కూపన్లు సరే.. రేషన్ ఏదీ?
Published Mon, Dec 9 2013 2:25 AM | Last Updated on Wed, Jul 10 2019 8:02 PM
తెనాలి అర్బన్, న్యూస్‌లైన్ :అర్హులందరికీ సంక్షేమ పథకాలు..రేషన్ కార్డులు, పింఛన్లు ఇలా ఒకటేమిటీ అన్నీ ఇచ్చేస్తామంటూ రచ్చబండలో అధికారులు, ప్రజాప్రతినిధులు ఊదరగొట్టారు. ఆచరణలో కార్యరూపం దాల్చకపోవడంతో లబ్ధిదారులు లబోదిబో మంటున్నారు. పేదలకు సంక్షేమ పథకాలంటూ ఇప్పటికి మూడువిడతలుగా ప్రభుత్వం రచ్చబండ కార్యక్రమం నిర్వహించింది. మూడో విడతలో జిల్లా వ్యాప్తంగా 62వేల మందికి రేషన్ కూపన్లు పంపిణీచేశారు. రెండో విడత రచ్చబండలో స్వీకరించిన 77 వేల రేషన్‌కార్డుల దరఖాస్తులకుగాను ఈ మొత్తాన్ని పంపిణీ చేయగా, మరో 15 వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. డిసెంబర్ నుంచి వచ్చే జూన్ వరకు ఈ కూపన్లను లబ్ధిదారులకు అందించారు. ఈ కూపన్లు పట్టుకుని లబ్ధిదారులు డీలర్ల చు ట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. డిసెంబర్ నెలకు సంబంధించి వీరికి ఇప్పటివరకు రేషన్‌రాలేదు. ఎప్పుడు వస్తుందన్నదీ డీలర్లు కూడా చెప్పలేకపోతున్నారు.
అడ్రస్ ఒక ఊరిలో.. రేషన్ షాపు మరో ఊరిలో..
తొలివిడత రచ్చబండలో స్వీకరించిన రేషన్‌కార్డుల దరఖాస్తులకు రెండోవిడత రచ్చబండలో కూపన్లు పంపణీచేశారు. వీటిలో అన్నీ తప్పుల తడకలే. లబ్ధిదారు అడ్రస్ ఒక గ్రామంలో ఉంటే, వారికి కేటాయించిన రేషన్ షాపు మరో గ్రామంలో ఉంది. తెనాలి మండల పరిధిలోని హాఫ్‌పేట, కొలకలూరు గ్రామాల్లో జరిగిన గందరగోళం నిదర్శనంగా చెప్పవచ్చు. రెండో విడత రచ్చబండలో పంపిణీ చేసిన కార్డుల్లో హాఫ్‌పేటకు చెందిన 40 మంది కార్డులకు కొలకలూరు షాపు నంబరు, మూడో విడతలో 37 కార్డులకు ఖాజీపేట షాపును కేటాయించారు. రెండో విడతలో పంపిణీచేసిన వాటిలో కొలకలూరుకు చెందిన 15, మూడోవిడతలో పంపిణీ చేసినవాటిలో 20 కార్డులకు హాఫ్‌పేట షాపును కేటాయించారు. వీటిని యథాస్థానాలకు మార్చాలని తహశీల్దార్‌ను కోరారు. ప్రజావాణిలో అర్జీలు పెట్టుకున్నా ఫలితం లేదు.
రేషన్ పంపిణీలో జాప్యం వాస్తవమే
రేషన్ కేటాయింపుల్లో జాప్యం జరగుతున్న మాట వాస్తవమే. పాతకార్డుల లబ్ధిదారులకు మరో నాలుగురోజుల్లో రేషన్ అందే అవకాశం ఉంది. కొత్త కూపన్లకు సంబంధించి కేటాయింపుల అంచనాలు డీఎస్‌వోకు పంపాం. అవి కమిషనర్ ఆమోదం పొందిన తదుపరి రేషన్ కేటాయింపులు జరుగుతాయి. కొంచెం సమయం పడుతుంది.
-మల్లన్న,
తెనాలి డివిజన్ ఏఎస్‌వో
Advertisement