భారత కమ్యునిస్ట్ పార్టీ (మార్క్సిస్టు) ఏర్పడి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ నెల 27న భీమవరంలో నిర్వహించే
భీమవరం టౌన్ : భారత కమ్యునిస్ట్ పార్టీ (మార్క్సిస్టు) ఏర్పడి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ నెల 27న భీమవరంలో నిర్వహించే వార్షికోత్సవ సభకు పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు హాజరవుతారని జిల్లా కార్యదర్శి మంతెన సీతారామ్ చెప్పారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 1964లో కలకత్తాలో జరిగిన మహాసభలో పార్టీ ఆవిర్భవించిందని, అప్పటి నుంచి ప్రజల సమస్యలపై పోరాడుతోందన్నారు. గ్రామ, మండల, పట్టణ మహాసభలను ఇప్పటికే పూర్తి చేసుకున్నామని, డిసెంబర్ 10, 11 తేదీల్లో తణుకులో జిల్లా మహాసభ నిర్వహిస్తామన్నారు. అలాగే వచ్చే ఏడాది ఫిబ్రవరి 14 నుంచి 19 వరకు విశాఖపట్నంలో అఖిల భారత 21వ మహాసభ జరుగుతుందన్నారు.
నూతన కమిటీలను ఏర్పాటుచేసుకుని రానున్న రోజుల్లో పార్టీని బలోపేతం చేస్తామని చెప్పారు. ఎన్నికల సమయంలో ఒక విధానానికి కట్టుబడి పార్టీ పనిచేస్తుందన్నారు. ప్రధానంగా కార్మికులు, కౌలు రైతులు, పేద రైతులు, ఉపాధి హామీ పథకం, దళితుల, గిరిజన సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తోందన్నారు. జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బి.బలరామ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీకి మసిపూసి రైతులను మోసం చేస్తోందన్నారు. బియ్యం లెవీ శాతాన్ని 75 నుంచి 25 శాతానికి కుదించడం రైతులను నష్టాలపాలు చేయడమేనన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజావ్యతిరేక విధానాలను తిప్పికొట్టాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జేఎన్‌వీ గోపాలన్, డివిజన్ కార్యదర్శి బి.సత్యనారాయణ పాల్గొన్నారు.