సాక్షి, హైదరాబాద్: తెలంగాణపై నిర్ణయం తీసుకున్న ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీని అభినందించడానికి వరంగల్‌లో జరుప తలపెట్టిన కృతజ్ఞతా సభ ఏర్పాట్లపై మంత్రి పొన్నాల నివాసంలో మంగ ళవారం నిర్వహించిన వరంగల్ కాంగ్రెస్ నేతల సమావేశం రసాభాసగా మారింది. సమావేశంలో కేంద్ర మంత్రి బలరాంనాయక్, వరంగల్ డీసీసీబీ అధ్యక్షుడు రాఘవరెడ్డి మధ్య దూషణలకు దారితీయడంతో చర్చ పూర్తి కాకుండానే సమావేశం అర్ధంతరంగా ముగిసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. వచ్చేనెల 6న సభ నిర్వహించాలని ముందు భావించినా దానిని 9న జరపాలని నిర్ణయించారు. సభ ఏర్పాట్లపై వరంగల్‌లో వచ్చే నెల 2న మరోసారి సమీక్షించుకోవాలని భావించారు.
ఈ లోగా బలరాం నాయక్, రాఘవరెడ్డిల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తమకు వ్యతిరేకంగా కేంద్ర మంత్రి వ్యవహరిస్తున్నారని రాఘవరెడ్డి అన్నారు. దీంతో.. ‘నువ్వే జిల్లాను ముంచుతున్నావం’టూ మంత్రి మండిపడ్డారు. ‘డీసీసీబీ పదవిని డబ్బులిచ్చి దక్కించుకున్నందున నీ ఇష్టం వచ్చినట్లు చేస్తామంటే కుదరదు’ అని మంత్రి అనడంతో రాఘవరెడ్డి కూడా గట్టిగానే స్పందించారు. ‘ నువ్వు కూడా ఆ టికెట్‌ను డబ్బులిచ్చే తెచ్చుకున్నావు కదా’అన్నారు. చివరకు ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రి బస్వరాజు సారయ్య, చీఫ్‌విప్ గండ్ర, ఎమ్మెల్యేలు శ్రీధర్, కవిత, మాజీ ఎమ్మెల్యే పొడెం వీరయ్యలతో పాటు జిల్లా కాంగ్రెస్ నేతలంతా ఈ సమావేశానికి హాజరయ్యారు.
‘కృతజ్ఞతా సభ’పై భేటీ రసాభాస!
Published Wed, Oct 30 2013 2:57 AM | Last Updated on Mon, Oct 22 2018 9:16 PM
Advertisement
Advertisement