తెలంగాణకు అన్యాయం జరిగిందని తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా ప్రగాఢంగా నమ్మారన్ని అందువల్ల తెలంగాణ సాధ్యమైందన్ని పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ వెల్లడించారు. బుధవారం ఆయన న్యూఢిల్లీలో మాట్లాడుతూ... 14 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తుందని, ఆ ప్రయత్నం ఇప్పటికి సాకారం అయిందన్నారు. రెండు ప్రాంతాలుగా విడిపోయినా మానసికంగా తమ మధ్య ఉన్న సమైక్యతను ఎవరూ విడగొట్టలేరని అన్నారు. అటు సీమాంధ్ర ఇటు తెలంగాణ రాష్ట్రాలు పరస్పర సహకారంతో ముందుకు వెళ్లాల్సిన అవశ్యకతను ఆయన ఈ సందర్బంగా విశదీకరించారు.
తెలంగాణ, సీమాంధ్రలు దేశంలో అగ్రగామి రాష్ట్రాలుగా అభివృద్ధి చెందుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కొందరు మాత్రం ఇరు ప్రాంతాలలో రాగద్వేషాలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ దయతో అనామకులు కూడా మంత్రులయ్యారన్న విషయాన్ని ఈ సందర్భంగా డీఎస్ గుర్తు చేశారు. పార్టీ వల్ల ప్రతినిధులుంటారు, కానీ ప్రతినిధులు వల్ల పార్టీ ఉండదని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికలలో గెలవలేని వారే కాంగ్రెస్ పార్టీని విడిచి వెళ్లిపోతారన్నారని డీఎస్ అభిప్రాయపడ్డారు. సీఎం కిరణ్ తన పదవికి రాజీనామా చేయనున్నారని విలేకర్లు అడిగిన ఓ ప్రశ్నకు డీఎస్ పై విధంగా సమాధానంగా చెప్పారు.