- వచ్చే ఏడాది నుంచి టెన్త్‌లో సీసీఈ విధానం
- టీచర్లకు బయోమెట్రిక్
- జూన్‌కి 10,300 మంది టీచర్లకు నియామక ఉత్తర్వులు
- మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు
విశాఖపట్నం : వచ్చే ఏడాది నుంచి ఒకటో తరగతి నుంచి పోస్టు గ్రాడ్యుయేషన్ వరకు అన్ని పరీక్షలూ ఆన్‌లైన్‌లోనే నిర్వహించనున్నట్టు రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. వీటితోపాటు ప్రభుత్వం నిర్వహించే అన్ని ‘సెట్లు’ కూడా ఆన్‌లైన్‌లోనే జరుపుతామన్నారు. ఇందుకోసం ఒక కమిటీని కూడా నియమించామని చెప్పారు. మంగళవారం పదో తరగతి ఫలితాలు విడుదల అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ విద్యా సంవత్సరం నుంచి నిరంతర సమగ్ర మూల్యాంకన (సీసీఈ) విధానాన్ని ప్రవేశపెడతామన్నారు. ఈ విధానంలో సీబీఎస్‌ఈ తరహాలో నాణ్యమైన విద్యాబోధన ఉంటుందన్నారు.
డీఎస్సీలో ఎంపికైన 10,300 మంది స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీలకు జూన్ ఒకటికల్లా నియామక ఉత్తర్వులు అందజేస్తామని మంత్రి తెలిపారు. వీరితో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిజ్ఞ (ప్లెడ్జ్) చేయిస్తారన్నారు. వీరికి పది రోజుల పాటు శిక్షణ కూడా ఇస్తామన్నారు. విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే రేషనలైజేషన్ పూర్తి చేస్తామన్నారు. ఉపాధ్యాయులు పనిచేసే చోటనే నివాసం ఉండాలన్న నిబంధన అమలు చేయనున్నామని, దీనిపై ఉపాధ్యాయ సంఘాల నాయకులతో కూడా చర్చించామని చెప్పారు. వచ్చే నెల నుంచి టీచర్లకు బయోమెట్రిక్ విధానం అమలు చేస్తామని తెలిపారు. దీంతో టీచర్లు ఆలస్యంగా పాఠశాలలకు రావడం, ముందుగానే వెళ్లిపోవడం వంటివి నిరోధించడానికి వీలవుతుందన్నారు.
ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ స్కూళ్లలో విద్యా ప్రమాణాలు మెరుగు పరచాలని ప్రభుత్వం యోచిస్తోందన్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు రూ.10 వేల కోట్ల అంచనా వ్యయాన్ని ప్రతిపాదించామన్నారు. తొలిదశలో రూ.5 వేల కోట్లు ఖర్చు చేయనుందని తెలిపారు. పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి ఆర్.పి.సిసోడియా మాట్లాడుతూ ఇంగ్లీష్ మీడియం స్కూళ్లలో ఆంగ్లం బోధించే టీచర్లకు ప్రత్యేక శిక్షణ ఇప్పించనున్నట్టు చెప్పారు. వీరికి ఏప్రిల్ 3న అసెస్మెంట్ టెస్ట్ కూడా నిర్వహించామని తెలిపారు.
ఇక అన్ని పరీక్షలూ ఆన్‌లైన్‌లోనే..
Published Tue, May 10 2016 7:13 PM | Last Updated on Tue, Mar 19 2019 9:23 PM
Advertisement
Advertisement