- రఘువీరాను కలిసిన మండలి బుద్దప్రసాద్
- నందిగామ బరిలో కాంగ్రెస్
విజయవాడ : కాంగ్రెస్ పార్టీ లేని ఉనికిని చాటుకునేందుకు తహతహలాడుతోంది. ఇందుకోసం ఆ పార్టీ శ్రేణులు తమ వ్యూహాన్ని రూపొందిం చారు. ఏపీ పీసీసీ ఒక రోడ్ మ్యాప్‌ను రూపొందించి అమలు చేయడానికి ఇప్పటికే సమాయత్తమైంది. నందిగా మ ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకరరావు ఆకస్మికంగా మృతి చెందారు. ఆ స్థానంలో టీడీపీ తమ పార్టీ అభ్యర్థినిగా తంగిరాల కుమార్తె సౌమ్యను రంగంలోకి దించింది. ఈ నేపథ్యంలో నందిగామ ఉప ఎన్నికల్లో పోటీచేసి ప్రజల్లోకి వెళ్లి టీడీపీ, బీజేపీ ప్రభుత్వాల పాలనను ఎండగట్టాలని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు.
ఈ ఎన్నికల్లో అత్యధిక ఓట్లు సాధించడం ద్వారా తన బలం పెరిగిందని చాటి చెప్పేందుకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అక్కడ అభ్యర్థిని బరిలోకి దింపారు. దీంతో పాటు టీడీపీ, బీజేపీపై ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని చాటిచెప్పే వ్యూహంతో కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతోంది. బుధవారం హైదరాబాద్‌లో ఉపసభాపతి, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, ఏపీ పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డిని ఇంటికి వెళ్లి కలిశారు. నందిగామ ఉప ఎన్నికలో పోటీ చేయవద్దని అభ్యర్థించారు. రఘువీరారెడ్డి సున్నితంగా తిరస్కరించారు. తమ పార్టీ ఒక నిర్ణయం తీసుకున్నాక వెనకడగు వేయదని రఘువీరా స్పష్టం చేసినట్లు సమాచారం.
దీంతో ఆయన వెనుదిరిగారు. మండలి, రఘువీరాను కలవడం వెనుక మాజీ ఎంపీ లగడపాటి వర్గీయులు మధ్యవర్తిత్వం వహించినట్లు సమాచారం. ఈ క్రమంలో కాంగ్రెస్ నాయకులు నందిగామ తరలివెళ్లి బోడపాటి బాబూరావుతో నామినేషన్ దాఖలు చేయించారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్‌లో ఒక్క సీటు దక్కలేదు. గత ఎన్నికల్లో నందిగామ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి కేవలం ఒక శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. అయినప్పటికీ ఆ పార్టీ అభ్యర్థిని పోటీలో పెట్టటం
చర్చనీయాంశమైంది.
టీడీపీ వైఫల్యాలపై ప్రచారం ...
కాగా ఉప ఎన్నికలో పోటీచేసి బీజేపీ, టీ డీపీ వైఫల్యాలను ఎండగట్టాలనేది కాంగ్రెప్ పార్టీ రోడ్ మ్యాప్ వ్యూహంగా చెపుతున్నారు. ప్రధానంగా టీడీపీ రుణమాఫీ హామీ, ఫీజు రీయింబర్స్‌మెంటు, సంక్షేమ పథకాల అమలు తదితర అంశాలను ఈ ఎన్నికల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ నాయకులు ప్రణాళిక సిద్ధం చేశారు. వంద రోజుల్లో టీడీపీ పాలనలో ప్రజలకు చేసింది శూన్యమని పెద్దఎత్తున ప్రచారం చేయనున్నారు.
ఈ ఉప ఎన్నికల్లో ప్రచారం చేయడానికి రాష్ట్ర నాయకులు రానున్నారు. జిల్లా కాంగ్రెస్ నాయకులు అక్కడికి వెళ్లి ప్రచారం చేయనున్నట్లు డీసీసీ అధ్యక్షుడు నరహరశెట్టి నరసింహారావు తెలిపారు. ప్రధానంగా ప్రజా సమస్యలను ఎలుగెత్తి చాటేందుకు ఉప ఎన్నికలను వేదికగా ఉపయోగించుకోవాలని కాంగ్రెస్ పోటీకి సమాయత్తమైనట్లు తెలిసింది.
చంద్రబాబు మోసం చేశారు....
కాగా చంద్రబాబు ప్రజలను మోసం చేశారని ఏపీ పీసీసీ నాయకుడు కొలనుకొండ శివాజీ అన్నారు. రుణమాఫీ అంటూ ప్రజలకు నమ్మబలికిన చంద్రబాబు ఆచరణలో విఫలమయ్యారని ఆయన పేర్కొన్నారు. అదే విధంగా దేశవ్యాప్తంగా ఎన్‌డీఏ, ప్రభుత్వానికి ఎదురుగాలి మొదలైందన్నారు. దేశంలో పలు రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారని గుర్తుచేశారు.