మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి ఉబలాట పడుతున్న ఆశావహుల ఆనందానికి అవధుల్లేవు.. ఒకవిధంగా వారు ఎగిరి గంతేస్తున్నారు.. అసెంబ్లీ ఎన్నికలకు ముందే మున్సిపల్ ఎన్నికలు జరగనుండడంతో తమ భారమంతా ఇక, ఎమ్మెల్యే పదవులకు పోటీ పడనున్న నేతలే భరిస్తారన్న ధీమాతో ఉన్నారు.
మరోవైపు ఆయా పార్టీలకు చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యేలపై మున్సిపోల్స్ పెద్ద భారాన్నే
మోపనున్నాయి. ఒక వైపు అభ్యర్థుల ఎంపిక.. మరోవైపు వారి ఎన్నికల ఖర్చులు.. ఇంకోవైపు టికెట్ దక్కని వారిని బుజ్జగించడం వెరసి... ఇపుడు వారి పరిస్థితి సంకటంగా మారింది..!!
పాతవి, కొత్తవి కలిపి ఈసారి జిల్లాలో ఐదు మున్సిపాలిటీలు, రెండు నగర పంచాయతీలకు ఎన్నికలకు నగారా మోగింది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ మేరకు ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయడంతో రాజకీయ పార్టీల్లో హడావిడి మొదలైంది. పార్టీ గుర్తుల మీద జరుగుతున్న ఎన్నికలు కావడంతో మున్సిపల్
ఎన్నికల్లో వచ్చే ఫలితాలు ‘పబ్లిక్ పల్స్’ను పట్టిం చనున్నాయి. అదే మాదిరిగా, మున్సిపాలిటీల్లో వచ్చిన ఫలితాలు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపైనా ప్రభావం చూపే అవకాశం ఉంది. దీంతో ఆయా మున్సిపాలిటీల్లో అభ్యర్థుల ఎంపిక కత్తిమీది సాము కానుంది. నల్లగొండ, మిర్యాలగూడ, భువనగిరి, సూర్యాపేట, కోదాడ మున్సిపాలిటీలు, హుజూర్‌నగర్, దేవరకొండ నగర పంచాయతీలు కలిపి మొత్తం ఏడు నియోజకవర్గాల్లో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. సహజంగానే ఈ ఏడు చోట్లా సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ప్రధానపార్టీల నేతలు తమ పార్టీల పక్షాన బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. సార్వత్రిక ఎన్నికలకు కొద్దిరోజుల ముందు వెలువడే మున్సిపల్ ఫలితాలలతో ఆయా పార్టీలపై ప్రజాభిప్రాయం స్పష్టంగానే తెలిసే అవకాశముంది.
దీంతో గెలుపు గుర్రాలను ఎంపిక చేసి బరిలోకి దింపండం, వారి ఎన్నికల ఖర్చులు భరించడం నేతలకు తలకు మించిన భారం కానుంది. ప్రధానంగా నాలుగు చోట్ల జనరల్ మహిళలకు చైర్‌పర్సన్ పీఠాలు రిజర్వు కావడంతో ఆయా మున్సిపాలిటీల్లో తమకంటే తమకు టికెట్ కావాలన్న డిమాండ్ పెద్ద ఎత్తున వ్యక్తం అవుతోంది. ఎమ్మెల్యేలుగా ఉండి, మళ్లీ గెలవాలనుకుంటున్న వారు, ఈసారి ఎలాగైనా అసెంబ్లీలో అడుగు పెట్టాల్సిందేనని భావిస్తున్న నేతల కు మున్సిపల్ అభ్యర్థుల ఎంపిక భారం కానుంది. ఒకరికి టికెట్ ఇచ్చి, మరొకరికి నిరాకరిస్తే అసంతృప్తుల జాబితా పెరిగిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.
దీనివల్ల పార్టీ మార్పిళ్లకూ అవకాశం లేదన్న భయం వీరిని వెంటాడుతోంది. మున్సిపల్ చైర్‌పర్సన్ల ఎన్నిల పరోక్ష పద్ధతిన జరుగుతున్నందున మెజారిటీ వార్డుల్లో కౌన్సిలర్లను గెలిపించుకోవడం, గెలిచిన కౌన్సిలర్లలో అందరినీ ఒప్పించి చైర్‌పర్సన్ అభ్యర్థిని ఎంపిక చేసి గెలిపించడం ఆయా మున్సిపాలిటీల్లో ఎమ్మెల్యేలపై ముం దున్న ప్రధాన కర్తవ్యం. అందరినీ ఏకతాటిపైకి తెచ్చి, గుంపుల గొడవల్లేకుండా చూసుకుంటూ మున్సిపల్ ఎన్నికలను ముగించి, ఆ వెంటనే తన ఎన్నికలకు సిద్ధం కావడం అన్నది వీరి ఆందోళన కలిగిస్తోంది. మాజీ వార్డు కౌన్సిలర్లలో మెజారిటీ తిరిగి టికెట్లు ఆశిస్తున్న వారే. అదే మాదిరిగా, ఇన్నాళ్లూ నమ్ముకుని వెంట తిరిగి పనిచేసినందుకు తమకు అవకాశం ఇవ్వాల్సిందేనని పట్టుబట్టే వారి సంఖ్యా తక్కువేం కాదు.
కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నల్లగొండలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సూర్యాపేటలో ఎమ్మెల్యే దామోదర్‌రెడ్డి, కోదాడ, హుజూర్‌నగర్‌లలో ఎమ్మెల్యే ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలపై భారం పడనుంది. ఇక, మిర్యాలగూడలో మాజీ మంత్రి జానారెడ్డి బాధ్యత తీసుకోనున్నారు. ఇక్కడి ఫలి తాలు, అసంతృప్తులు నేరుగా ఆయన ఎన్నికను ప్రభావితం చేయకున్నా, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిపై ప్రభావం చూపుతాయి. దేవరకొండలో ఎమ్మెల్యే బాలూనాయక్‌పైనా ప్రభావం పడనుంది. ఇక భువనగరిలో అధికార కాంగ్రెస్ నుంచి అభ్యర్థుల ఎంపిక , గెలిపించుకునే బాధ్యత ఎవరు తీసుకుంటారన్న అం శంపై స్పష్టత రావడం లేదు. టీడీపీ ఎమ్మెల్యే ఉమపై దీని ప్రభావం ఉండనుంది.
వైఎస్‌ఆర్ కాంగ్రెస్, టీఆర్‌ఎస్, బీజేపీ, సీపీఐ, సీపీఎం ఇలా.. దాదాపు అన్ని ప్రధాన రాజకీయ పార్టీల నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న వారిపై మున్సిపల్ ఎన్నికల భారం పడడం ఖాయంగా కనిపిస్తోంది.