పరిశ్రమలు రీస్టార్ట్‌ | Coronavirus: AP industries department has issued an order relaxing the lockdown restrictions | Sakshi
Sakshi News home page

పరిశ్రమలు రీస్టార్ట్‌

Published Mon, Apr 20 2020 3:37 AM | Last Updated on Mon, Apr 20 2020 4:37 AM

Coronavirus: AP industries department has issued an order relaxing the lockdown restrictions - Sakshi

రెడ్‌ జోన్లలో ఎలాంటి మినహాయింపులు లేకుండా మే 3 వరకు యథావిధిగా లాక్‌ డౌన్‌ నిబంధనలు అమలవుతాయి. ఏయే మండలాల్లో ఏ పరిశ్రమలను తెరవచ్చో జిల్లా స్థాయి కమిటీ నిర్ణయిస్తుంది. పరిశ్రమల్లో భౌతిక దూరం పాటించేలా పర్యవేక్షించే బాధ్యతను తహసీల్దార్, ఎంపీడీవో, వ్యవసాయ అధికారి, ఎస్‌ఐ, పరిశ్రమలు, కార్మిక శాఖల అధికారులకు అప్పగించారు. 

సాక్షి, అమరావతి: లాక్‌డౌన్‌తో దాదాపు నెల రోజులుగా మూతపడ్డ పారిశ్రామిక రంగాన్ని దశలవారీగా పునరుద్ధరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. కరోనా వైరస్‌ విస్తరించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటూనే వలస కార్మికులు, నిర్మాణ రంగ కూలీలకు చేయూతనిచ్చేలా సోమవారం నుంచి లాక్‌డౌన్‌ ఆంక్షలను సడలిస్తూ రాష్ట్ర పరిశ్రమల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆగిపోయిన ఆర్థిక వ్యవస్థను నెమ్మదిగా గాడిలో పెడుతూ ప్రజల చేతుల్లోకి నగదు వచ్చే విధంగా ‘రీ స్టార్ట్‌’ పేరుతో నిబంధనలను రూపొందించింది.

కేంద్ర హోం శాఖ మార్గదర్శకాలను అనుసరిస్తూ రాష్ట్రంలోని మండలాలను రెడ్, ఆరెంజ్, గ్రీన్‌ జోన్లుగా విభజించింది. రెడ్‌ జోన్‌ మండలాలు, మున్సిపాల్టీలు, మున్సిపల్‌ కార్పొరేషన్లలో ఎలాంటి పారిశ్రామిక కార్యక్రమాలను అనుమతించరు.గ్రీన్‌ జోన్‌లో కార్యకలాపాలు ప్రారంభించే సంస్థలు కూడా కఠినమైన నిబంధనలు పాటించాలి. పరిశ్రమలు, యూనిట్లలో వైరస్‌ వ్యాప్తి చెందకుండా తీసుకుంటున్న చర్యలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తారు. ఎక్కడైనా వైరస్‌ విస్తరించి రెడ్‌జోన్‌గా మారితే అప్పటివరకు ఇచ్చిన అనుమతులు రద్దవుతాయి. 

మార్గదర్శకాలు ఇవీ..
► ప్రజా రవాణా వ్యవస్థపై ఆధారపడకుండా పరిశ్రమలు, కార్యాలయాల్లో పనిచేసే సిబ్బందికి ప్రత్యేక రవాణా సౌకర్యాన్ని కల్పించాలి. ఒక వాహనంలో ప్యాసింజర్‌ కెపాసిటీలో 30 నుంచి 40 శాతం మందిని మాత్రమే అనుమతించాలి. 
► అన్ని వాహనాలను ప్రవేశ ద్వారం వద్దే రసాయనాలు చల్లి శుభ్రం చేయాలి. ప్రతి ఒక్కరికీ థర్మల్‌ స్క్రీనింగ్‌ నిర్వహించాలి. 
► సిబ్బంది అందరికీ వైద్య బీమా ఉండాలి. 
► హ్యాండ్‌ వాష్, శానిటైజర్‌లను అందుబాటులో ఉంచాలి.  
► ఒక్కో షిఫ్ట్‌కు మధ్య గంట విరామం ఉండాలి. భోజన విరామంలో కార్మికులు భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలి. 
► పది మంది కంటే ఎక్కువగా సమావేశాలను నిర్వహించకూడదు. పనిచేసే ప్రాంతంలో సీట్ల మధ్య దూరం కనీసం ఆరు అడుగులు ఉండాలి. 
► లిఫ్ట్‌ల సామర్థ్యంలో సగం మందిని మాత్రమే అనుమతించాలి. మెట్ల వాడకాన్ని ప్రోత్సహించాలి. 
► గుట్కా, పొగాకు వినియోగాన్ని నిషేధించాలి. ఉమ్మి వేయడాన్ని కఠినంగా నిషేధించాలి. 
► సందర్శకులను అనవసరంగా అనుమతించరాదు. 
► కరోనా చికిత్స ఆసుపత్రులు వివరాలను కార్మికులు, సిబ్బందికి అందుబాటులో ఉంచాలి. 
► పరిశ్రమల ప్రాథమిక సమాచారం, కార్మికుల వివరాలను జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్‌ మేనేజర్‌కు అందజేసి పునఃప్రారంభించడానికి అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాలి. తనిఖీ నివేదికల ఆధారంగా కలెక్టర్‌ అనుమతి మంజూరు చేస్తారు. 
► ప్రతి పరిశ్రమ రెడ్‌ జోన్, ఆరంజ్‌ జోన్, గ్రీన్‌ జోన్‌ పరిసర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న కార్మికులను గుర్తించాలి. తమ కుటుంబంలో ఎవరికీ కరోనా లక్షణాలు లేవని  ప్రతి కార్మికుడితో హామీపత్రం తీసుకోవాలి.  

పర్యవేక్షణ అధికారులు వీరే... 

తెరుచుకునే పరిశ్రమలు ఇవే... 
► నిత్యావసర, అత్యవసర పరిధిలోకి వచ్చే పరిశ్రమలు బియ్యం, ఆయిల్, పప్పు మిల్లులు, పిండి మరలు 
► పాడి పరిశ్రమలు, ఆర్వో ప్లాంట్లు, డిస్టిల్డ్‌ వాటర్, ప్యాకేజ్‌ వాటర్, బిస్కెట్లు, పండ్ల రసాలు, వెర్మిసెల్లీ, చక్కెర లాంటి అన్ని రకాల ఆహార పరిశ్రమలు 
► బల్క్‌ డ్రగ్స్, ఫార్మాస్యూటికల్స్, ఫార్ములేషన్స్, ఆర్‌ అండ్‌ డీ, ఐబీ సెట్స్, ఆక్సిజన్‌ సరఫరా, పీపీ గేర్, శస్త్రచికిత్సలకు అవసరమయ్యే పరికరాలు, గ్లౌజులు, బ్యాండేజ్‌ల తయారీ సంస్థలు 
► లిక్విడ్‌ సబ్బులు, డిటర్జెంట్లు, ఫినాయిల్,  బ్లీచింగ్‌ ఫౌడర్, ఫ్లోర్‌ క్లీనర్స్, శానిటరీ నాప్కిన్స్, డైపర్స్, పేపర్‌ నాప్కిన్స్,  ఆక్సిజన్‌ సిలెండర్లు, మాస్కులు, బాడీ సూట్లు తయారీ సంస్థలు 
► శీతల గిడ్డంగులు, వేర్‌ హౌసింగ్, లాజిస్టిక్‌ 
► మిరప, పసుపు, ఉప్పు, సుగంధ ద్రవ్యాలు వంటి వ్యవసాయ సంబంధిత ఉత్పత్తులు, 
► బేకరీ, చాక్లెట్ల తయారీ సంస్థలు, ఐస్‌ప్లాంట్లు, సీడ్‌ ప్రాసెసింగ్‌ కంపెనీలు. చేపలు, కోళ్లు, ఇతర జంతువుల దాణా తయారీ సంస్థలు. 
► సౌర విద్యుత్‌తో పాటు అన్ని రకాల విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలు 
► ఆయుర్వేదం, హోమియోపతి మందుల తయారీ 
► ప్యాకేజింగ్‌ ఇండస్ట్రీ, అమెజాన్, వాల్‌మార్ట్, ఫ్లిప్‌కార్ట్‌ లాంటి ఈ కామర్స్‌  సంస్థలు  
► పోర్టులు, ఎయిర్‌పోర్టులు, రైల్వే స్టేషన్లు, కంటైనర్‌ డిపోల వద్ద ఉన్న శీతల గిడ్డంగులు, వేర్‌ హౌసింగ్‌ కార్యకలాపాలు 
► నిత్యావసర సరుకుల పంపిణీకి సంబంధించిన అన్ని రకాల రవాణా సర్వీసులు  

నిర్మాణ రంగంలో వీటికి అనుమతి 
రహదారులు, నీటిపారుదల ప్రాజెక్టులు, బిల్డింగులు, అన్ని రకాల పారిశ్రామిక ప్రాజెక్టులు, మున్సిపాల్టీ పరిధిలో లేకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న అన్ని ఎంఎస్‌ఎంఈ ప్రాజెక్టులు,  అన్ని రకాల పారిశ్రామిక వాడల నిర్మాణం, పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు 

వీటికి కూడా అనుమతి
► మున్సిపాల్టీ పరిధిలో లేని, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న అన్ని పరిశ్రమలు కార్యకలాపాలు కొనసాగించవచ్చు 
► ప్రత్యేక ఆర్థిక మండళ్లు, ఎగుమతి ఆధారిత యూనిట్లు, పారిశ్రామిక వాడలు, పారిశ్రామిక నగరాలు 
► నిరంతరాయంగా పనిచేయాల్సిన యూనిట్లు 
► హార్డ్‌వేర్‌ తయారీ సంస్థలు 
► బొగ్గు ఉత్పత్తి,  గనులు, ఖనిజాలు వీటికి సంబంధించిన పేలుడు పదార్థాల తయారీ సంస్థలు 
► చమురు, గ్యాస్‌ అన్వేషణ, శుద్ధి కర్మాగారాలు జనపనార పరిశ్రమ, గ్రామీణ ప్రాంతాల్లో ఇటుక బట్టీలు 
► ఎరువులు, రసాయనాలు తయారీ, డిస్ట్రిబ్యూషన్, రిటైల్‌ సంస్థలు 
► వ్యవసాయ సంబంధిత అన్ని రకాల పనిముట్లు, యంత్రాలు, హేచరీస్, వాణిజ్య ఆక్వా సాగు, దాణా తయారీ సంస్థలు 
► తేయాకు, కాఫీ, రబ్బరు, జీడిపప్పు ప్రాసెసింగ్, ప్యాకేజింగ్‌ అమ్మకం 50 శాతం సిబ్బందితో అనుమతి 
► 50 శాతం మంది సిబ్బందితో ఐటీ, ఐటీ ఆధారిత పరిశ్రమలు 
► ప్రభుత్వానికి సంబంధించిన అన్ని రకాల డేటా, కాల్‌ సెంటర్లు, కొరియర్స్‌ సర్వీసులు 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement