చెరో దారి
నిన్నటి వరకు గురుశిష్యులుగా మెలిగిన ఎంపీ రాయపాటి సాంబశివరావు, మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్‌లు ‘చెరోదారి’ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ బహిష్కరణకు గురైన రాయపాటి టీడీపీలోకి వెళ్లేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదని చెపుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఆయన రాజకీయ భవితవ్యం ఏమిటనేది అనుయాయులకు కూడా అంతు చిక్కడం లేదు. మరో వైపు తాను కాంగ్రెస్‌లోనే కొనసాగనున్నట్టు రాయపాటి శిష్యుడు మాణిక్యవరప్రసాద్ చెపుతున్నారు.
గుంటూరు: జిల్లాలో వరుసగా నాలుగుసార్లు ఎంపీగా గెలుపొంది ఢిల్లీలో చక్రం తిప్పిన రాయపాటి గతంలో తనకు కేంద్రమంత్రి పదవి దక్కనప్పుడు కాంగ్రెస్‌పై విమర్శలకు దిగిన సందర్భాలున్నాయి. టీటీడీ చైర్మన్ పదవి దక్కించుకోవాలనే ‘కల’ సాకారం చేసుకోలేనప్పుడు సైతం .. తన సీనియార్టీని కాంగ్రెస్ పార్టీ గుర్తించడం లేదంటూ ఆవేదన చెందారు. కొన్ని సందర్భాల్లో పార్టీపై వ్యతిరేకతను తన రాజకీయ సన్యాసంతో వ్యక్తపరిచేందుకు కూడా సిద్ధపడ్డారు. కేడర్‌ను పిలిపించుకుని అసమ్మతి సమావేశాలు ఏర్పాటు చేయగానే అధిష్టానం ఆయన్ను బుజ్జగిస్తూ వచ్చింది.
ఆ తరువాత చోటు చేసుకున్న పరిణామాల్లో రాయపాటి టీడీపీలో చేరనున్నట్లు వదంతులు వినిపించాయి. ఆయనా వాటిని ఖండించలేదు. అదేవిధంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఇటీవల ఢిల్లీలో నిరసన దీక్ష చేపట్టినప్పుడు రాయపాటి సంఘీభావం తెలిపిన సంగతి తెలిసిందే. తనతో పాటు మంత్రి డొక్కాను పార్టీలోకి తీసుకువస్తామని అప్పట్లో రాయపాటి సోదరులు చెప్పినట్లు టీడీపీ వర్గాల సమాచారం. అయితే, ఇన్నాళ్లూ వారిద్దరూ టీడీపీలో చేరకపోవడానికి నేరుగా చంద్రబాబుతో మాట్లాడి సీట్ల కేటాయింపుపై గట్టిహామీ కోసమే ‘డొక్కా’ ఆలస్యం చేసినట్లు చెపుతున్నారు.
తాజా పరిణామాలతో రాయపాటి సోదరులకు టీడీపీలో కూడా తలుపులు మూసుకు పోయాయని, వారు కోరుతున్న నరసరావుపేట పార్లమెంట్ సీటును రాయపాటికి ఇచ్చేందుకు చంద్రబాబు అంగీకరించలేదని తెలిసింది. దీంతో సోదరులిద్దరూ ఎటు వెళ్లాలో తేల్చుకోలేక మదనపడుతున్నారు. ప్రత్యామ్నాయ అవకాశంగా కిరణ్‌కుమార్‌రెడ్డి పెట్టే పార్టీలోకి చేరదామని సిద్ధపడుతున్నా అందుకు డొక్కా మాణిక్యవరప్రసాద్ అంగీకరించడం లేదని తెలిసింది. తాను కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని.. గురువుకు తెగేసి చెప్పినట్లు డొక్కా అనుచరవర్గం చెబుతుంది. అదేవిధంగా రాయపాటిని తిరిగి కాంగ్రెస్‌లోకి తీసుకువచ్చేందుకు మాణిక్యవరప్రసాద్ మంతనాలు జరుపుతున్నారు.
నాడు పొగడ్తలు.. గురుశిష్యుల నడుమ ‘అంతరం’ పలు అంశాల ఆధారంగా కొనసాగుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇటీవల డొక్కా మాణిక్యవరప్రసాద్ ముఖ్యమంత్రి కిరణ్‌ను తీవ్రపదజాలంతో దుయ్యబట్టారు. కిర ణ్‌కుమార్‌రెడ్డి రాజీనామా చేసిన మరుక్షణమే డొక్కా మాట్లాడుతూ చిరంజీవి నాయకత్వంలో పార్టీని నడిపించగలమని చెప్పారు. గతంలో ముఖ్యమంత్రిని అమెరికా అధ్యక్షుడు ఒబామాతో పోలుస్తూ పొగడ్తలతో ముంచెత్తారు. ఇప్పుడేమో దుయ్యబడుతున్నారు. ఇదిలావుంటే..ప్రస్తుతం ముఖ్యమంత్రి పదవికి అర్హులుగా మంత్రి కన్నా లక్ష్మీనారాయణ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. రాయపాటి ఇటీవల కన్నాను ముఖ్యమంత్రి చేస్తే తాను సహకరిస్తానని ప్రకటిం చారు.
ఆయన శిష్యుడు మాణిక్యవరప్రసాద్ మాత్రం మంత్రి కన్నా పేరు పలక కుండా కాపు సామాజిక వర్గంలో మరొక నేత చిరంజీవి ఉన్నారని గుర్తుచేస్తూ అధిష్టానం వద్ద వ్యూహాన్ని అనుసరిస్తున్నట్టు చెపుతున్నారు. గురుశిష్యులిద్దరూ కూడబలుక్కుని తమ రాజ కీయ పునాదులను పదిలం చేసుకునే క్రమంలోనే ఇలా వ్యవహరిస్తున్నారని పరిశీలకులు భావిస్తున్నారు. వర్గ శత్రువైన కన్నా లక్ష్మీనారాయణ ప్రాభవాన్ని తగ్గించాలని ప్రయత్నిస్తున్నారా అనే అనుమానాన్ని కూడా వ్య క్తం చేస్తున్నారు. ఏదిఏమైనా రాయపాటి సోదరులతో పాటు మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ రాజకీయ భవితవ్యం ఎటు మరలనుందో వేచిచూడాల్సిందే..!