కదిరి : ఎన్‌పీ కుంట మండలం ఎగువపల్లిలో రెండు రోజుల క్రితం జరిగిన బాంబు దాడి అంతా నాటకమని పోలీసులు తేల్చేశారు. దీంతో తన ఇంటిపై వైఎస్సార్‌సీపీ నాయకులు బాంబు దాడి చేశారని ఆరోపించిన టీడీపీ నాయకుడు భాస్కర్‌రెడ్డి... ఇప్పుడు పోలీసులకు ఫిర్యా దు చేయడానికి కూడా జంకుతున్నాడు. ‘మా గ్రామానికే చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రంగారెడ్డి, రామసుబ్బారెడ్డి, గంగిరెడ్డి, రామకృష్ణారెడ్డిలు నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నారు. ఉదయం నుంచి నన్ను వెంటాడారు. ఇది తెలిసి నేను బయటకు రాకుండా ఇం ట్లోనే దాక్కున్నాను. ఒరేయ్..నువ్వు బయటకు రాకపోతే నిన్ను ఇంట్లోనే బాంబులు వేసి చంపుతామని బయటనుంచి గట్టిగా అరిచారు.
అర్ధరాత్రి సమయంలో మేమంతా నిద్రపోతుంటే మా ఇంటిపై వారు నలుగురు బాంబులు వేసి నన్ను చంపాలని చూశారు. అదిగో గోడపై బాంబులు పడిన ఆనవాళ్లు’ అంటూ ఈ నెల 2 న పోలీసులకు కట్టుకథ చెప్పిన టీడీపీ నాయకుడు భాస్కర్‌రెడ్డి... ఒక్కసారిగా ఇప్పుడు తోక ముడిచాడు. తాను చేసిందంతా నాటకమని పోలీసులకు తెలిసిపోయిందని గ్ర హించి, తాను ఆరోపణలు చేసిన వారినే ఇప్పుడు ప్రాధేయపడుతున్నాడు. బాంబు దాడిపై కదిరి డీఎస్పీ దేవదానం, రూరల్ సీఐ బాలసుబ్రమణ్యంరెడ్డి, ఎన్‌పీ కుంట ఎస్‌ఐ వెంకటేశ్వర్లు సమగ్ర దర్యాప్తు చేసి అంతా నాటకమని తేల్చారు. జిల్లా ఎస్పీ రాజశేఖర్‌బాబు దీన్ని మరింత సీరియస్‌గా తీసుకుని ఇంటెలిజెన్స్ డీఎస్పీ కోలార్ కృష్ణ నేతృత్వంలో పోలీస్ నిఘా బృందాన్ని పంపి నివేదిక తెప్పించుకున్నారు. రాజకీయంగా తనకు ప్రత్యర్థులుగా ఉన్న వారిపై నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేయించి వారిని జైళ్లో పెట్టించాలనేది ఆయన భావనగా ఆ బృందం తమ నివేదికలో ఎస్పీకి సమర్పించినట్లు విశ్వసనీయ సమాచారం.
ఇంతకుమునుపు కూడా ఆయన వారిపై తప్పుడు కేసు పెట్టి పోలీసులనే మోసగించారని ఆ బృం దం తన నివేదికలో గుర్తు చేసినట్లు తెలిసింది. ఆయన ఇంటి గోడపైన, వసారాలోనూ డిటోనేటర్లు పేలిన గుర్తులను తెలియజేసే ఫొటోలను సైతం ఆ బృందం ఎస్పీకి సమర్పించింది. గతంలో తాను ఇచ్చిన కేసును లోక్‌ఆదాలత్ ద్వారా రాజీ చేసుకుంటానని, ఇప్పుడు బాంబు కేసులో రాజీకి రావాలని ఆ నలుగురి చెంతకు కొందరు టీడీపీ నాయకులను పంపారు. ఇది తెలిసిన పోలీసులు సంఘటనను ఎన్‌పీకుంట పోలీస్ స్టేషన్లో జీడీ(జనరల్ డైరీ)లో నమోదు చేసి అంతటితో ఆగిపోయారు. ఒకవేళ ఆయన ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసుకుని తప్పుడు కేసని దర్యాప్తులో తేలితే అతనిపైనే కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని, భవిష్యత్‌లో కూడా ఆయన చేసే ప్రతి ఫిర్యాదును అనుమానించాల్సి ఉంటుందని పోలీస్ అధికారులు చెబుతున్నారు.
డామిట్.. కథ అడ్డం తిరిగింది
Published Sun, Oct 5 2014 2:49 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM
Advertisement
Advertisement