
మా దృష్టికి రాలేదు.. వచ్చినప్పుడు చూస్తాం
రైతుల పొదుపు ఖాతాల స్తంభనపై ఏపీ మంత్రి ప్రత్తిపాటి
రుణ మాఫీపై ఎప్పటికి స్పష్టత వస్తుందో చెప్పలేం
హైదరాబాద్: రైతుల వ్యక్తిగత పొదుపు ఖాతాలను స్తంభిం పజేస్తున్న విషయం ప్రభుత్వం దృష్టికి రాలేదని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. రైతులు తమ వ్యక్తిగత ఖాతాల్లో దాచుకున్న నగదును డ్రా చేసుకోవడానికి వీలులేకుండా బ్యాంకులు ఆంక్షలు విధించడమే కాకుండా తీసుకున్న వ్యవసాయ రుణాల బకాయి కింద లాగేసుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాయని ‘సాక్షి’ బుధవారం కథనాన్ని ప్రచురించింది. బుధవారం మంత్రి సచివాలయంలోని తన చాంబర్‌లో మీడియా సమావేశంలో మాట్లాడినప్పుడు విలేకరులు ఈ అంశం ప్రస్తావించగా.. అది తమ దృష్టికి రాలేదని ఆయన బదులిచ్చారు. తమ దృష్టికి వచ్చినప్పుడు అలా చేయొద్దని బ్యాంకులకు ఆదేశాలిస్తామని చెప్పారు.
మాఫీపై స్పష్టత ఎప్పుడో చెప్పలేం...
రైతుల రుణ మాఫీపై ఆర్‌బీఐ నుంచి స్పష్టత వచ్చినా రాకున్నా తమ ప్రభుత్వం రుణమాఫీకి కట్టుబడి ఉందని ప్రత్తిపాటి పేర్కొన్నారు. నేరుగా నగదు ఇవ్వకపోయినా రుణమాఫీని ఇప్పటికే ప్రకటించామని.. త్వరలో నిర్దిష్ట గడువునూ ప్రకటిస్తామని చెప్పారు. అయితే ఎప్పటిలోగా అనే గడువు చెప్పలేమన్నారు. నేరుగా రుణమాఫీ చేయలేకపోయినా రైతులకు భరోసా కల్పిస్తామని పేర్కొన్నారు. కొత్త రుణాలు తీసుకోదలచిన వారు పాతవి చెల్లించి తీసుకోవచ్చని సలహా ఇచ్చారు. ఆర్‌బీఐ నుంచి ఆదేశాలు వచ్చే వరకు ఈ పరిస్థితి తప్పదన్నారు. రుణాలు చెల్లించినప్పటికీ ప్రభుత్వం ప్రకటించిన లక్షన్నర రూపాయల రుణమాఫీ వర్తిస్తుందని వివరించారు.
ఐ-ప్యాడ్లా..? ఉత్తిదే.. దృష్టి మరల్చడానికన్నాం..!
రైతులకు ఉపగ్రహ సమాచారాన్ని చేరువ చేసేందుకు ప్రతి రైతుకు ఐ-ప్యాడ్లు ఇవ్వాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిపాదన ప్రస్తుతానికి సంబంధించినది కాదన్నారు. రైతులు ఎక్కువ మంది వరి పంటపై దృష్టి సారిస్తున్నందున వారి దృష్టి మరల్చేందుకు ముఖ్యమంత్రి ఈ మాట చెప్పారని పేర్కొన్నారు. లాభసాటిగా ఉన్న వ్యవసాయ అనుబంధ రంగాలపై రైతులు దృష్టి సారించేలా చేసేందుకు ఐ ప్యాడ్ల ప్రస్తావన చేసినట్టు తెలిపారు. పరిస్థితులు అనుకూలిస్తే భవిష్యత్‌లో ఇస్తామన్నారు.