
సాక్షి, అమరావతి: ఉత్తరాంధ్ర ప్రజలంతా అభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణను స్వాగతిస్తున్నారని డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి అన్నారు. సోమవారం ఉదయం సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు ఈ రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన ప్రాంతాలని.. తరతరాలుగా ఉత్తరాంధ్ర ప్రజలు ఉపాధి కోసం వలసలు వెళ్లే పరిస్థితి ఉందన్నారు. విశాఖకు పరిపాలన రాజధానిగా అన్ని అర్హతలు, సౌకర్యాలున్నాయని పేర్కొన్నారు. వలసల ఉత్తరాంధ్ర.. ఇప్పుడు అభివృద్ధి ఉత్తరాంధ్ర గా మారుతుందన్నారు. శివరామకృష్ణన్ కమిటీ, జిఎన్ రావు కమిటీ, బీసీజీ నివేదికలు అన్ని ఇదే విషయం చెప్పాయన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణను ప్రతిపక్ష నేత చంద్రబాబు వ్యతిరేకించడం దారుణమన్నారు. ఉత్తరాంధ్ర ప్రజలంతా చంద్రబాబు తీరును తీవ్రంగా ఖండిస్తున్నారని తెలిపారు. చంద్రబాబు సామాజికవర్గం కోసమే అభివృద్ధి వికేంద్రీకరణ ను వ్యతిరేకిస్తున్నారని విమర్శించారు. ఇన్‌సైడర్ ట్రేడింగ్ లో కొట్టేసిన భూముల కోసమే ఆయన ఆరాటం అని మండిపడ్డారు.
రాజధానిని తరలించడం లేదు..పెంచుతున్నాం..
రాజధానిని తరలించడం లేదని.. పెంచుతున్నామని పుష్ప శ్రీవాణి తెలిపారు. చంద్రబాబు తమ భూముల కోసమే రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. విశాఖలో ఎగ్జిక్యూటీవ్ క్యాపిటల్ రావడం వల్ల వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ వల్ల రాష్ట్రానికి మేలు జరుగుతుందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment