మండలంలోని పేరుకలపూడి గ్రామంలో సమస్యలు తిష్టవేశాయి. గ్రామంలో సుమారు 3500 మంది జనాభా ఉండగా 2700 మంది ఓటర్లు ఉన్నారు.
డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం
మౌలిక వసతులు లేని లేఅవుట్ కాలనీ
సమస్యలు పరిష్కరించాలని స్థానికుల విజ్ఞప్తి
పేరుకలపూడి (దుగ్గిరాల) : మండలంలోని పేరుకలపూడి గ్రామంలో సమస్యలు తిష్టవేశాయి. గ్రామంలో సుమారు 3500 మంది జనాభా ఉండగా 2700 మంది ఓటర్లు ఉన్నారు. వర్షాకాలం ఆరంభం కావడంతో డ్రైనేజీ సమస్య మరింత జఠిలంగా మారి ఇళ్ల ముందు వర్షపు నీరు చేరి దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. దీంతో రోగాల బారినపడే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతర్గత రోడ్లు అభివృద్ధికి నోచుకోకపోవడంతో చిన్నపాటి వర్షానికే చిత్తడిగా మారుతున్నాయి. గ్రామ శివారులో ప్రభుత్వం 52 మంది పేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేసింది. ఇళ్ల స్థలాలు కేటాయించి నేటికి 15 ఏళ్లు గడుస్తున్నా లే అవుట్ కాలనీ అభివృద్ధికి నోచుకోలేదు.
మెరకతో పాటు మౌలిక సదుపాయాలు కల్పించకపోవడంతో కొత్త కాలనీలో ఎవరూ ఇళ్లు నిర్మించేందుకు ముందుకు రావడంలేదు. క్రమంగా ప్లాట్‌లకు ఏర్పాటుచేసిన సరిహద్దు రాళ్లు సైతం శిథిలమయ్యాయి. దీంతో లబ్ధిదారులకు కేటాయించిన సరిహద్దులు చెరిగిపోయాయి. ఇదిలా ఉండగా కొందరూ గతిలేక ఈ దుర్భర పరిస్థితుల్లోనే గూడు నిర్మించుకుని నివాసం ఉంటున్నారు. కాలనీలో మౌలిక వసతులు లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులకు గురువుతున్నారు. వెంటనే ప్లాట్లకు సరిహద్దులు నిర్మించి కాలనీలో మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
మురుగుతో అవస్థలు
పేరుకలపూడి గ్రామంలో మురుగు సమస్య అధికంగా ఉంది. కొన్ని రోడ్లలో మురుగు కాల్వలు లేక ఇంటి ముంగిట చేరి ఇబ్బందికరంగా మారుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఉన్న మురుగు కాల్వను బాగు చేసే వారు కరువయ్యారని వారు చెబుతున్నారు.
ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు గ్రామంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించే విధంగా కృషిచేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
మురుగు కాల్వలు నిర్మించాలి
గ్రామంలో మురుగు సమస్య అధికంగా ఉంది. కాల్వలు లేకపోవడంతో వర్షను నీరు ఇళ్ల ముందుకు వస్తున్నాయి. నిల్వ ఉన్న నీటిపై దోమలు వ్యాప్తి చెంది రోగాల బారినపడే అవకాశం ఉంది. అధికారులు స్పందించి సమస్యలను పరిష్కరించాలి. -బచ్చల సుమతి, పేరుకలపూడి
మౌలిక వసతులు కల్పించాలి
పేదలకు కేటాయించిన ఇళ్ల స్థలాల్లో మెరక సమస్య ప్రధానంగా ఉంది. ప్రస్తుతం తాము ఉండడానికి స్థలం కొరత ఏర్పడడంతో చేసేదిలేక ఇక్కడే నివాసం ఉంటున్నాం. వీధిదీపాలు సైతం లేకపోవడంతో రాత్రివేళల్లో విషసర్పాలు వస్తున్నాయి. -శృంగారపాటి లక్ష్మి, పేరుకలపూడి
డ్రైనేజీ సమస్య పరిష్కారానికి ప్రణాళిక రూపొందించాం
డ్రైనేజీ సమస్యను పరిష్కరించేందుకు ప్రణాళికలు రూపొందించాం. రెండు మూడు రోజుల్లో గ్రామంలో మురుగు కాల్వ పూడికతీత పనులు ప్రారంభిస్తాం. గ్రామంలోని ప్రధాన సమస్యలను గుర్తించి వాటి పరిష్కారం కోసం కృషి చేస్తాం. -శ్రీనివాసరావు, పంచాయతీ కార్యదర్శి