రాంగ్ పోస్టింగ్ పేరుతో రూ.14.65 లక్షల స్వాహా
రాంగ్ పోస్టింగ్ పేరుతో రూ.14.65 లక్షల స్వాహా
Published Fri, Mar 10 2017 10:22 PM | Last Updated on Tue, Oct 9 2018 5:34 PM
► పిఠాపురం ఐసీఐసీఐ బ్యాంకులో ఘరానా మోసం
► బ్యాంకు మేనేజరు, సిబ్బంది సహకారంతోనే..
► పోలీసులకు ఫిర్యాదు చేసిన వ్యాపారి, వైఎస్సార్ సీపీ నేత పాపారాయుడు
రాజమహేంద్రవరం సిటీ: తన బ్యాంకు ఖాతా నుంచి రూ.14.65 లక్షల్ని వేరే ఖాతాలకు మళ్లించారని తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం ఆర్తమూరుకు చెందిన వ్యాపారి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి కర్రి పాపారాయుడు ఆరోపించారు. ఐసీఐసీఐ బ్యాంకు మేనేజరు, సిబ్బంది సహకారంతో ముగ్గురు వ్యక్తులు ఈ మోసానికి పాల్పడ్డారని చెప్పారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. రాజమహేంద్రవరంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాపారాయుడు ఈ వివరాలు తెలిపారు.
తనకు రామచంద్రపురం ఐసీఐసీఐ బ్యాంకులో ఖాతా ఉందన్నారు. అదే బ్రాంచిలో గోల్డ్‌లోన్ ఏజెంట్‌గా పనిచేస్తున్న గొలుగూరి శ్రీనివాసరెడ్డి.. జిల్లాలోని కొత్తపల్లి మండలానికి చెందిన అబ్బిరెడ్డి నూకారెడ్డి, తమిలిశెట్టి గోపాలరెడ్డిలకు పిఠాపురంలో బంగారంపై తీసుకున్న రుణం తీర్చే నిమిత్తం గత ఏడాది సెప్టెంబర్ 12న తన వద్ద చెరో రూ.7 లక్షల వంతున మొత్తం రూ.14 లక్షలు అప్పుగా ఇప్పించినట్లు చెప్పారు. ఫిబ్రవరి 22న తన బాకీ తీర్చేందుకు పిఠాపురం ఐసీఐసీఐ బ్యాంకులోని అబ్బిరెడ్డి ఖాతా (400801500063) నుంచి రూ.7,45,000, గోపాలరెడ్డి ఖాతా (400801500064) నుంచి రూ.7,20,000 రామచంద్రపురంలోని తన ఖాతాకు ట్రాన్స్‌ఫర్ చేశారని తెలిపారు.
ఆ మరుసటి రోజు ఆర్తమూరు వచ్చి అప్పునకు సంబంధించి మిగిలిన వడ్డీ సొమ్ము చెల్లించి తన వద్ద నుంచి హామీపత్రాలు, ప్రామిసరీ నోట్లు తీసుకెళ్లారన్నారు. నూకారెడ్డి, గోపాలకృష్ణారెడ్డి ఖాతాల నుంచి తనఖాతాలో జమ అయిన రూ.14,65,000 లను రాంగ్ పోస్టింగ్ పేరుతో ఈనెల 4 న పిఠాపురం ఐసీఐసీఐ బ్యాంక్ మేనేజరు, సిబ్బంది తనకు సమాచారం ఇవ్వకుండానే వారి ఖాతాలకు బదలాయించారని చెప్పారు.ఈ విషయమై శ్రీనివాసరెడ్డి, నూకారెడ్డి, గోపాలకృష్ణారెడ్డిలను ఆరా తీయగా ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముందస్తు సమాచారం లేకుండా తన బ్యాంకు ఖాతా నుంచి సొమ్మును కాజేసిన శ్రీనివాసరెడ్డి, నూకారెడ్డి, గోపాలకృష్ణారెడ్డి, పిఠాపురం బ్యాంకు మేనేజరు, సిబ్బందిపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని కోరుతూ రామచంద్రపురం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఈ విషయమై పిఠాపురం ఐసీఐసీఐ బ్యాంకు మేనేజర్ గండేపల్లి అరుణకుమార్‌ను వివరణ కోరగా మాట్లాడేందుకు నిరాకరించారు.
Advertisement
Advertisement