ప్రత్యేక హోదా కోసం ఆత్మహత్యాయత్నం
కృష్ణా జిల్లా పామర్రులో ఉరి వేసుకున్న వ్యక్తి
నేతలు తన కుటుంబాన్ని ఆదుకోవాలని వినతి
పెళ్లి రోజునే ఘటన.. నిలకడగా బాధితుడి ఆరోగ్యం
పరామర్శించిన సీఎం చంద్రబాబు...
బాధితుడి తండ్రితో ఫోన్ మాట్లాడిన వైఎస్ జగన్
హైదరాబాద్/పామర్రు/పెనమలూరు: ఏపీకి ప్రత్యేక హోదా రాకపోతే ఉద్యోగావకాశాలు దక్కవని భావించిన ఓ వ్యక్తి తన పెళ్లి రోజునే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కృష్ణా జిల్లా పామర్రులో ఈ సంఘటన చోటుచేసుకుంది. పామర్రు సాయినగర్‌కు చెందిన చావలి సుబ్బారావు(గిరి) భార్య, ఇద్దరు పిల్లలతో తన తల్లిదండ్రుల వద్ద ఉంటున్నాడు. తమ డాబాపై ఉన్న పాకలో శనివారం ఉరి వేసుకున్నాడు. ఇది గమనించిన అతడి తల్లి కేకలు వేయడంతో చుట్టుపక్కలవారు వచ్చి తాడును కోసి కిందికి దించారు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన బాధితుడిని తొలుత స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి, అనంతరం మెరుగైన వైద్యం కోసం పోరంకిలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. సుబ్బారావు ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ప్రాంతంలో సూసైడ్ నోట్‌ను కుటుంబసభ్యులు గుర్తించారు. విజయవాడలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆస్పత్రిలో బాధితుడిని పరామర్శించారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్... బాధితుడి తండ్రితో ఫోన్‌లో మాట్లాడి ధైర్యం చెప్పారు. త్వరలో వచ్చి సుబ్బారావును చూస్తానని ఓదార్చారు.
హోదా లేదు.. ఉద్యోగం రాదు
సుబ్బారావు సూసైడ్ నోట్‌లోని వివరాలివీ... ‘‘నేను ఎస్‌ఎస్‌సీ, ఐటీఐ పూర్తిచేశాను. నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్(నాక్)లో శిక్షణ పొందాను. ఉద్యోగం కోసం 18 సార్లు ఇంటర్వ్యూలకు వెళ్లినా ప్రయోజనం దక్కలేదు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాదన్న విషయం నన్ను బాధించింది. ఇక జన్మలో నాకు ఉద్యోగం రాదని అర్థమైంది. ఇటువంటి పరిస్థితులలో ప్రాణ త్యాగమే కచ్చిత నిర్ణయంగా భావించాను. ఎన్ని ప్రభుత్వాలు మారినా ఒక ఆటో లోన్ కూడా తీసుకోలేకపోయా. నా భార్యా పిల్లలకు కూడు పెట్టలేక సంఘంలో ఎలా బతకాలో అర్థంకాక ఆత్మహత్యకు పాల్పడుతున్నా. మూడు నెలలుగా ఆలోచించి నా పెళ్లి రోజున ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించున్నా. చంద్రబాబు, జగన్, ఇతర నాయకులు... మీకు వీలుంటే నా కుటుంబాన్ని ఆదుకోండి. డాడ్, మామ్, వైఫ్, డాటర్, సన్.. ఐ మిస్ యూ. బట్ ఆంధ్రా లైక్. ఇప్పటివరకు నాతో కలిసి ఉన్న వారందరికీ ధన్యవాదాలు’’ అని పేర్కొన్నాడు.
నిలకడగా సుబ్బారావు ఆరోగ్యం
ఆత్మహత్యాయత్నం చేసిన సుబ్బారావు ఆరోగ్యం నిలకడగా ఉందని పెనమలూరు మండలం పోరంకిలోని బొప్పన ఆసుపత్రిలో ఎండీ బొప్పన వెంకటరత్నం తెలిపారు. బాధితుడికి ఐసీయూలో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నామని చెప్పారు. వెంటిలేటర్ తీసిన తర్వాత కానీ వివరాలు చెప్పలేమన్నారు. ఆసుపత్రిలో సుబ్బారావు భార్య సుజాత అస్వస్థతకు గురైంది. ఆమెకు ఒక్కసారిగా బీపీ పెరగడంతో కుప్పకూలింది. ఆమెకు అదే ఆసుపత్రిలో వైద్య చికిత్స అందిస్తున్నారు.
ప్రత్యేక హోదాపై ప్రజలు అధైర్యపడొద్దు: సీఎం
రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై ప్రజలు అధైర్యపడొద్దని, తాను కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ప్రత్యేక హోదా కోసం ఆత్మహత్యాయత్నం చేసి, బొప్పన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చావలి సుబ్బారావును శనివారం చంద్రబాబు పరామర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక హోదాపై ప్రగాఢమైన కోరిక ఉందన్నారు. విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి న్యాయం జరగాల్సి ఉందని తెలిపారు. ఇప్పటికే తాను కేంద్రంతో చర్చలు జరుపుతున్నానని చెప్పారు. బీజేపీ కూడా రాష్ట్ర ప్రయోజనాలకు సానుకూలంగా ఉందని అన్నారు. ఈ నెల 25న ప్రధానమంత్రితో చర్చలు జరుపుతానని వెల్లడించారు. ప్రత్యేక హోదా, ప్యాకేజీ కోసం కృషి చేస్తానని పేర్కొన్నారు. ఎవరూ అధైర్యపడొద్దని, తాను ప్రజలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. కేంద్రం ప్రత్యేక హోదా ఇస్తుందన్న నమ్మకం తనకుందని తెలిపారు. ప్రజలు తొందరపాటుతో ఎలాంటి చర్యలకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు. మంత్రులు చినరాజప్ప, దేవినేని ఉమామహేశ్వరరావు, డీజీపీ జె.వి.రాముడు, ఇతర అధికారులు చంద్రబాబు వెంట ఉన్నారు.