
కాంగ్రెస్, టీడీపీకి దడ!
అనంతపురం :
హైకోర్టు ఉత్తర్వుల మేరకు సార్వత్రిక ఎన్నికలకు ముందే రాష్ట్ర ఎన్నికల సంఘం నగర, పురపాలక సంఘాల ఎన్నికలు నిర్వహించడానికి సన్నద్ధమవుతోండటం రాజకీయ పార్టీల వెన్నులో వణుకు పుట్టిస్తోంది.
సార్వత్రిక ఎన్నికలకు ముందు నగర, పురపాలక ఎన్నికలను ప్రీఫైనల్స్‌గా రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. పురపాలక ఎన్నికల ఫలితాలు సార్వత్రిక ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపనుండటంతో రాజకీయ పార్టీలు తీవ్రంగా ఆందోళన చెందుతున్నాయి. సహకార, పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయభేరి మోగించడంతో నగర, పురపాలక ఎన్నికల్లోనూ ఆ పార్టీ హవా సాగడం ఖాయమని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఇది టీడీపీ, కాంగ్రెస్ నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. వివరాల్లోకి వెళితే.. జిల్లాలో అనంతపురం నగరపాలక సంస్థతోపాటూ రాయదుర్గం, తాడిపత్రి, గుంతకల్లు, కదిరి, ధర్మవరం పురపాలక పాలకవర్గాల పదవీకాలం 2010 సెప్టెంబరు 29 నాటికి పూర్తయింది. హిందూపురం పురపాలక పాలకవర్గం పదవీకాలం 2012 ఫిబ్రవరి 19తో పూర్తయింది. ఏడాది క్రితం జిల్లాలో కళ్యాణదుర్గం, పుట్టపర్తి, మడకశిర, పామిడి, గుత్తి నగర పంచాయతీలుగా ఏర్పాటుచేసింది. నగర, పురపాలక సంఘాలకు సకాలంలో ఎన్నికలు నిర్వహించాల్సిన ప్రభుత్వం దాటవేత వైఖరిని అందుకుంది.
లకవర్గాల స్థానంలో ప్రత్యేకాధికారుల పాలన విధించి.. నగర, పురపాలక సంఘాలను నిర్వీర్యం చేస్తోంది. గత మూడున్నరేళ్లుగా ఇదే పరిస్థితి. ఇప్పటికి ఆరు సార్లు ప్రత్యేకాధికారుల పాలనను పొడిగించిన ప్రభుత్వం.. ఏడో సారి కూడా పొడిగించేందుకు సన్నాహాలు చేస్తోంది. నగర, పురపాలక ఎన్నికలు నిర్వహిస్తే వైఎస్సార్‌సీపీ విజయభేరి మోగిస్తుందనే భావనతోనే కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కై వాయిదా మంత్రాన్ని పఠించాయి.
రాజకీయ పార్టీల రహితంగా నిర్వహించే సహకార ఎన్నికలను ఏడాది క్రితం ప్రభుత్వం చేపట్టింది. సహకార ఎన్నికల్లో జిల్లాలో మెజార్టీ ప్రాథమిక సహకార పరపతి సంఘాలు(పీఏసీఎస్)ను వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు చేజిక్కించుకున్నారు. జిల్లా సహకార కేంద్ర బ్యాంకు(డీసీసీబీ), జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ(డీసీఎంఎస్) అధ్యక్ష పదవులను వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు చేజిక్కించుకోవడం ఖాయమనే భావనతో ఏడాది కాలంగా ఎన్నికలను వాయిదా వేస్తూ వస్తోంది. రాజకీయ పార్టీల ప్రమేయం లేకుండా నిర్వహించే పంచాయతీ ఎన్నికలను కూడా ఆర్నెల్ల క్రితం ప్రభుత్వం చేపట్టింది. పంచాయతీ ఎన్నికల్లోనూ వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు విజయభేరి మోగించారు. నగర, పురపాలక, మండల ప్రాదేశిక సభ్యులు(ఎంపీటీసీ), జిల్లా ప్రాదేశిక సభ్యుల(జెడ్పీటీసీ) ఎన్నికలను రాజకీయ పార్టీల గుర్తులతో నిర్వహించాల్సి ఉంటుంది.
గుర్తులతో ఎన్నికలు నిర్వహిస్తే వైఎస్సార్‌సీపీ ఘన విజయం సాధించడం ఖాయమనే భావనతోనే ఇన్నాళ్లూ ప్రభుత్వం ఆ ఎన్నికలను వాయిదా వేస్తూ వస్తోంది. ఈలోగా సార్వత్రిక ఎన్నికలు ముంచుకురానే వచ్చాయి.
సార్వత్రిక ఎన్నికల షెడ్యూలు మరో నాలుగైదు రోజుల్లో వెలువడనుండగా.. హైకోర్టు ఉత్తర్వుల మేరకు నగర, పురపాలక సంఘాల ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఆ క్రమంలోనే శనివారం నగర, పురపాలక సంఘాల మేయర్‌లు, ఛైర్‌పర్సన్‌లు, డివిజన్‌లు, వార్డుల రిజర్వేషన్లను ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు సంబంధించిన ఓటర్ల జాబితాను కూడా ఆదివారం ఆయా నగర, పురపాలక, నగర పంచాయతీల్లో ప్రదర్శించడంలో అధికారులు తలమునకలయ్యారు. నగర, పురపాలక సంఘాల ఎన్నికల నిర్వహణపై సోమవారం హైకోర్టుకు నివేదించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.
ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు సిద్ధమని హైకోర్టుకు నివేదిస్తే.. సోమవారమే రాష్ట్ర ఎన్నికల సంఘం నగర, పురపాలక సంఘాలకు నోటిఫికేషన్ కూడా జారీ చేసే అవకాశం ఉంటుంది. ఇది రాజకీయ పార్టీల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. జిల్లాలోని అనంతపురం నగరపాలక సంస్థతోపాటూ 11 మున్సిపాల్టీలు, నగర పంచాయతీల్లో సింహభాగాన్ని వైఎస్సార్‌సీపీ చేజిక్కించుకోవడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు స్పష్టీకరిస్తున్నారు. నగర, పురపాలక సంఘాల ఫలితాలు వెలువడిన నెల రోజుల్లోగానే శాసనసభ, లోక్‌సభ ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నారు.
ఈ నేపథ్యంలో నగర, పురపాలక సంఘాల ఎన్నికల ఫలితాలు.. శాసనసభ, లోక్‌సభ ఎన్నికలను ప్రభావితం చేస్తాయి. ఇది కాంగ్రెస్, టీడీపీ నేతల కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. నగర, పురపాలక సంఘాల నోటిఫికేషన్ వెలువడకపోతే అదే పది వేలని టీడీపీ, కాంగ్రెస్ నేతలు వాపోతున్నారు.