జిల్లా కాంగ్రెస్ కమిటీ ఏర్పాటుపై కార్యకర్తల్లో అసంతృప్తి వ్యక్తమైంది. పార్టీని నమ్ముకున్నవారికి పదవులు ఇవ్వలేదని, ఇతర పార్టీలనుంచి వలస వచ్చిన వారికి ప్రాధాన్యత ఇచ్చారని పలువురు పీసీసీ అధ్యక్షుడికి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.
నిజామాబాద్‌సిటీ, న్యూస్‌లైన్ : జిల్లా కాంగ్రెస్ కమిటీ ఏర్పాటుపై కార్యకర్తల్లో అసంతృప్తి వ్యక్తమైంది. పార్టీని నమ్ముకున్నవారికి పదవులు ఇవ్వలేదని, ఇతర పార్టీలనుంచి వలస వచ్చిన వారికి ప్రాధాన్యత ఇచ్చారని పలువురు పీసీసీ అధ్యక్షుడికి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. దీంతో రాత్రికిరాత్రే డీసీసీ కార్యవర్గంలో మార్పులు జరిగాయి. మొదట ప్రకటించిన కార్యవర్గానికి అదనంగా మరో తొమ్మిది మందికి పదవులు కట్టబెట్టారు.
పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఆదేశాలతో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు తాహెర్ బిన్ హందాన్ గురువారం ఉదయం డీసీసీ కార్యవర్గాన్ని ప్రకటించారు. మొదట 24 మంది ఉపాధ్యక్షులు, 39 మంది ప్రధాన కార్యదర్శులు, 37 మంది కార్యదర్శులు, 13 మంది సహాయ కార్యదర్శులు, ఒక కోశాధికారిని నియమించారు.
జిల్లాలోని అన్ని ప్రాంతాలకు, అన్ని వర్గాలకు కార్యవర్గంలో ప్రాధాన్యత కల్పించామని డీసీసీ అధ్యక్షుడు ప్రకటించారు. కానీ కొద్ది గంటల్లోనే సీన్ మారిపోయింది. పలుకుబడి ఉన్న నాయకుల అనుచరులకు పెద్దపీట వేశారని, పార్టీని నమ్ముకుని పనిచేస్తున్నవారికి మొండి చేయి చూపారని జిల్లా నుంచి పీసీసీ అధ్యక్షుడికి ఫిర్యాదులు వెళ్లినట్లు తెలిసింది. నిన్న కాక మొన్న ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పదవులు ఇవ్వటమేమిటని పలువురు ఆయనను నిలదీసినట్లు సమాచారం. ఏనాడూ పార్టీ మెట్లు ఎక్కని వారికీ పదవులు కట్టబెట్టడంపై కార్యకర్తల్లో అసంతృప్తి వ్యక్తమైంది. ఇలా నూతన కార్యవర్గంపై నిరసనలు వ్యక్తం కావడంతో రాత్రికిరాత్రి కార్యవర్గంలో మార్పులు చేశారు. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఆదేశాల మేరకు కార్యవర్గంలో మరో తొమ్మిది మందికి చోటు కల్పించారు.
నూతన జాబితా..
పార్టీ జిల్లా ఉపాధ్యక్షుల జాబితాలో నాగేశ్వర్‌రావు, నిమ్మ మోహన్‌రెడ్డి, నర్సింహారెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి లను చేర్చారు. ప్రధాన కార్యదర్శులుగా పంపరి శ్రీనివాస్, అందె శంకర్‌రెడ్డి, భీంరెడ్డిలను నియమించారు. కార్యదర్శులుగా ఐరేని నర్సయ్య, అబ్రబోయిన స్వామిలకు చోటు కల్పించారు. ప్రస్తుతం డీసీసీ కార్యవర్గంలో అధ్యక్షుడితోపాటు 28 మంది ఉపాధ్యక్షులు, 42 మంది ప్రధాన కార్యదర్శులు, 39 మంది కార్యదర్శులు, 13 మంది సహాయ కార్యదర్శులు, ఒక కోశాధికారి ఉన్నారు.