
సీమాంధ్రులను ఇబ్బంది పెట్టే ఉద్దేశం లేదు: డీఎస్
న్యూఢిల్లీ : సీమాంధ్ర ప్రాంత ప్రజలను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం కాంగ్రెస్ అధిష్టానానికి లేదని పీసీసీ మాజీ అధ్యక్షుడు, పార్టీ సీనియర్ నేత డీ.శ్రీనివాస్ అన్నారు. ఆయన శుక్రవారం పార్టీ అధినేత్రితో సుమారు 45 నిమిషాలు పాటు సమావేశం అయ్యారు. భేటీ అనంతరం డీఎస్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో ఏ ప్రాంతానికి అన్యాయం జరగకుండా విభజన ప్రక్రియ పూర్తిచేస్తారన్న నమ్మకం వుందన్నారు సీమాంధ్రలోని ప్రజల అపోహలను కాంగ్రెస్ తొలగిస్తుందన్నారు.
ఏ ప్రాంతానికి అన్యాయం జరగకుండా పార్టీ ముందుకు వెళుతుందని డీఎస్ తెలిపారు. రాష్ట్ర విభజనతో ఏ ప్రాంతానికి అన్యాయం జరగదని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందనే పూర్తి విశ్వాసముందని డీఎస్ తెలిపారు. రాష్ట్రానికి సంబంధించిన పూర్తి సమాచారం అధిష్టానం వద్ద ఉందని ఆయన చెప్పారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడంపై హైకమాండ్, కేంద్రం నిర్ణయిస్తాయని డీఎస్ తెలిపారు.