం. ఇందులో భాగంగా 10 రోజుల్లో బియ్యం కార్డు, పెన్షన్‌ కార్డు ఇస్తామనే దానిపై సంతకం పెడుతున్నాను. 
► 20 రోజుల్లో ఆరోగ్యశ్రీ కార్డు, 90 రోజుల్లో పట్టా ఇస్తామనే కమిట్‌మెంట్‌పై సంతకం చేస్తున్నాను. అక్కచెల్లెమ్మల పేరుపై ఇళ్ల స్థలాలు రిజిస్టర్‌ చేసి పట్టా ఇవ్వాలి. లబ్ధిదారులకు పట్టా పంపిణీ చేశాక వలంటీర్ల ద్వారా రశీదు తీసుకోవాలి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement