
బాధితులను ఆదుకుంటాం...
భోగాపురం: తుఫాన్ బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భరోసా ఇచ్చారు. బాధితులెవరూ అధైర్య పడొద్దని, శతశాతం న్యాయం చేస్తామని తెలిపారు. మండలంలోని తుఫాన్ ప్రభావిత ప్రాంతాలైన దిబ్బలపాలెం, ముక్కాం గ్రామాల్లో బుధవారం పర్యటించారు. జిల్లాలో చనిపోయిన ఎనిమిది మంది మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.5 లక్షలు, కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియో అందజేస్తామని తెలిపారు. బాధితులకు 25 కిలోల బియ్యం, 5 లీటర్ల కిరోసిన్, కిలో పంచదార, రెండు కిలోల పప్పు దినుసులు, 3 కిలోల బంగాళదుం పలు, రెండు కిలోల ఉల్లిపాయలు, కిలో ఆరుుల్, 500 గ్రాముల చొప్పున కారం, ఉప్పు అందజేస్తామని చెప్పారు.
మత్స్యకారులకు అదనంగా 25 కిలోల బియ్యం అందజేస్తామన్నారు. ఎక్కడి వారికి అక్కడే తుఫాన్‌లను తట్టుకునే విధంగా ఇళ్లు నిర్మిస్తామన్నారు. జూన్, జూలై, ఆగస్టు నెలల్లో మత్స్యకారులు వేటకు వెళ్లని సమయంలో నెలకు రూ. 10 వేల చొప్పున అందజేస్తామని హామీ ఇచ్చారు. భీమునిపట్నం నుంచి శ్రీకాకుళం వరకు రోడ్డు మార్గం నిర్మించడానికి చర్యలు తీసుకుంటున్నామని, తద్వారా ఇండస్ట్రీయల్ కారిడార్ ఏర్పడి పెద్ద ఎత్తున పరిశ్రమలు రావడంతో ఉపాధి లభిస్తుందన్నారు. సీఎం పర్యటనలో కేంద్రమంత్రి అశోక్‌గజపతిరాజు, రాష్ట్ర మంత్రులు చిన రాజప్ప, మృణాళిని, పల్లె రఘునాథరెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్ శోభా స్వాతిరాణి, ఎమ్మెల్యేలు మీసాల గీత, కోళ్ల లలితకుమారి, కేఏ నాయుడు, పతివాడ నారాయణస్వామినాయుడు, బొబ్బిలి చిరంజీవులు, కలెక్టర్ ఎంఎం నాయక్, జేసీ రామారావు, ఎస్పీ నవదీప్ సింగ్ గ్రేవాల్ తదితరులు పాల్గొన్నారు.