అభివృద్ధి పనుల్లో రాజకీయాలు తగదని, ప్రజల కష్టాలు తీర్చేందుకు పార్టీలకతీతంగా అందరూ ముందుకు రావాలని పలమనేరు ఎమ్మెల్యే అమరనాథరెడ్డి కోరారు.
పలమనేరు: అభివృద్ధి పనుల్లో రాజకీయాలు తగదని, ప్రజల కష్టాలు తీర్చేందుకు పార్టీలకతీతంగా అందరూ ముందుకు రావాలని పలమనేరు ఎమ్మెల్యే అమరనాథరెడ్డి కోరారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపొందిన మున్సిపాలిటీలు, ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాలపై శీతకన్ను తగదని అన్నా రు. పట్టణంలోని రంగబాబు సర్కిల్ వద్ద దాతల సాయంతో ఏర్పాటు చేసిన పెద్ద మసీదు వీధి బోర్డును గురువారం ఆయన స్థానిక పార్టీ నేతలతో కలసి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీలో అభివృద్ధి పనుల కోసం దాతలు ముందుకు రావడం చాలా సంతోషకరమైన విషయమన్నారు.
ప్రభుత్వం నుంచి నిబంధనల మేరకు అందాల్సిన నిధులు కూడా సక్రమంగా రాకపోతే అభివృద్ధి పనులు ఎలా చేయాలని ప్రశ్నించారు. ఎన్నికలప్పుడు మాత్రమే రాజకీయాలు చేయాలని హితవుపలికారు. పలమనేరుకు ఐదు దఫాలొచ్చిన మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా అమలుకు నోచుకోలేదని తెలిపారు. పురపాలక సంఘ పరిధిలో బోర్లు, సిమెంట్ రోడ్లు ఏర్పాటు చేస్తామన్న ఆయన దానికి సంబంధించి నిధులు విడుదలయ్యేలా చేస్తే సంతోషిస్తామన్నారు.
పట్టణంలో మంచి నీటి సమస్యను పరిష్కరించేందుకు కౌన్సిల్ పలుచోట్ల బోర్లు వేసేందుకు ప్రయత్నిస్తే అధికార పార్టీ అడ్డుకున్న విషయాన్ని ప్రస్తావించారు. శాశ్వతంగా పట్టణ దాహార్తిని తీర్చేందుకు అధికార పార్టీ కృషి చేస్తే వైఎస్సార్ సీపీ తరఫున తప్పక అభినందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ చాంద్‌బాష, కో-ఆప్షన్ సభ్యులు సీవీ.కుమార్, కౌన్సిలర్లు కిరణ్, హరిక్రిష్ణారెడ్డి, శ్యామ్‌సుందర్, కోదండరామ య్య, వైఎస్సార్‌సీపీ పట్టణ కన్వీనర్ హేమంత్‌కుమార్‌రెడ్డి, నాయకులు మండీసుధా, ఖాజా, కమాల్, జాఫర్, శ్యామ్, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావ్ పాల్గొన్నారు.